బాలీవుడ్ చిత్రాలు పిల్లలపై దశాబ్దాలుగా ప్రభావం చూపుతున్నాయని తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. సినిమాల వల్ల పొగాకు, మద్యానికి ఎక్కువ అలవాటు పడుతున్నారని లండన్‌లోని వైటల్ స్ట్రాటజీస్, ఇంపీరియల్ కాలేజీకి చెందిన పరిశోధకులు తేల్చారు.
"పిల్లల్లో అనారోగ్య కారకాలను ప్రోత్సహించడానికి బాలీవుడ్ చిత్రాలు దోహదం చేస్తున్నాయని మా అధ్యయనంలో తేలింది. ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, కాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే వాటిని సినిమాల్లో నిషేధించడానికి మా అధ్యయనం సహాయపడుతుందని ఆశిస్తున్నాం".
- డాక్టర్ నందితా మురుకుట్ల, పరిశోధకురాలు
1994- 2013 మధ్యకాలంలో వచ్చిన 300 చిత్రాలను వీరు విశ్లేషించారు. ఇందులో 93 శాతం మద్యాన్ని, 70 శాతం పొగాకును, 21 శాతం ఫాస్ట్‌ఫుడ్‌ను ప్రోత్సహించిన్నట్లు అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఒక్కొక్క సినిమాలో సగటున పొగాకు ఉత్పత్తులను 4 సార్లు, ఆల్కహాల్ ఉత్పత్తులను 7 సార్లు చూపిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఫాస్ట్‌ఫుడ్‌కు సంబంధించిన ఉత్పత్తులను ప్రతి సినిమాలో 0.4 సార్లు వాడినట్లు తెలిపింది.