సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధానపాత్రలో శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అన్నాత్తె' (Rajini Annaatthe). గతేడాది దీపావళికి విడుదల కావాల్సిన చిత్రం కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడింది. ఇటీవలే షూటింగ్‌ను చిత్రబృందం తిరిగి ప్రారంభించగా.. ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై చిత్రబృందం స్పష్టత ఇచ్చింది.
ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబరు 4న (Annaatthe Release Date) చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణసంస్థ సన్ పిక్చర్స్ ప్రకటించింది. దీంతో రజనీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపినట్లైంది. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు కీర్తి సురేశ్, నయనతార, మీనా, కుష్భూ, ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలు (Annaatthe Cast) పోషిస్తున్నారు.
చికిత్స కోసం అమెరికాకు..
గత డిసెంబరులో రజనీకాంత్ అస్వస్థతకు గురవడం వల్ల షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది చిత్రబృందం. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని, ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు రజనీ విశ్రాంతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే చికిత్స కోసం కుటుంబ సమేతంగా ఆయన అమెరికా వెళ్లారు. త్వరలోనే చికిత్స పూర్తి చేసుకొని భారత్‌కు తిరిగి రానున్నారని తెలుస్తోంది.