సినిమా: మినారి
భాష: ఇంగ్లీష్, కొరియన్
విడుదల: 2020
దర్శకుడు: లీ ఐసాక్ చంగ్
తారాగణం: స్టీవెన్ యాన్, హన్ యెరి, యన్ యు జంగ్ తదితరులు
నిడివి: 115 నిమిషాలు
ఆస్కార్ నామినేషన్స్: 6
మినారి.. మెరుగైన జీవనం కోసం అమెరికాకు వలస వెళ్లిన ఓ కొరియన్ కుటుంబం కథ. లీ ఐసాక్ చంగ్ దీనికి దర్శకుడు. సినిమా కథంతా అమెరికా నేపథ్యంలోనే జరుగుతుంది. దర్శకుడి కుటుంబం తొలినాళ్లలో ఎదుర్కొన్న కొన్ని ఘటనల ఆధారంగానే ఈ సినిమా కథను అల్లుకున్నాడు. థియేటర్లలోకి రాకముందే పలు అంతర్జాతీయ వేదికలపై మంచి ఫ్యామిలీ డ్రామాగా ప్రశంసలు, అవార్డులు పొందింది. ఆ తర్వాత థియేటర్లలోకొచ్చి ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. కొరియన్లనే కాకుండా అమెరికాకు వలసవెళ్లిన ప్రతి కుటుంబ ఆత్మను 'మినారి' ప్రతిబింబించిందని ప్రశంసలు కురిశాయి.
ఈ సినిమాలో తండ్రిగా నటించిన స్టీవెన్ యాన్ ఉత్తమ నటుడి కేటగిరిలో పోటీలో ఉన్నారు. గతేడాది ఆస్కార్ గెలిచిన 'పారసైట్' దర్శకుడు బాంగ్ జాన్ హో తెరకెక్కించిన ఓక్జాలో కీలక పాత్రలో మెరిశాడు. అమ్మమ్మగా చేసిన 73 ఏళ్ల నటి యున్ యు జంగ్ ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ బరిలో ఉంది. మొత్తం ఆరు విభాగాల్లో నామినేషన్లు పొందిన 'మినారి' ఉత్తమ చిత్రంగా మిగిలిన ఏడు చిత్రాలకు దీటైన పోటీనిస్తుంది. ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే ఇలా రెండు విభాగాల్లో లీ ఐసాక్ చంగ్ బరిలో ఉన్నారు. దీంతో పాటు ఒరిజినల్ స్కోర్ విభాగంలోనూ ఈ చిత్రం పోటీ పడుతోంది.
కథ: మినారి 1983లో డేవిడ్ బాల్యంలో జరిగే కథ. మెరుగైన జీవనం కోసం అమెరికాలోని కాలిఫొర్నియాకు డేవిడ్ కుటుంబం వలస వస్తుంది. అతడి తండ్రి జాకొబ్, తల్లి మోనిక కోడిపిల్లల్లో ఆడ, మగవాటిని వేరు చేసే వృత్తిలో చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. కాలిఫోర్నియా నుంచి దూరంగా ఆర్కాన్సస్‌లోని గ్రామీణప్రాంతానికి వెళ్తారు. అక్కడున్న 5 ఎకరాలను సాగు చేసి ఆర్థికంగా స్థిరపడి, కుటుంబానికి మంచి జీవితాన్ని అందించాలని కలగంటాడు జాకొబ్. ఏటా లక్షల సంఖ్యలో కొరియన్లు అమెరికాకు వలసవెళ్తుంటారు. కొరియా దేశానికి చెందిన కూరగాయలు, పండ్లను పండించి వాళ్లు ఎక్కువగా నివాసముండే ప్రాంతాల్లో అమ్ముకోవాలనుకుంటాడు. అతడి భార్య మోనిక మాత్రం సురక్షితమైన జీవితం కోరుకుంటుంది. డేవిడ్ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంటాడు. అయినా భర్త ఇలా ఇంతదూరం తీసుకురావడం.. సమీపంలో ఆసుపత్రి కూడా లేని చోట కొత్త జీవితం ప్రారంభించడం ఆమెకు నచ్చదు. జాకొబ్ మాత్రం ఆర్థికంగా బలపడి ఇప్పుడున్న స్థితి నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని ఉంటాడు. అందుకు ఏదైనా చేసేందుకు సిద్ధపడతాడు. ఇది విభేదాలకు దారితీస్తుంది. దంపతులిద్దరి మధ్య ఈ సంఘర్షణ చివరిదాకా కొనసాగుతుంది. ఈ కష్టాలు, కన్నీళ్లని దాటుకొని జాకొబ్ తన కలను నిజం చేసుకున్నాడా? ఈ క్రమంలో ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి.? అమెరికా జీవితం ఎలాంటి పాఠాలు నేర్పిందనేది మిగతా కథ.
