ప్రేక్షక హృదయ సింహాసనానికి చక్రవర్తి. ఉగ్గబట్టిన శ్వాసతో ఏకబిగిన పెద్ద డైలాగులు సునాయాసంగా చెప్పిన డేరింగ్ హీరో. తెలుగు వెండితెరపై జేమ్స్ బాండ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. మన సినిమాకు సాంకేతికత అద్ది అద్భుతాలు సృష్టించిన ధీశాలి. హేమహేమీలు ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా ముందడుగు వేసిన ఘనుడు లెజెండరీ హీరో కృష్ణ.
నీటికి చలనం, నిప్పుకి జ్వలనం లానే మనిషికీ ఆశయాలుండాలి. కలలుండాలి. అవి పంట పండాలి. అలా తన కలలు నిజం చేసుకుని ఆశయ సాఫల్యం పొందిన అగ్రనటుడు సూపర్ స్టార్ కృష్ణ. 1943 మే 31 వ తేదీన గుంటూరు జల్లా బుర్రిపాలెంలో ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి జన్మించారు. ఏలూరు సీఆర్ఆర్ కాలేజీలో విద్యాభ్యాసం తర్వాత నాటకానుభవంతో సినీరంగం వైపు అడుగులు వేశారు.
ఆయన బి.ఎ. చదువుతున్న రోజుల్లో ఏలూరులో అక్కినేనికి జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. డిగ్రీ పూర్తై, ఇంజనీరింగ్ సీటు రాకపోయేసరికి తండ్రి అనుమతి తీసుకుని సినిమా ప్రయత్నాలు చేశాడు. కృష్ణ ఇష్టాన్ని అనుసరించి అతని తండ్రి రాఘవయ్య చౌదరి తనకు తెలిసిన సినిమా వారికి పరిచయం చేస్తూ ఉత్తరాలు రాసిచ్చి మద్రాసు పంపారు. మద్రాసులో తన తెనాలికి చెందిన సినీ ప్రముఖులు కొంగర జగ్గయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, చక్రపాణి వంటి వారిని కలిసి తన ఉద్దేశాన్ని చెప్పాడు. కృష్ణ వయసు రీత్యా చిన్నవాడు కావడంతో, కొంతకాలం ఆగి మద్రాసుకు తిరిగిరమ్మని వారు సలహా ఇచ్చారు. దాంతో కృష్ణ నాటకాల్లో నటించి అనుభవం సంపాదించాలని ప్రయత్నించాడు.
మద్రాసులోనే "చేసిన పాపం కాశీకి వెళ్ళనా?" నాటకంలో శోభన్ బాబుతో కలిసి నటించాడు. తర్వాత కమ్యునిస్టు నాయకుడు, ప్రజాకళాలకు పెట్టింది పేరైన ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు దర్శకత్వంలో విజయవాడ జింఖానా మైదానంలో ప్రదర్శించిన ఛైర్మన్ నాటకంలో ఛైర్మన్ కుమారుడి పాత్ర పోషించాడు. తిరిగి మద్రాసు వచ్చి ప్రయత్నాలు ప్రారంభించగా ఎల్.వి.ప్రసాద్ తీస్తున్న కొడుకులు - కోడళ్ళు సినిమాలో ఓ పాత్రకు ఎంపిక చేశారు. దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. అయినా పట్టువదలకుండా మద్రాసులో అవకాశాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. గంటల తరబడి అద్దం ముందు నిలబడి నటన ప్రాక్టీసు చేయమని స్నేహితులు సలహా ఇస్తే వేషాల కోసం కష్టాలు పడడం ఏమిటి? అదృష్టం ఉంటే వేషాలే వెతుక్కుంటూ వస్తాయని కొట్టిపారేసేవాడు. సినిమా ప్రయత్నాలు చేస్తున్న దశలోనూ ఇబ్బందులేమీ పడలేదు. ఎప్పుడు డబ్బు అవసరమైన ఇంటికి ఉత్తరం రాస్తే, కృష్ణ తల్లి కావాల్సినంత డబ్బు పంపేది. రోజూ సెకండ్ షో సినిమాలు చూస్తూ, పగలు సినిమాల్లో వేషాల కోసం తెలిసినవారిని కలుస్తూ ప్రయత్నాలు చేశాడు.
ఎవరికీ కష్టాలు కలకాలం ఉండవు అంటారు కదా. అలాగే కృష్ణ జీవితంలో కూడా వెండితెరపై కనబడే ఘడియలు వచ్చేశాయి. ఆయన నిరీక్షణలకు ఫుల్‌స్టాప్ పడే సమయం ఆసన్నమైంది. ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా మొదట ఒక అడుగుతోనే ప్రారంభం అవుతుంది అన్నట్టుగా చిన్న పాత్రలతో మొదలై చిత్రరంగాన్ని ఏలే ఛాన్స్ వచ్చేసింది.
