ఎక్కువగా ప్రేమకథల్లో కనిపించిన సందీప్ కిషన్ తొలిసారి క్రీడాకారుడిగా నటించిన చిత్రం 'ఏ 1 ఎక్స్‌ప్రెస్'. డెన్నీస్ జీవన్ దర్శకుడు. లావణ్య త్రిపాఠి కథానాయిక. మార్చి 5న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు సందీప్. ఆ విశేషాలివీ..
రీమేకే కానీ..
ఇది నాకు మైలురాయి లాంటి చిత్రం. 25వ సినిమాగా రీమేక్‌ని ఎంపిక చేసుకున్నా అనడం కంటే మంచి కథని చూపించబోతున్నాం అని చెప్పడం ఉత్తమం. ఎందుకంటే మాతృక సినిమా (నాట్పే తునై- తమిళం) ఆలోచన మాత్రమే తీసుకుని తెలుగులో చాలా మార్పులు చేశాం. ఆ చిత్ర బృందమే ఈ సినిమాకూ పనిచేశారు. నా టీమ్ తాజాగా సినిమా సెకండాఫ్ చూసి ఏడ్చేశారు. అదే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందని భావిస్తున్నా.
నటనకు ప్రాధాన్యం..
ఈ చిత్రంలో నటనకు ప్రాధాన్యమున్న పాత్ర పోషించా. ఇలాంటి కొత్తదనం ఉన్న వాటిలోనే అన్ని కోణాలూ ఆవిష్కరించవచ్చు. ట్రైలర్ చూసి పొలిటికల్‌గా ఉంటుందనుకుంటున్నారు చాలా మంది. కానీ మేం అలా చూపించలేదు. కేవలం ఆటల్లోనే కాదు చదువు, సినిమా విషయంలోనూ ఇలాంటివే జరుగుతుంటాయి. డబ్బులు ఇస్తేనే అవకాశం దొరుకుంది. అదే సినిమాలో ఉంటుంది. మనకు తెలిసిందే చెప్పబోతున్నాం.
పాత్రకు తగినట్టుగా..
పాత్రలో ఒదిగిపోయేందుకు ఆరు నెలలు హాకీ నేర్చుకున్నాను. క్రీడా నేపథ్యంలో నేను నటించిన తొలి చిత్రం కావడం వల్ల అంతా కొత్తగా అనిపించింది. సినిమాలో కనిపించే నా ఆపోజిట్ జట్టులో అండర్- 19లో ఆడిన రియల్ హాకీ ప్లేయర్స్ కనిపిస్తారు. వాళ్లకు రోజుకు రూ.5వేలు ఇచ్చాం. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు వాళ్ల పరిస్థితి ఎలా ఉందో! ఇలాంటి అంశాల్నీ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం.
ప్రారంభించినపుడే అనుకున్నాం..
ఈ సినిమాను క్రికెట్, మరో క్రీడా నేపథ్యంలో చూపించవచ్చు. ఎమోషన్‌ను తెరపై పండించాలంటే హాకీ అయితేనే బావుంటుందనిపించింది. పైగా ఇప్పటికే క్రికెట్ సినిమాలు చాలా వచ్చాయి. చిత్రం ప్రారంభించినపుడే హిట్ కొట్టాలని భావించి దానికి తగినట్టు కష్టపడ్డాం.
వాళ్లతో రిస్క్ అనిపించదు..
కొత్త దర్శకులతో పనిచేయడం నాకు అలవాటే. లోకేశ్ కనకరాజ్, వీఐ ఆనంద్ తదితరులు ఆ జాబితాలో ఉన్నారు. ఈ సినిమాతో డెన్నీస్ జీవన్. అందుకే కొత్త వాళ్లతో నాకు రిస్క్ అనిపించే అవకాశం లేదు. సినిమా నిర్మాణం అనేది వ్యాపారం కాదు నాకు క్రియేటివ్‌గా అనిపిస్తుంది. అందుకే ఈ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరించాను. ప్రస్తుతం నటిస్తున్న 'రౌడీ బేబీ' తుది దశలో ఉంది. 'వివాహ భోజనంబు' సినిమాలో అతిథి పాత్ర పోషించాను. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతో ఓ చిత్రం చేయబోతున్నా.
ఇదీచూడండి: 'ఆటల్లో రాజకీయాలు ఎత్తిచూపే సినిమా 'ఏ1 ఎక్స్‌ప్రెస్''