ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న 'మగువా ఓ మగువా', కిందటి ఏడాది ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసిన 'రాములో రాములా '.., అంతకన్నా ముందు వచ్చిన 'చిమ్మటీ చీకటీ కమ్మటీ సంగటీ', 'రంగమ్మా మంగమ్మా' వంటి ఎన్నో పాటల వీడియోలను డిజిటల్ ప్రపంచంలో ఆవిష్కరించింది ప్రదీప్, చైతన్య, హర్షలే. చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో బడా క్లయింట్లను తమ ఖాతాలో వేసుకున్న వీళ్లకు దర్శకుడు రాజమౌళి అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం, ఇష్టం. ఆ ఇష్టంతోనే కొన్నాళ్ల క్రితం సరదాగా రాజమౌళి పేరుతో ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించారు. చాలా తక్కువ సమయంలోనే ఆ పేజీకి లైక్‌లూ, షేర్లూ పెరగడం వల్ల దర్శకుడు పూరీ జగన్నాథ్ తన దగ్గర పనిచేయమంటూ పిలిచాడు. అలా రాజమౌళికి కూడా వీళ్ల గురించి తెలియడం చేత తన ఆఫీసుకు ఆహ్వానించాడోసారి. వీళ్లతో మాట్లాడాక.. బాహుబలికి డిజిటల్ మార్కెటింగ్ చేయమంటూ తమ సంస్థలోనే పని ఇచ్చాడు. దాన్నో పెద్ద బాధ్యతగా భావించి ఆర్కా మీడియాతోనే ఉంటూ బాహుబలి పోస్టర్లూ, పాటల్ని సృజనాత్మకంగా ఆవిష్కరించి ఆ సినిమాకు డిజిటల్ ప్రచారం చేశారు. దానికి గుర్తింపురావడం వల్ల బాహుబలి -2కి కూడా పనిచేశారు.
అదే మలుపు..
ప్రదీప్ స్వస్థలం నల్గొండ, హర్షదేమో తూర్పుగోదావరి అయితే, చైతన్యది హైదరాబాద్. బాహుబలి ముందు వరకూ సినిమా రంగంలో పనిచేస్తున్నామని ఇంట్లో చెబితే వీళ్ల భవిష్యత్తు ఏమవుతుందోనని అమ్మానాన్నలు సందేహించారట. "హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకొచ్చిన సినిమాలూ" అన్నారట బంధువులూ, స్నేహితులూ. కానీ బాహుబలికి సంబంధించిన వీడియోలూ, టీజర్లూ ఎప్పటికప్పుడు యూట్యూబ్‌తోపాటూ ఇతర సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో కనిపించడం.. అవన్నీ వీళ్లే చేస్తున్నారని తెలిసి తల్లిదండ్రులూ ప్రోత్సహించారట. ఆ తరువాత వీళ్లపైన వీళ్లకు నమ్మకం వచ్చినందువల్ల ఈ రంగంలోనే స్థిరపడాలని అనుకున్నారు. అదే సమయంలో శోభు యార్లగడ్డ కూడా ప్రోత్సహించగా 'వాల్స్ అండ్ ట్రెండ్స్' పేరుతో మూడేళ్లక్రితం సంస్థను ప్రారంభించారు. ఆర్కా, దిల్‌రాజు ప్రొడక్షన్‌హౌస్, లహరి మ్యూజిక్.. వంటి సంస్థలు వీళ్ల క్లైంట్ల జాబితాలో చేరడం చేత మరికొన్ని అవకాశాలూ వీళ్ల తలుపుతట్టాయి. ఇప్పటివరకూ 150 సినిమాల పాటల వీడియోలకు డిజిటల్ మార్కెటింగ్ చేశారు. అదేవిధంగా కొన్ని సినిమాలకూ ప్రచారకర్తలుగా వ్యవహరించారు. ఆ జాబితాలో 'మహర్షి', 'వి', 'ఓ బేబీ', 'ఎఫ్2', 'సరిలేరు నీకెవ్వరూ', 'సైరా', 'ఖైదీ నెం 150' వంటివెన్నో ఉన్నాయి.