1962లో కొంగర జగ్గయ్య నిర్మించిన "పదండి ముందుకు", అక్కినేని కులగోత్రాలు, 1963లో పరువు ప్రతిష్ఠ, 1964లో ఏఎన్‌ఆర్ మురళీకృష్ణ సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. అదే 1964లో నూతన నటీనటులతో సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్న ఆదుర్తి సుబ్బారావు తన చిత్రం ‘తేనెమనసులు’కు ఇద్దరు హీరోలలో ఒకరిగా కృష్ణను తీసుకున్నారు. మరొకరు రామ్ మోహన్. ఆ చిత్రం నుంచి ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి పేరు కృష్ణ గా మారింది. మారింది పేరే కాదు. మారబోయే చరిత్రకు నాంది పలికిందీ ఆ పేరే. అనేక సాహసిక, చారిత్రక ఘట్టాలకు దారితీసిన కృష్ణ అనే ఆ రెండక్షరాలే.. మంత్రాక్షరాలై ఐదున్నర దశాబ్దాలు చిత్రసీమకు కొత్త కథ రాశాయి. నవ్య నగీషీలు అద్దాయి. తేనె మనసులు తొలి సాంఘీక ఈస్ట్ మన్ కలర్ సినిమాగా రంగుల హరివిల్లు ఆవిష్కరించింది. సినిమాలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటే ఆదరణ ఖాయమని కృష్ణ నిర్ధారణకు వచ్చారు. ఓ పక్క నటిస్తూనే సినిమాలలో దర్శకత్వశాఖను, సాంకేతిక సొబగులను పరిశీలించేవారు. అప్పటికి పౌరాణిక చిత్రాలలో ఎన్టీఆర్, సాంఘిక చిత్రాలలో ఏఎన్నాఆర్, అడపాదడపా జానపద చిత్రాలకు కాంతారావు మేటి నటులుగా గుర్తింపు పొందారు. హేమాహేమీలున్న చోట.. తన మనుగడకోసం కొత్తదనంతో రావాలన్న ఆకాంక్ష కృష్ణలో మొగ్గ తొడిగింది. దాదాపు అదే సమయంలో సినిమా రంగంలో ప్రవేశించిన నిర్మాత డూండీ, సుందర్ లాల్ నహతా వినూత్న కథాంశంతో సినిమా నిర్మించాలని భావిస్తున్నారు. అలా వారి మధ్య భావసారూప్యత నూతన ఆవిష్కరణలకు నాంది పలికింది. తేనెమనసులు సినిమాలో స్కూటర్‌తో కారును ఛేజ్ చేస్తూ, స్కూటర్‌ను వదిలేసి కారు మీదికి జంప్ చేసే సన్నివేశం చూసి, డూప్ లేకుండా కృష్ణ ఆ సన్నివేశంలో నటించిన సంగతి తెలుసుకున్న నిర్మాత డూండీ తన జేమ్స్‌బాండ్ చిత్రానికి హీరోగా ఎంపిక చేశాడు. కేఎస్ఆర్ దాస్ అనే నూతన దర్శకుడు కృష్ణ హీరోగా, జయలలిత హీరోయిన్‌గా తీసిన 'గూఢచారి 116' ఆ రోజుల్లో ఓ పెద్ద సంచలనం. అప్పట్లో డిటెక్టివ్ నవలలు విపరీతంగా చదివే అలవాటున్న జనం దానిని తెలుగులో తెరపై చూడటంతో ఉబ్బితబ్బిబ్బయారు. విదేశాలకు రహస్యాలు చేరవేసే వారికి ఉప్పందిస్తున్న దేశద్రోహుల ముఠాను మట్టుబెట్టే ప్రయత్నంలో గూఢచారి-303 బలైపోతాడు. ఆతని హత్యను చేధించటానికి, ప్రభుత్వం గూఢచారి-116 ను నియమిస్తుంది. అతడు ఎలా విద్రోహుల ఆటకట్టించాడన్నది ఉత్కంఠభరితంగా వెండితెరకు ఎక్కించారు దర్శకుడు మల్లికార్జునరావు. ఆ చిత్రం సూపర్‌హిట్ అవటంతో ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా కృష్ణ గుర్తింపు పొందారు.
