"మంచి సినిమా తీస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని 'శ్రీదేవి సోడా సెంటర్' (Sridevi soda center) చిత్రంతో మరోసారి నిరూపితమైంది" అన్నారు దర్శకుడు కరుణ కుమార్. 'పలాస' లాంటి విజయం తర్వాత ఆయన నుంచి వచ్చిన రెండో చిత్రమిది. సుధీర్‌బాబు, ఆనంది జంటగా నటించారు. శశిదేవి రెడ్డి, విజయ్ చిల్లా నిర్మించారు. నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు సహా పలువురు మాట్లాడారు.
"మంచి కథా బలమున్న సినిమా తీశాం. కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రమిది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి సూరిబాబు, శ్రీదేవి పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మహేశ్‌బాబు కోట్లిచ్చినా తను నమ్మందే ఏదీ చెయ్యరు. ఆయన మా చిత్రం బాగుందని ట్వీట్ చేశారు"
- సుధీర్ బాబు, కథానాయకుడు
"మేమెంత గొప్ప సినిమా తీశామని చెప్పినా.. ప్రేక్షకులకు నచ్చకపోతే చూడరు. అలాగే మంచి సినిమా తీసినప్పుడు అడగకపోయినా ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది. 'శ్రీదేవి సోడా సెంటర్' అనే టైటిల్ ఒప్పుకున్నందుకు సుధీర్‌బాబు చాలా గ్రేట్. తల్లిని.. భార్యను.. స్త్రీలను గౌరవించే వాళ్లు మాత్రమే ఇలాంటి టైటిల్‌ను ఒప్పుకుంటారు. అందుకే ఆయనకు కృతజ్ఞతలు. మహిళలందరూ తప్పక చూడాల్సిన చిత్రమిది" అన్నారు దర్శకుడు కరుణ కుమార్.
ఆ తర్వాత నటుడు నరేశ్ మాట్లాడుతూ.. "నా జీవితంలో గుర్తుండిపోయే పాత్రను ఈ చిత్రంలో పోషించా. సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డామ"న్నారు. "సినిమాలో బోట్ రేస్ చూసిన వాళ్లంతా హాలీవుడ్ స్థాయిలో ఉందంటున్నారు. మాకింత భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అన్నారు చిత్ర నిర్మాతలు. ఈ కార్యక్రమంలో కల్యాణి రాజు, రోహిణి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :Dear Megha: ఆ వయసులోనే అతడితో ప్రేమలో పడ్డా!