దక్షిణాదిలో ఎంతమంది స్టార్లు పుట్టుకొచ్చినా.. స్టైల్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సూపర్‌స్టార్ రజనీకాంత్. హీరో అంటే ఇలానే ఉండాలి అనే హద్దును చెరిపేశాడు. ఆరడగుల పొడుగు, సిక్స్ ప్యాక్ లేకున్నా అభిమానుల ఆదరణ అందుకోవచ్చని నిరూపించాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్యుడిగా మారాడు. దశాబ్దాలుగా స్టైల్, మేనరిజమ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి ఇండస్ట్రీలో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
"నాన్నా.. పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది", "బాషా ఒక్కసారి చెబితే.. వందసార్లు చెప్పినట్టే", "ఆ దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు", "నా దారి రహదారి..." ఈ డైలాగ్‌లు చాలు రజనీకాంత్ క్రేజ్ ఏంటో చెప్పడానికి.
తొలి అవకాశం ఇలా..!
రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. 1950 డిసెంబరు 12న కర్ణాటకలో జన్మించాడు. తొలినాళ్లలో బస్ కండక్టర్‌గా చేస్తున్న సమయంలో నటనపై మక్కువ పెంచుకున్నాడు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి యాక్టింగ్ కోర్సులో డిప్లమో చేశాడు. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ తెరకెక్కించిన 'అపూర్వ రాగంగల్'(1975)లో తొలి అవకాశం దక్కించుకున్నాడు.
అనంతరం కన్నడలో ‘కథా సంగమ’... తెలుగులో మళ్లీ బాలచందర్‌తో ‘అంతులేని కథ’, తమిళంలో ‘మూడ్రు ముడిచు’ అనే చిత్రాలు చేసి తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1977లో రజనీకాంత్.. 15 సినిమాల్లో నటిస్తే అందులో ఎక్కువగా వ్యతిరేక ఛాయలున్న పాత్రలే చేశాడు. తొలుత ప్రతినాయకుడిగా పేరు తెచ్చుకొన్న తలైవా.. ఆ తర్వాత కథానాయకుడిగా వరుస విజయాలు అందుకున్నాడు.
80, 90వ దశకాల్లో సూపర్‌స్టార్ చేసిన సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. ‘దళపతి’, ‘నరసింహ’, ‘బాషా’, ‘ముత్తు’, ‘పెదరాయుడు’, ‘అరుణాచలం’ తదితర చిత్రాలు తమిళంతో పాటు తెలుగులోనూ విశేష ప్రజాదరణను సొంతం చేసుకొన్నాయి. ఆ తర్వాతి కాలంలో వచ్చిన ‘చంద్రముఖి’, ‘శివాజీ’, ‘రోబో’ చిత్రాలు రజనీ స్థాయిని మరింత పెంచాయి.
ఎంత పేరున్నా.. సాధారణ జీవితమే