ఈ విజయంతో కృష్ణ ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యాడు. గూఢచారి 116 వల్ల కృష్ణకు వచ్చిన ఇమేజీ ప్రభావం చాన్నాళ్లు ఉంది. 2 దశాబ్దాల్లో మరో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేసిన కృష్ణకు దాదాపు అన్నీ విజయాన్ని సంపాదించిపెట్టాయి. 1967లో కృష్ణ నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. ఆ ఏడాది బాపు దర్శకత్వంలో కృష్ణ తొలిసారి విజయనిర్మలతో నటించిన సాక్షి మరో హిట్ మూవీ. ఇందులో పాటలు మధుర తుషారంలా మనసు తాకుతాయి. అదే ఏడాది త్రిలోక్ చందర్ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘అవే కళ్లు’ మరో సంచలన చిత్రంగా నిలిచింది. ఘంటసాల, పిఠాపురం నాగేశ్వరరావు, పాడిన పాటలు ఉర్రూతలూగించాయి.
కృషి ప్లస్ కసి కలిస్తే కృష్ణ. కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికి అర్థం కృష్ణ. ఆయన పట్టిన పట్టు విడవని పట్టుదలకు ప్రతిఫలం దక్కింది. 1968లో కృష్ణ నటించిన 10 సినిమాలు విడుదలయ్యాయి. 1969లో రికార్డు స్థాయిలో 19 సినిమాలు విడుదలయ్యాయి. ఖాళీగా ఉండటం తనకు అస్సలు నచ్చకపోవటం వలన, మొహమాటం మెతకదనం వలన కాదనకుండా సినిమాలకు ఒప్పుకున్న కృష్ణ కంటి మీద కునుకు లేకుండా పదేళ్లు చాలా కష్టాలు పడ్డారు.
తనకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టే సినిమాలు తీయాలని ఆశించి 1970లో తన స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయా పిక్చర్స్‌ను తమ్ముళ్లు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులతో కలిసి కృష్ణ ప్రారంభించారు. పద్మాలయా వారి మొదటి సినిమాగా అగ్నిపరీక్ష పెద్ద విజయం సాధించలేదు. అయితే రెండవ సినిమాగా 1971లో తీసిన మోసగాళ్లకు మోసగాడు మాత్రం భారీ విజయాన్ని, సాహసిగా కృష్ణకు పేరును తెచ్చిపెట్టింది. మోసగాళ్ళకు మోసగాడు ఆంగ్లంలోకి ట్రెజర్ హంట్ పేరిట అనువాదమై 123 దేశాల్లో విడుదలైంది, మంచి విజయాన్ని సాధించింది. కృష్ణ ఆశించిన విధంగా అతనికి స్టార్ హోదా సాధించిపెట్టింది.
1972లో నటుడు ప్రభాకర రెడ్డిని భాగస్వామిగా తీసుకుని కుటుంబ కథాచిత్రమైన పండంటి కాపురం నిర్మించాడు. ఇదీ మంచి విజయాన్ని సాధించింది. 1974లో స్వంత బ్యానర్‌పై అల్లూరి సీతారామరాజు సినిమా తీశాడు. 1973లోనే కృష్ణ, విజయనిర్మల కలిసి విజయకృష్ణా నిర్మాణ సంస్థని స్థాపించి విజయనిర్మల దర్శకురాలిగా తొలి సినిమా నవలా చిత్రం మీనా మంచి విజయాన్ని సాధించింది. ఈ దశలో కృష్ణకు మంచి హిట్స్ ఇచ్చినవి క్రైం సినిమాలు. 1968-1970 మధ్యకాలంలో పలు క్రైమ్ సినిమాలు చేసినా 1970లో వచ్చిన పగ సాధిస్తా సినిమా ఈ జానర్‌లో కృష్ణ దశ మార్చింది. దీని తర్వాత రెండేళ్లలో కృష్ణ నటించిన ఎనిమిది క్రైం సినిమాలు విడుదలయ్యాయంటే దీని ప్రభావం అర్థం చేసుకోవచ్చు.
హీరో కృష్ణ నిరంతర నవ్యతాన్వేషి. ఆ సమయంలో మద్రాసులో బ్రహ్మాండంగా జనాదరణపొందిన ఇంగ్లీష్ సినిమా మెకన్నాస్ గోల్డ్ పై కృష్ణ దృష్టిపడింది. మెకన్నాస్ గోల్డ్, ఫ్యూ డాలర్స్ మోర్, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ లాంటి సినిమాలను కలుపుకుని ఓ కథ తయారుచేసి తెలుగులో కౌబాయ్ సినిమా చేయాలన్న కృష్ణకు వచ్చింది. కృష్ణ ఆ బాధ్యతలను ఆరుద్రకు అప్పగించారు. తెలుగు వాతావరణానికి కౌబాయ్ నేపథ్యాన్ని కలుపుతూ ఆరుద్ర ఆల్‌రౌండర్ పాత్ర పోషించి కథ, చిత్రానువాదం, మాటలు, పాటలు అన్నీ రాశారు. స్క్రిప్ట్ పూర్తి చేసి నిర్మాతలైన కృష్ణ సోదరులకు ఇచ్చాకా వారికి అది బాగా నచ్చేసింది. దాంతో ఈ సినిమాకు ఆరుద్ర దర్శకత్వం వహిస్తేనే బావుంటుందని వారు కోరారు. దానిని ఆయన సున్నితంగా తిరస్కరించటంతో ఆ అదృష్టం కేఎస్ఆర్ దాస్‌ను వరించింది. ఆ సినిమాకి మొదట "అదృష్టరేఖ" అన్న పేరు ఖరారు చేసి చివరకు "మోసగాళ్ళకు మోసగాడు" అన్న పేరు ఫైనల్ చేశారు. అలా తొలి తెలుగు కౌబోయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ ఓ ట్రెండ్ సెట్టర్ హిట్టర్‌గా నిలిచింది. అనేక జాతీయ భాషలలో అనువాదమైంది. ట్రెజర్ హంట్‌గా దేశవిదేశీ ప్రేక్షకులను అలరించింది. ఇప్పట్లో బాహుబలిలా అప్పట్లో అంత సంచలన రికార్డులు సృష్టించింది "మోసగాళ్లకు మోసగాడు" మూవీ.
