గతేడాది జూన్ 14న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయిన జ్ఞాపకాల ద్వారా అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. తాజాగా ఆయన జ్ఞాపకంగా దక్షిణ దిల్లీ ఆండ్రూస్ గంజ్‌లోని ఓ రహదారికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు పెట్టారు. దీనికి అధికారుల నుంచి ఆమోదం లభించింది.
దిల్లీలోని వీధికి సుశాంత్ రాజ్‌పుత్ పేరు - సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వీధి
దక్షిణ దిల్లీలోని ఓ వీధికి బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు పెట్టనున్నారు. దీనికి సంబంధించి అధికారుల నుంచి అనుమతి లభించినట్లు ఆ కాలనీ కౌన్సిలర్ తెలియజేశారు.
ఎస్డీఎమ్సీ కాంగ్రెస్ కౌన్సిలర్ అభిషేక్ దత్ గతేడాది సెప్టెంబర్‌లో వీధికి సుశాంత్ పేరు పెట్టాలని ప్రతిపాదన చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో దీనికి ఆమోదం లభించినట్లు ఓ అధికారి తెలియజేశారు.
గురువారం సుశాంత్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు అభిషేక్. "రోడ్ నెం.8లో ఎక్కువగా బిహార్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారు ఆండ్రూస్ గంజ్ నుంచి ఇందిరా క్యాంప్ వరకు ఉన్న మార్గానికి 'సుశాంత్ రాజ్‌పుత్ మార్గ్'గా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. అందువల్లే ఈ ప్రతిపాదన చేశా" అని దత్ వెల్లడించారు.