తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఏఆర్​ రెహ​మాన్​ ఉదారత..పేద విద్యార్థులను సంగీతకళాకారులుగా - ఏఆర్​ రెహ్మాన్​ ఫౌండేషన్​

AR Rahman Sunshine Orchestra: తన సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు ఏఆర్‌. రెహమాన్​. స్వీయ సంగీత దర్శకత్వంలో పాటలు పాడి యావత్‌ సంగీత ప్రియుల్ని అలరిస్తుంటారు. అయితే ఆయనలో ఓ మంచి వ్యక్తి కూడా ఉన్నారు. ఎన్నో సేవకార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఓ ఫౌండేషన్​ ద్వారా ఎంతో మంది పేదపిల్లలను చేరదీసి వారిని సంగీత కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. వారిలో చాలామంది ప్రపంచ వేదికలెక్కుతున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..

ఏఆర్​ రెహ్మాన్​ ఫౌండేషన్​, AR rehman foundation
ఏఆర్​ రెహ్మాన్​ ఫౌండేషన్​

By

Published : Dec 12, 2021, 8:23 AM IST

AR Rahman Sunshine Orchestra: అదో మున్సిపాలిటీ స్కూలు. వాళ్ల అల్లరి అరుపుల్ని ఆ వీధిలోని ప్రతి ఒక్కళ్లూ విసుక్కునేవారే... ఆ బడికి పొరుగునే ఉన్న ఓ ఇంటి యజమాని తప్ప. వాళ్లంటే ఏదో అభిమానం ఆయనకి. ఓ రోజు వాళ్లలో కొందర్ని ఎంపిక చేసి... సంగీత శిక్షణ మొదలుపెట్టాడు. పుష్కరం గడిచింది. ఇప్పుడా పేదపిల్లలు సినిమాలకీ పనిచేస్తున్నారు... 'సన్‌షైన్‌ ఆర్కెస్ట్రా' పేరుతో ప్రపంచ వేదికలెక్కుతున్నారు. వాళ్లని చేరదీసిన ఆ పొరుగింటాయన ఎవరో కాదు... ఏఆర్‌ రెహమాన్​!

ఆ పాప పేరు హెచ్‌.జయమాలిని. కడుపులో పడ్డ నాలుగునెలలకే ఆమె తండ్రి చనిపోయాడు. తల్లి నాలుగిళ్లలో పనిచేస్తూ ఆ పాపని పోషిస్తుండేది. ఊహతెలిసినప్పటి నుంచీ తల్లితోపాటూ పనికెళ్లే జయమాలిని... ఓ కార్పొరేషన్‌ స్కూల్లో చదువుతుండేది. ఇక, మణికంఠన్‌ కుటుంబానికి... వాళ్ల నాన్న వీధీవీధీ తిరుగుతూ టీ అమ్మితేకానీ రోజు గడవదు. తండ్రితోపాటూ సాయంత్రాల్లో తానూ టీలమ్మేవాడు మణికంఠన్‌. జయమాలినీ, మణికంఠన్‌ ఇద్దరూ ఓ పన్నెండేళ్ల కిందట చెన్నై కోడంబాక్కంలోని ఎంజీఆర్‌ కార్పొరేషన్‌ స్కూల్‌లో చదువుతుండేవారు. ఆ బడికి పొరుగునే ఏఆర్‌ రెహ్మాన్‌ ఇల్లు. ఓ రోజు ఆయన స్టూడియో నుంచి జ్యోతి నాయర్‌ అనే వయోలిన్‌ కళాకారిణి ఈ బడికి వచ్చింది. తన చుట్టూ చేరిన పిల్లలందరికీ తన వయోలిన్‌తో పాపులర్‌ సినిమా పాటలు కొన్ని వినిపించి వాటిని గుర్తించమని చెప్పింది. ఆ పరికరాన్ని ఎలా వాయించాలో నేర్పించి వాళ్లనీ ప్రయత్నించమంది. ఆ ప్రయత్నంలో కాసింత ఎక్కువ ఏకాగ్రత చూపించేవాళ్లని గమనించింది. అలాంటివాళ్లు ఓ 40 మందిని ఎంపిక చేసి ఓ రోజు రెహ్మాన్‌ ముందు నిలబెట్టింది జ్యోతి నాయర్‌! జ్యోతి నాయర్‌ని ఆయనే పంపారని తెలుసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్న ఆ పిల్లల్ని అప్పటి నుంచి రోజూ తన స్టూడియోకి రమ్మన్నారు ఏఆర్‌ రెహమాన్. వాళ్లకి వెస్టర్న్‌ క్లాసికల్‌ సంగీత వాయిద్యాల్లో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టాడు. ఆ పిల్లలే... నేడు అద్భుతాలు చేస్తున్నారు. భారతదేశం ఇప్పటిదాకా చూడని ‘సింఫనీ’ వాయిద్య కళాకారులుగా రాణిస్తున్నారు.