గూఢచారి -116 తర్వాత హీరో కృష్ణ పంథా మార్చుకున్నారు. ఒకవైపు యాక్షన్ చిత్రాలు, మరో వైపు కుటుంబ కథా చిత్రాలలో సమాంతరంగా నటించారు. ఈ నేపథ్యంలో వచ్చిన సినిమా లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించిన ‘పండంటి కాపురం’. ఇది సిల్వర్ జూబిలీ వేడుకల చిత్రంగా నిలిచింది. ఆర్ధిక కారణాలతో ఉమ్మడి కుటుంబాల ప్రచ్ఛన్న యుద్ధాలకు, విచ్ఛిన్నాలకు దారితీసే పరిస్ధితిని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమాలో పాటలన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. థియేటర్లకు రప్పించాయి. జయసుధ తన అసలు పేరు సుజాతగా బాలనటిగా వెండితెరంగేట్రం చేసిన సినిమా పండంటి కాపురం. 1973లో ప్రేక్షకులను అలరించిన కుటుంబ కథా చిత్రం కృష్ణ-శోభన్ బాబు మల్టీ స్టారర్ సినిమా పుట్టినిల్లు-మెట్టినిల్లు. సిరిమల్లె సొగసు-జాబిల్లి వెలుగు అంటూ ఏఎం రాజా, సుశీల వినసొంపుగా పాడారు.
సాయుధ పోరాటంతో గిరిజనుల బ్రతుకు మారేటి, వెతలు తీరేటి ఉద్యమం చేపట్టిన విప్లవజ్యోతి, తెలుగువారిఖ్యాతి, తరతరాలకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు. తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించి, గుండెల్లో నిద్రించిన సింహస్వప్నం. అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు చరిత్రను వెండితెరపై ఒక మహాద్భుత దృశ్యకావ్యంగా మలిచిన ఘనత హీరో కృష్ణకు దక్కింది. సూపర్ స్టార్ నటించిన 100 చిత్రంగా ఖ్యాతిని అందుకుంది.
అల్లూరి సీతరామరాజు పాత్రలో కృష్ణ
తెల్లదొరల దుష్పరిపాలను తుదముట్టించాలని పిలుపునిచ్చిన తెలుగువీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. ఈ చరిత్రను తరతరాలకు స్ఫూర్తిగా అందించేందుకు సినిమాగా తేవటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. నటరత్న ఎన్టీరామారావు ఎన్నాళ్లుగానో స్క్రిప్టు సిద్ధం చేసుకున్నట్లు చెబుతుండేవారు. ఒక దశలో కొందరు నిర్మాతలు అల్లూరి సీతారాజు కథ తెరకి ఎక్కించాలని అక్కినేని, శోభన్‌బాబు ముందుకు ప్రతిపాదన చేసినా వారు ముందుకురాలేదట. ఇటువంటి సమయంలో హీరో కృష్ణ త్రిపురనేని మహారథితో స్క్రిప్టు రాయించారు. చలికి జడవక, వ్యాధులకు వెరవక హీరో కృష్ణ మూడు నెలలు విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో బసచేసి ఈ సినిమా షూటింగ్ చేశారు. అల్లూరి సీతారామరాజు 1974 మే ఒకటో తేదీన విడుదలై తెలుగునాట ఘనవిజయం సాధించింది. తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రంగా నిలిచింది. హీరో కృష్ణ వీరోచితంగా, హీరోచితంగా నటించారు. సీతారామరాజు డైలాగులకు ప్రేక్షకులకు అణువణువూ పులకించింది. సినిమా 19 కేంద్రాల్లో వందరోజులు ఆడింది. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. సినిమాలో తెలుగు వీర లేవరా పాట రాసిన మహాకవి శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం వరించింది. ఈ సినిమాలో నాడు పరిశ్రమలో వున్న నటీనటులంతా నటించారు. ఈచిత్రం షూటింగ్ జరిగినన్ని రోజులూ మద్రాసులో ఆర్టిస్టుల కొరతతో 10-15 సినిమాలు నిర్మాణం ఆగిపోయింది. విజయావారి "మాయాబజార్" తర్వాత అంత మంది నటీనటులు పాల్గొన్న చిత్రం "అల్లూరి సీతారామరాజు". 1977లో హీరో కృష్ణ మరో సాహసం చేశారు. చారిత్రక సినిమాలే కాదు. వైవిధ్యానికి పరితపించే హీరో కృష్ణ 1974లో అతిరథమహారథ నటులతో ఒక సాహసం చేశారు. పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ‘కురుక్షేత్రం’ సినిమా నిర్మించారు. అదే సమయంలో ఎన్టీరామారావు దానవీరశూరకర్ణ చిత్రాన్ని కృష్ణుడు, సుయోధనుడు, కర్ణుడు పాత్రలను తనే ధరించి, దర్శకత్వం వహించారు. సాంకేతికంగా కురుక్షేత్రం విజయం సాధించినా.. దానవీరశూరకర్ణ కమర్షియల్ హిట్ కొట్టింది.
