Sukumar about Rajnikanth: తొలి పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'తో భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సుకుమార్. ప్రతీ సినిమాకు తన మార్క్ చూపించే సుక్కు తాజాగా ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి విషయాల గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
"అవి రోబో చిత్రం షూటింగ్ జరుగుతున్న రోజులు! ఆ షూటింగ్‌కి నేను వెళ్లా. 'ఆర్య' చూసిన రజనీ సర్.. నన్ను పలకరించడానికి నా దగ్గరకు రాగానే వణకుతూ చేతులు కట్టుకొని 'సర్.. సర్' అనడం మొదలుపెట్టా. నా దగ్గరకు వచ్చి కూర్చొండి అన్నారు. ఆర్యలో హీరోయిన్ హెయిర్ ఊడుతూ పడిపోయే సీన్ బాగుందన్నారు. ఈలోపు మళ్లీ ఆయన షాట్ రెడీ అయ్యింది. ఆయన వెళ్తుంటే లేచి నిలబడ్డా. ఆ తర్వాత మళ్లీ నావద్దకు వచ్చారు. నేను కూర్చోకపోయే సరికి.. ఠక్కున అలావెళ్లి కుర్చీ తీసుకొచ్చి వేశారు. వెంటనే నేను కూర్చున్నా. ఆయన ముందు కూర్చున్నా నిలబడినట్టే ఉంది. దర్శకుడంటే ఆయనకంత గౌరవం. సూపర్ స్టార్ అయినా ఒదిగి ఉంటారు. అందుకే ఆయన వ్యక్తిత్వం అందరికీ అలా గుర్తిండిపోతుంది. రజనీ సర్.. నాకు కుర్చీ తీసుకొచ్చి వేసి కూర్చొండి.. కూర్చొండి.. అనే విషయం నా లైఫ్‌లో ఓ గోల్డెన్ మూమెంట్." అని సుక్కు పేర్కొన్నారు.