ఆకట్టుకొనే అమ్మమ్మ పాత్ర.. పిల్లలను చూసుకునేందుకు వచ్చే అమ్మమ్మ సూన్‌జా పాత్రలో కొరియన్ నటి యున్ యా జంగ్ అదిరిపోయేలా నటించారు. 5 దశాబ్దాలుగా కొరియన్ టీవీ, సినిమా రంగాల్లో నటిగా రాణిస్తున్న ఈమెకు మినారితో ఖండాంతర ఖ్యాతి లభించింది. చిత్రంలో పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలోని జాకొబ్ కుటుంబం.. ఎప్పుడూ ఏదో ఒక ఒత్తిడిలో ఉంటారు. సూన్‌జా మాత్రమే ఆశావాహ దృక్పథంతో ముందుకు నడిపిస్తారు. పిల్లలు తనపై అయిష్టతను ప్రదర్శించినా వారిపై ఎనలేని ప్రేమను చూపిస్తుంది. తిరిగి ఆ కుటుంబ సభ్యుల మధ్య బలమైన బంధం ఏర్పడేందుకు కారణమవుతుంది. ఇందులో నటనకు గానూ ఆమె ఆస్కార్ ఉత్తమ సహాయనటి విభాగంలో పోటీ పడుతోంది. ఇప్పటికే ఆ పాత్రకు పలు వేదికలపై అవార్డులు దక్కాయి. హృదయాలను తడిచేసే ఈ ఫ్యామిలీ డ్రామాపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
త్యాగానికి గుర్తు..
విభిన్న కథా కథనాలుండటంతో పాటు.. అమెరికా వలస జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మిగిలింది ఆస్కార్ గెలవడమే. గడ్డు పరిస్థితుల్లోనూ గట్టిగా నిలబడాలి; 'మినారి' అంటే కొరియన్లు పండించే ఒక చిన్న మొక్క. ఈ సినిమాకు దీని పేరు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంది. మినారిని నాటాక మొదటిసారి పూర్తిగా చనిపోయినా, రెండోసారి దానంతటదే మరింత బలంగా, విస్తారంగా పండుతుంది. ఇదే వలస కుటుంబాలకు వర్తిస్తుంది. ఒక దేశం నుంచి మరోదేశం వెళ్లే కుటుంబంలో తొలితరం ఎన్నో త్యాగాలు చేస్తుంది. మరెన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని స్థిరపడి ముందు తరానికి మంచి అవకాశాల్ని, జీవితాన్ని అందిస్తుంది. వలసజీవుల బతుకును ప్రతిబింబిస్తోంది కనునే ఈ చిత్రానికి ఆ మొక్క పేరును పెట్టినట్లు దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే మినారిని ఎలా అయినా తినొచ్చు. కూరల్లో, సూపుల్లో, ఆఖరికి నీళ్లలో ఉడకబెట్టి కూడా తినొచ్చు. మెడిసిన్‌గానూ పనికొస్తుంది. ఇది ఎలాంటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కొని బలంగా విస్తరిస్తుంది. కుటుంబం కూడా ఎలాంటి పరిస్థితులెదురైనా, ఆర్థికంగా ఎలా ఉన్నా కలిసికట్టుగా ఉండాలనే సందేశాన్నిస్తుంది.
ఇవీ చదవండి:ఆస్కార్ బరిలో నటులు.. అవార్డు ఎవర్ని వరిస్తుంది?
అతివకు 'ఆస్కార'మెక్కడ?
నిశ్శబ్ద ప్రపంచంలో కన్నీళ్లు రాలిన శబ్దం!