సూపర్ హీరో.. ఎవ్వరికీ సాధ్యం కాని పనుల్ని ఇట్టే పూర్తి చేస్తాడు. విలన్లను తన శక్తిమంతమైన చేతుల్తో మట్టికరిపిస్తాడు. అప్పుడప్పుడూ మ్యాజిక్కూ చేస్తాడు. సినిమాల్లో సూపర్ పవర్ ఉన్న హీరోలకు కోట్లాది మంది అభిమానులున్నారు. భారత్‌లో కొన్ని సూపర్ హీరో చిత్రాలు తెరకెక్కినా.. హాలీవుడ్లో మాత్రం ఎక్కువగా కనిపించేవి ఇవే. అలాంటి చిత్రాలకు ఇక్కడా చాలా గిరాకీ ఉంది. దీంతో అక్కడ రూపొందిన ఇలాంటి చిత్రాల్ని ఇక్కడ కూడా విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయనున్న సూపర్ హీరో చిత్రాలేంటో తెలుసుకుందాం.
జస్టిస్ లీగ్
జస్టిస్ లీగ్ జాక్ స్నైడర్ కట్.. మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హెచ్‌బీఓ మ్యాక్స్‌లో ఈ ఏడాది మార్చిలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు జాక్ స్నైడర్ స్పష్టం చేశారు. 2017లో విడుదలైన ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతల నుంచి మధ్యలోనే తప్పుకున్నారు స్నైడర్. ఆ తర్వాత అవెంజర్స్ డైరెక్టర్ జాస్ వెడెన్ దీనికి దర్శకత్వం వహించారు. కానీ ఆ సినిమా ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో స్నైడర్ వెర్షన్‌ను విడుదల చేయాలంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కోరారు. దీంతో ఆ సినిమాకు కొన్ని సీన్స్ జోడించి జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ పేరుతో ఈ చిత్రాన్ని మరోసారి రూపొందించారు. ఇందులో బ్యాట్మన్, సూపర్మన్, వండర్ ఉమన్, ద ఫ్లాష్, ఆక్వామన్ వంటి సూపర్ హీరోలు కనువిందు చేయనున్నారు.
స్పైడరమ్యాన్-3
టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్‌గా కనిపించనున్న చిత్రం స్పైడర్‌మ్యాన్-3. ఈ సినిమాలో ఇంతకుముందు ఆకట్టుకున్న జేమీ ఫాక్స్ (ఎలక్ట్రో), అల్ఫ్రెడ్ మొలినా (డాక్ ఓక్), టోబే మాగ్వైర్, ఆండ్రూ గారీఫీల్డ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు వహించనున్నారని సమాచారం. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలవనుంది.
మార్బియస్
జారెడ్ లిటో ప్రధానపాత్రలో నటించిన చిత్రం మార్బియస్. ఇందులో హీరో అరుదైన రక్త సంబంధ వ్యాధితో బాధపడుతుంటాడు. ఈ వ్యాధికి చికిత్స తీసుకునే క్రమంలో ఇతడు ఓ సూపర్ హ్యూమన్‌గా మారతాడు. తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేది కథాంశం. ఈ సినిమా మార్చి 19న విడుదలవనుంది.