1976 పల్లెల మట్టి పరిమళాలను, మమతా అనురాగాలను మోసుకొచ్చిన సినిమా పాడిపంటలకు ప్రేక్షకులు జేజేలు పలికారు. 1978లో రజనీకాంత్‌తో కలిసి 'అన్నదమ్ముల సవాల్', ఏజెంట్ గోపీ, కుమారరాజా సినిమాలు బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచాయి. వెండితెరపై కృష్ణ ఇంద్రధనస్సు సినిమా విరిసింది. ప్రేక్షకలోకం మురిసింది. 1981లో ఊరికి మొనగాడు అద్భుత విజయాన్ని అందించింది.
పండంటి కాపురాలే కాదు. ఉండమ్మా బొట్టుపెడతా, పచ్చని సంసారం, పచ్చని కాపురం లాంటి కుటుంబ కథా చిత్రాలతో హీరో కృష్ణ మహిళా ప్రేక్షకులను అలరించారు. మూస చిత్రాలలో నటించకుండా, కొన్ని మణిపూసల్లాంటి సినిమాల్లో పలకరించి వెళుతుంటారు. నవ్యత, వైవిధ్యం ఆయన ప్రాణం. సినీ శ్రామికుడు. పారిశ్రామికుడు. అనేక షిఫ్టులలో ఎప్పుడూ ఆయన ఓ కర్మాగారంలా నడుస్తుండటంతో కార్మికులు పెద్ద సంఖ్యలో ఉపాధి పొందారు. ప్రతి సినిమాకూ తనకు తానే ఒక ఇమేజీ సృష్టించుకునే కృష్ణ ఏ ఇమేజీ చట్రంలో ఇమడలేదు.
1980వ దశకంలో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బాపయ్య కాంబినేషన్‌లో కృష్ణ అనేక హిట్ మూవీస్ చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 9 సినిమాలు చేయగా అన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. అన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ కొట్టాయి. కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, ఊరికి మొనగాడు, ప్రజారాజ్యం, చుట్టాలొస్తున్నారు జాగ్రత్త, బండోడు గుండమ్మ, కృష్ణార్జునులు, ముందడుగు, ఇద్దరు దొంగలు, వజ్రాయుధం, అగ్నిపర్వతం, ఈనాడు, జయం మనదే, అడవి సింహాలు వంటి అనేక శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇది కృష్ణ కెరియర్‌లోనే బెస్ట్ పిరియడ్ అని చెప్పాలి.
తెలుగు చిత్రసీమలో సంచలన విజయం సింహాసనం. హీరో కృష్ణ దర్శకత్వం వహించి ద్విపాత్రాభినయం చేసిన సినిమా. తెలుగులో తొలి 70 ఎంఎం చిత్రం, అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాగా, తొలి డాల్బీ చిత్రంగా అనేక రికార్డులు నమోదు చేసింది. సింహాసనం ద్వారా బాలివుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరిని, నూతన గాయకుడు రాజ్ సీతారామ్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
పాన్ ఏసియా సినిమాలు, ప్రపంచ స్థాయి సినిమాలకు హీరో కృష్ణ శ్రీకారం చుట్టారు. ఆయన ఆధునికతకు ఆద్యుడు. తొలి సినిమా స్కోప్, తొలి 70 ఎంఎం, మొట్టమొదటి డీటీఎస్, తొట్ట తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్ చిత్రాన్ని తీసుకొచ్చిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కింది.
