బాద్షా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్.. తన శరీర ఛాయపై వస్తున్న వివక్షపై స్పందించింది. యువకుల మనసులపై నిస్సందేహంగా ఈ ప్రభావం పడుతుందని చెప్పింది. గతకొంత కాలంగా ఈమె ఒంటి రంగుపై నెట్టిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
'నెపోకిడ్' మొదలు ఆమె శరీర ఛాయపైనా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఇన్స్టా వేదికగా మాట్లాడింది. భారతీయ సమాజంలో అందంపై ఉన్న మక్కువను విమర్శించింది. తన శరీర రంగుపై కామెంట్ల స్క్రీన్షాట్లను కొన్నింటిని పోస్ట్ చేసింది.
"12 సంవత్సరాల వయసు నుంచే నా శరీర ఛాయపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మనమంతా భారతీయులం కాబట్టి మనందరి రంగు ఇలానే ఉంటుంది. మీ సొంత మనుషులను మీరు ద్వేషిస్తున్నారంటే.. మీ మధ్య ఉండాలంటే భయమేస్తోంది. మంచి పొడవు, రంగు ఉంటేనే మీ దృష్టిలో అందంగా ఉన్నట్లా?. ఇప్పుడు నా చర్మం రంగు వల్ల నాకెలాంటి ఇబ్బంది లేదు. ఇంకా చాలా సంతోషంగా ఉన్నా"