ఏమిటీ సింఫనీ?

సింఫనీ... ఓ పాశ్చాత్య సంగీత ప్రక్రియ. వినేవాళ్లకి కమ్మగా ఉంటుంది కానీ... వాయించేవాళ్లకి కత్తిమీద సాములా అనిపిస్తుంది. వయోలిన్‌, సెల్లో, డబుల్‌ బాస్‌, ట్రంపెట్‌... ఏది వాయిస్తున్నా బృందంతో కలిసిపోతూ... మనదైన ప్రత్యేకతనూ నిలుపుకోవాలి. మన సినిమాల్లోనూ అప్పుడప్పుడూ మ్యూజిక్‌ డైరెక్టర్‌లు ఈ తరహా బృంద వాయిద్య సంగీతాన్ని వాడుతుంటారు. కానీ ఇవి వాయించే నిష్ణాతులైన కళాకారుల కోసం ఐరోపాకో, అమెరికాకో వెళ్తుంటారు. రెహమాన్​కైనా అది తప్పేది కాదు. అందుకే ఆయనకి 'ఓ మంచి 'వెస్టర్న్‌ క్లాసిక్‌' వాద్య కళాకారుల కోసం మనవాళ్లందరూ ఐరోపా దేశాలకే పోవాలా? వాళ్లని ఇక్కడే తయారుచేసుకోలేమా?' అన్న ఆలోచన వచ్చిందట. ఇందుకోసమే ‘కేఎం మ్యూజిక్‌ కన్జర్వేటరీ’ అనే అంతర్జాతీయ స్థాయి సంగీత కళాశాలని ప్రారంభించాడాయన. అందులో లక్షలు పెట్టి శిక్షణ పొందడానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది వస్తుండేవారు. కానీ... 'ఈ స్థాయి సంగీత శిక్షణ పేదలకి అందించలేనా? అలా నా వంతుగా కాస్తయినా సామాజిక అంతరాలని తొలగించలేనా?' అనుకున్నాడట రెహమాన్​. ఆ శిక్షణ ఇవ్వడానికి తన ఇంటి పక్కనే ఉన్న కార్పొరేషన్‌ బడిపిల్లల్ని ఎంచుకున్నాడు. వాళ్లకి వెస్టర్న్‌ క్లాసికల్‌ వాయిద్యాల్లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. ఆ విద్యార్థుల బృందానికి 'సన్‌షైన్‌ ఆర్కెస్ట్రా' అని పేరుపెట్టాడు. సీనియర్‌ వయోలినిస్టు శ్రీనివాసమూర్తిని వీళ్లకి ప్రధాన మెంటార్‌గా పెట్టాడు. అలా ఇప్పటిదాకా ఎంతో మంది పిల్లల్ని ‘సింఫనీ’ వాద్యకళాకారులుగా తీర్చిదిద్దాడు.

ఐరాసలోనూ..

ఏఆర్‌ రెహమాన్​ 'కేఎం మ్యూజిక్‌ కన్జర్వేటరీ'లో చదవాలంటే ఏడాదికి కనీసం ఎనిమిది లక్షల రూపాయలవుతుంది. కానీ 'సన్‌షైన్‌ ఆర్కెస్ట్రా' ప్రాజెక్టు కింద వచ్చే విద్యార్థులకి ఇదంతా ఉచితంగానే అందిస్తారు. ఉచితంగా నేర్చుకుంటేనేం... బతుకులోని కష్టనష్టాలు బాగా ఎరిగినవాళ్లు కనక బాధ్యతగా సాధన చేసి మెరికల్లా తయారవుతున్నారు... తమ జీవితాలనీ తీర్చిదిద్దుకుంటున్నారు. జయమాలినీ, మణిలతో కూడిన తొలి బ్యాచ్‌ అయితే ఇప్పుడు అద్భుతాలే చేస్తోంది. 2015లోనే ప్రతిష్ఠాత్మక ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో రెహమాన్​తో పాటూ కచేరీ చేసి ‘ఔరా’ అనిపించింది. రెహ్మాన్‌ సంగీతదర్శకత్వం వహిస్తున్న సినిమాలకీ పనిచేస్తోంది. 'నవాబు' నుంచి తాజా సినిమాల దాకా వీళ్ల భాగస్వామ్యం ఉంది మరి!

ఇదీ చూడండి: వైరల్​:ఇండియన్​ యాక్షన్​ చిత్రాలపై అమెరికన్​ పాట

ABOUT THE AUTHOR

...view details