1988లో కృష్ణ స్వీయ దర్శకత్వంలో కుమారులు రమేష్, మహేష్ లతో కలసి కొడుకు దిద్దిన కాపురం సినిమా నిర్మించి, నటించి, తండ్రీ, కుమారులు అభిమానులకు కనువిందు చేశారు. కృష్ణకు 90వ దశకం దాకా విపరీతమైన బిజీ ఉండేది. కొన్ని సంవత్సరాల పాటు మూడు షిఫ్టులు పనిచేశారు. ఉదయం, మధ్యాహ్నం మాత్రమే కాక మూడో షిఫ్ట్ రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఉండేది. చివరికి నిద్రపోతున్న సమయంలో కాస్ట్యూమ్స్ వేసుకుని పడుకుంటే నిద్రిస్తున్న సన్నివేశాలు చిత్రీకరించుకున్న సందర్భాలు ఉన్నాయి.
1994లో హీరో కృష్ణ కొత్త గ్లామర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంవత్సరం. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన నెంబర్ -1 సినిమాలో హీరో కృష్ణ వైవిధ్య డ్రెస్సులలో, వివిధ గెటప్ లలో కన్పించారు. నృత్యాలలో స్టెప్పులు సైతం మారిపోయాయి. 1993లో పచ్చని సంసారం 1994లో నెంబర్ వన్, 1995లో అమ్మదొంగా వరుస హిట్స్. 1995 జనవరి 1వ తేదీన కృష్ణ నటించిన 300 వ సినిమా తెలుగు వీరలేవరా. ఒక గ్యాంగ్ స్టర్ ఆటకట్టించే ఆఫీసర్ రామరాజు పాత్రలో హీరో కృష్ణ నటించారు. 1996లో సంప్రదాయం, 1997లో ఎన్ కౌంటర్ సినిమాలు ప్రేక్షకుల విజయాన్ని అందుకొన్నాయి. 1999లో తనయుడు మహేశ్ తో రాజకుమారుడు విజయవంతమైంది. 2000 సంవత్సరంలో మహేష్ బాబుతో కలిసి కృష్ణ "వంశీ" చిత్రంలో, 2001లో పండంటి సంసారంలో నటించారు. 2005లో ఆయన నటించిన ఎవరు నేను, సీబీఐ ఆఫీసర్, శ్రావణ మాసం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఏసుక్రీస్తు పాత్రలకు విజయచందర్ నే చెప్పుకుంటారు. కానీ 2004లో శాంతి సందేశం చిత్రంలో కృష్ణ జీసస్ క్రీస్తుగా నటించి మెప్పించారు. 2009లో సూపర్ స్టార్ కృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తిస్తూ కేంద్రం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది.
తండ్రి కృష్ణతో మహేశ్‌బాబు
కృష్ణ సినిమాల్లో అనేకం రికార్డులే. డైరెక్టర్లు, హీరోయిన్లు..అతిథి పాత్రలు..అన్నింటా రికార్డే. హీరో కృష్ణ 111 మంది డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేశారు. 76 మంది హీరోయిన్లు ఆయన సరసన నటించారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న నుంచి 2013లో వచ్చిన సుకుమారుడు దాకా 31 సినిమాల్లో అతిథి పాత్రల్లో వెండితెరమీద తళుక్కుమన్నారు. పదిహేను సినిమాలకు దర్శకత్వం వహించారు. సింహాసనం చిత్రంలో దర్శకుడుగా ఉంటూనే ద్విపాత్రాభియం చేశారు.
హీరో కృష్ణ సంచలన రికార్డులకు అంతులేదు. మల్టీ స్టారర్ మూవీస్ ద్వారా నటీనటుల మధ్య ఒక ఆరోగ్యప్రదమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే బహుళ కథానాయకుల చిత్రాలకు ఎక్కువ చొరవ తీసుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణనే అని చెప్పవచ్చు. మల్టీ స్టారర్, కౌబోయ్, లవ్ బోయ్, యాక్షన్, థ్రిల్లర్, వెస్ట్రన్ క్లాసిక్, పౌరాణికం, డ్రామా, సాంఘిక, చరిత్రాత్మక, జానపద సినిమాలలో నటించింది హీరో కృష్ణ ఒక్కరే.
