చిత్రం: కపటధారి
నటీనటులు: సుమంత్, నందిత, నాజర్, జయప్రకాశ్, సంపత్ తదితరులు
నిర్మాత: లలిత ధనుంజయన్
దర్శకత్వం: ప్రదీప్ కృష్ణమూర్తి
విడుదల: 19-02-2021
తెలుగులోకి తమిళం, మలయాళం నుంచే కాదు... అప్పుడప్పుడు కన్నడ నుంచి కూడా కథలు దిగుమతి అవుతుంటాయి. అక్కడ 'కావలుధారి'గా తెరకెక్కి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ చిత్రం తెలుగులో 'కపటధారి'గా రీమేకైంది. కథాబలమున్న చిత్రాలు చేసే సుమంత్ కథానాయకుడిగా నటించడం... ప్రచార చిత్రాలు ఆసక్తి రేకెత్తించడం వల్ల సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి చిత్రం ఎలా ఉంది? పోలీస్ ఆఫీసర్‌గా సుమన్ ఎలా నటించాడు? ఏ కేసును ఛేదించాడు?
కథేంటంటే: గౌతమ్ (సుమంత్) ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంటాడు. అతనికి క్రైమ్ విభాగంలోకి వెళ్లాలనేది కల. కానీ, పై అధికారి అందుకు ఒప్పుకోడు. అసంతృప్తిగానే విధులు నిర్వర్తిస్తున్న అతని పరిధిలోనే ఓ కుటుంబానికి చెందిన అస్తిపంజరాలు బయటపడతాయి. అవి 40 ఏళ్ల కిందట జరిగిన హత్యలని తేలుతుంది. క్రైమ్ విభాగానికి చెందిన పోలీసులు ఆ కేసును మూసివేసే ఆలోచనలో ఉండగా, గౌతమ్ ఆ హత్యల వెనక నిజాల్ని నిగ్గు తేల్చేందుకు స్వయంగా పరిశోధన మొదలు పెడతాడు. ఆ క్రమంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఇంతకీ ఆ హత్యల్ని ఎవరు చేశారు? గౌతమ్ హంతకుల్ని పట్టుకున్నాడా? క్రైమ్ విభాగంలోకి వెళ్లాలన్న ఆయన కల తీరిందా? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: ఓ హత్య జరుగుతుంది. దాని వెనుక ఎవరున్నారన్నది మాత్రం అంతుచిక్కదు. క్లూ కూడా దొరకదు. చిన్న అనుమానం. ఆ తీగని పట్టుకుని లాగుదాం అనుకునేలోపే అనుకోని అవాంతరాలు. ఊహించని రీతిలో కొత్త కోణాలు బయట పడుతూ కేస్ మరింత క్లిష్టతరంగా మారుతుంటుంది. ఏం జరగబోతోందా అనే ఉత్కంఠ మొదలవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ కథలంటే దాదాపుగా ఇదే తరహాలోనే సాగుతుంటాయి. ఈ కథ కూడా ఆ తాను ముక్కే. కానీ, ఇందులో హత్యలు అప్పుడెప్పుడో 40 ఏళ్ల క్రితం జరిగినవి. ఆధారాలే కాదు, మనుషులు.. పరిస్థితులు అన్నీ మారిపోతాయి. అలాంటి ఓ క్లిష్టమైన కేస్‌ను తన భుజాలపై వేసుకుంటాడు కథానాయకుడు. అతనికి అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లే ఈ సినిమాకు కీలకం. ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ క్రైమ్ కేసును ఛేదించడం అనేది ఆసక్తికరమైన విషయమే. అందుకే కథానాయకుడు క్రైమ్ సీన్‌లోకి అడుగుపెట్టగానే ఈ కేస్‌ను ఎక్కడ మొదలు పెడతాడనే అంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
లాకప్ న్యూస్ జర్నలిస్ట్ జీకే (జయప్రకాష్)తో కలిసి పరిశోధించడం మొదలు పెడతాడు గౌతమ్. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల కిందట ఈ కేస్‌ను డీల్ చేసిన పోలీస్ అధికారి రంజిత్ (నాజర్) తోడవుతాడు. రంజిత్ రాకతోనే కథలో వేగం పుంజుకుంటుంది. గౌతమ్ సేకరించే ఆధారాలు కొన్ని, అప్పట్లో రంజిత్ పరిశోధనలో వెలుగులోకి తెచ్చిన విషయాలు మరికొన్నింటిని కలిపి కేస్‌ను పలు కోణాల్లో పరిశోధించడం మొదలుపెడతాడు. అసలు రహస్యం కథానాయిక రమ్య ద్వారా బయట పడుతుందనేలోపే మరో మలుపు. ఇలా చివరి వరకూ కథలో మలుపులే. 'కావలుధారి' కథలో ఎలాంటి మార్పులు చేయకుండా తెలుగులో తీశారు కానీ... అక్కడి స్థాయిలో భావోద్వేగాలు మాత్రం పండలేదు. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం పర్వాలేదనిపిస్తుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రమే థ్రిల్‌ను పంచుతాయి. క్రైమ్ థ్రిల్లర్ కథల్లో కనిపించే వేగం ఇందులో తగ్గింది. పతాక సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. కథనంలో బిగి కొరవడింది. చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి.