నటిగా ఒక తరం ప్రేక్షకులకు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మరో తరం ప్రేక్షకులకు సుపరిచితురాలు సుజాత. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించిందామే. సాత్విక పాత్రలకి, ఆర్ద్రతతో కూడిన పాత్రలకి పెట్టింది పేరన్నట్టుగా వెండితెరపై సందడి చేసింది. ఎన్టీఆర్, శివాజీ గణేశన్, కమల్‌హాసన్, రజనీకాంత్, అనంతనాగ్, శ్రీనాథ్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్‌బాబు, కృష్ణ వంటి అగ్ర నటులతో కలిసి నటించింది.
సుజాత 1952, డిసెంబరు 10న శ్రీలంకలో జన్మించింది. కేరళకి చెందిన ఈమె తండ్రి ఉద్యోగం రీత్యా శ్రీలంకలో స్థిరపడటం వల్ల ఆమె అక్కడే పుట్టి పెరిగింది. తండ్రి పదవీ విరమణ తర్వాత కుటుంబమంతా మళ్లీ కేరళకి వచ్చారు. పద్నాలుగేళ్ల వయసులో 'తబస్విని' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యింది సుజాత. ఆ చిత్రం తర్వాత అవకాశాలు వరుస కట్టాయి. ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాల్లో నటించింది. బాలచందర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'అవళ్ ఒరు తొడర్ కథై' (తెలుగులో అంతులేని కథ)తో నటిగా పేరు తెచ్చుకున్న సుజాత.. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'గోరింటాకు'తో తెలుగులో పరిచయమైంది. ఆ చిత్ర విజయంతో తెలుగులోనూ బిజీ అయ్యింది సుజాత.