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయన నటించినన్ని మల్టీ స్టారర్లు మరెవరూ చేయలేదు. వాటిలో ఎన్టీఆర్‌తో దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు వగలమారి భర్తలు చిత్రాల్లో నటించారు. అక్కినేనితో గురుశిష్యులు, హేమాహేమీలు, శోభన్ బాబుతో గంగ-మంగ, మండే గుండెలు, ఇద్దరు దొంగలు, ముందడుగు ముఖ్యమైనవి. కృష్టంరాజుతో మనుషులు చేసిన దొంగలు, అడవి సింహాలు, విశ్వనాథ నాయకుడులో నటించారు. రజనీకాంత్‌తో 'అన్నదమ్ముల సవాల్", రామ్ రాబార్ట్ రహీమ్, చిరంజీవితో తోడుదొంగలు వంటి పలు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. కృష్ణంరాజు కెరియర్‌లో మంచి హిట్ ఇచ్చిన కటకటాల రుద్రయ్య, చిరంజీవి కెరియర్‌ను మలుపు తిప్పిన ఖైదీ ఈ రెండు సినిమాల్లో మొదట కృష్ణనే హీరోగా పెట్టి తీయాలి అనుకున్నా ఆయన డేట్స్ సర్దుబాటు కాలేదు. తనతో సినిమా తీసి ఏ నిర్మాత అయినా ఆర్థికంగా నష్టపోతే తానే నిర్మాత వద్దకు వెళ్ళి వాళ్ళకు కలిగిన నష్టాన్ని పూరించేందుకు తనకు అడ్వాన్స్ కూడా ఇవ్వకుండానే వెంటనే మరో సినిమా ప్లాన్ చేయమని డేట్లు ఇచ్చేవారు. విడుదలకు ముందు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే తన పారితోషికం వదులుకునేవాడు మనస్సున్న మనిషి. వరదలు, విపత్తులు వచ్చినప్పుడు సినీపరిశ్రమలో అందరికంటే ఎక్కువ విరాళం ఇచ్చేవారు. వెంటనే స్పందించేవారు. ఊరూరా తిరిగి జోలెపట్టి నిధులు సమీకరించి కూడా అందచేశారు. ప్రతీ ఏడాది ఎండాకాలం షూటింగులన్నీ ఊటీలోనే ప్లాన్ చేసుకునేవారు. వేలమంది అభిమానుల సమక్షంలో మే 31న తన పుట్టినరోజు ఊటిలోనే జరుపుకునేవారు. హీరోగా తొలి అవకాశాలు ఇచ్చి తన జీవితం మలుపు తిప్పిన ఆదుర్తి సుబ్బారావు, డూండీల పట్ల కృష్ణ ఎప్పుడూ కృతజ్ఞతతో వ్యవహరించారు. ఆదుర్తి సుబ్బారావు మరణించినప్పుడు పాడిపంటలు సినిమా కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అవుట్‌డోర్ షూటింగ్ కోసం వెళ్లిన కృష్ణ, అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఏ దారీ లేకపోతే హిందూ పత్రిక వాళ్ళు వాడే ప్రత్యేక విమానంలో వారిని అభ్యర్థించి ప్రయాణించారు. ఆదుర్తి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆదుర్తి స్వంత బ్యానర్ రవి కళామందిర్ బ్యానర్ మీద లాభం వస్తే ఆదుర్తి కుటుంబం తీసుకునేట్టు, నష్టం వస్తే కృష్ణ భరించేట్టు తాను హీరోగా పంచాయితీ, సిరిమల్లె నవ్వింది, రక్త సంబంధం సినిమాలు చేసిపెట్టాడు. ఆదుర్తి సుబ్బారావు కొడుకు సాయి భాస్కర్‌ను తన సినిమాల్లో సహాయ దర్శకుడిగా తీసుకుని, తర్వాత దర్శకుడిగా పరిచయం చేస్తూ పచ్చ తోరణం సినిమా చేశాడు. పద్మాలయా టెలీఫిల్మ్స్ ఏర్పాటు చేసి టెలివిజన్ వ్యాపార రంగంలోకి దిగినప్పుడు సాయి భాస్కర్‌కే ఆ బాధ్యతలు అప్పగించి ఎలాగైనా ఆదుర్తి కుటుంబాన్ని సెటిల్ చేయాలని పదే పదే ప్రయత్నించారు సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తనను ఆదరించిన నటుడు కొంగర జగ్గయ్య, రచయిత కొడాలి గోపాలరావు వంటి వారందరినీ తను విజయాల్లో ఉన్నప్పుడు గౌరవంగా చూసుకుని, అవకాశాలు ఇచ్చేవాడు. ఆర్థికంగా చితికిపోయిన తన తోటి కథానాయకులు, స్నేహితులకు ఆర్థికంగా బాసటగా నిలబడేవాడు. అల్లూరి సీతారామరాజు దర్శకుడు వి.రామచంద్రరావు ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయిన కొన్నాళ్ళకే అనారోగ్యంతో మరణించారు. సినిమాను కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించి పూర్తిచేసినా టైటిల్స్‌లో మాత్రం దర్శకుడిగా వి.రామచంద్రరావు పేరే వేశారు. శోభన్ బాబు సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడని తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్ళి మరీ హేమాహేమీలు సినిమా చేద్దామని కృష్ణ ఆఫర్ చేశారట. శోభన్ బాబు కూడా ఈ విషయంలో చాలా సంతోషించాడు. అయితే చివరి నిమిషయంలో శోభన్ బాబు తప్పుకోవడంతో నాగేశ్వరరావు కాంబినేషన్‌లో ఆ సినిమా తీశాడు. వెండితెర మీదే కాదు. తెరవెనుక కూడా కృష్ణది వెన్నలాంటి మనస్సు. తెల్లకాగితంలా స్వచ్ఛమైన మనస్సు. సాటి మనిషికి సాయపడే గుణమున్న సహృదయుడు. అందుకే అభిమానులు ఆయన్ను నెత్తిన పెట్టుకుని పూజించేవారు.
కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవి. ఆయన అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30 వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలివచ్చారు. 1980ల్లో వరుసగా సినీ వారపత్రిక జ్యోతి చిత్ర నిర్వహించిన ఐదు పర్యాయాలు సూపర్ స్టార్‌గా అభిమానలోకం పట్టం కట్టింది. థ్రిల్లర్, క్రైమ్, కౌబోయ్, జేమ్స్‌బాండ్ వంటి కొత్త జానర్‌లు, డీటీఎస్, డాల్బీ, స్కోప్, 70 ఎమ్ఎమ్ వంటి సాంకేతికాంశాలు ప్రవేశపెట్టిన ఖ్యాతి కృష్ణదే. అంతేకాదు రిస్క్ తీసుకుని దెబ్బలు తినైనా ఫైట్ సీన్లు పండించడం వల్ల కృష్ణను డాషింగ్ అండ్ డేరింగ్ హీరో అని పిలిచేవారు. పలు షూటింగుల్లో బైకు మీంచి, గుర్రాల మీంచి పడిపోవడం, ప్రమాదవశాత్తు కత్తిగాట్లు పడడం, విలన్‌ను పైకెత్తబోయి కింద పడడం వంటివెన్నో ఎదుర్కొన్నాడు. 1983లో సిరిపురం మొనగాడు షూటింగ్‌లో ప్రాణానికే ముప్పు వచ్చినంత పనైంది. ఇలాంటివి ఎదురైనా సాహసించి ముందుకు సాగడమే కృష్ణ పద్ధతి. సంక్రాంతికి సినిమాలు విడుదల చేసే సంక్రాంతి పోటీ విషయంలోనూ కృష్ణ రికార్డు సృష్టించారు. నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో 30 సంక్రాంతులకు కృష్ణ నటించిన సినిమాలు విడుదల అయ్యాయి.
1976 నుంచి 1996 వరకు 21 సంవత్సరాల పాటు ప్రతీ ఏటా వరుసగా సంక్రాంతికి సినిమాలు విడుదల చేశాడు. ఒక దశాబ్దం పాటు అహోరాత్రాలు మూడు షిఫ్టులలో పనిచేసి సినిమాను పరిశ్రమగా మార్చారంటే అతిశయోక్తిలేదు. తెలుగు సినిమా సత్తా ఏమిటో, సాంకేతిక ఘనతలు ఏమిటో బాలీవుడ్ కు చాటగలిగారు. ఆయన సాంఘిక, జానపద, పౌరాణిక, చరిత్రాత్మక చిత్రాల్లో మెప్పించారు. చిత్రసీమలో కృష్ణ మంచివాడు, మనసున్నవాడు అంటూ మహాకవి శ్రీశ్రీ ప్రశంసలు కురిపించారు. వెండితెర మీదే కాదు. రాజకీయ యవనిక మీద కూడా సూపర్ స్టార్ మెరుపులా మెరిశారు. రాజీవ్‌గాంధీ మీద అభిమానం రాజకీయాల వైపు నడిపించింది. 1989లో హీరో కృష్ణ ఏలూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
సినిమా ఎవల్యూషన్ లో ఆయన రెక్కవిప్పిన రెవల్యూషన్. సాహసాల సంచలనం. ప్రయోగాలే ప్రాణప్రదం. వెండితెర ఊసులే కృష్ణ గుండె ఘోష. అభిమానుల దృష్టిలో సాహసాలకు మారు పేరు. ప్రయోగాలకు మరో పేరు. సంచలనాలకు పెట్టింది పేరు. కృష్ణ కటౌట్లకు పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలతో తడిసి ముద్దవని థియేటర్ తెలుగునాట లేదు. సూపర్‌స్టార్ సినీజీవితం ఓ చరిత్ర. ఓ పాఠం. ఓ అధ్యాయం. ఓ అధ్యయనం. ఆ చలువ పందిరిలో.. నాటిన పువ్వుల తోటలో.. జ్ఞాపకాల గులాబీలు, మందారాలు ఏరుకుని ఆస్వాదించే అభిమానులు ఎందరో.