ఆర్థిక సమస్యలు, ప్రేమ విఫలం, ఒత్తిడి, మోసాలు, విరక్తి.. కారణం ఏదైనా కావొచ్చు.. తాత్కాలిక సమస్యల్ని ఎదుర్కోలేక చాలామంది క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే త్యజిస్తున్నారు. స్టార్ హోదా.. డబ్బు.. అభిమానులు.. గొప్ప పేరున్న సినీనటులు కూడా ఆత్మహత్య చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. నాటి సిల్క్‌స్మిత నుంచి నేటి బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వరకూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడిన తారలెందరో ఉన్నారు. తాజాగా సుశాంత్ ఆత్మహత్య భారత సినీ పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది.
సుశాంత్ సింగ్
బుల్లితెర నటుడిగా కెరీర్ ఆరంభించి.. స్టార్‌గా ఎదిగారు సుశాంత్. కెరీర్ పరంగానూ ఫామ్‌లోనే ఉన్నారు. గతేడాది వచ్చిన ‘చిచ్చోరే’ మంచి హిట్ అందుకుంది. సంజనా సంఘితో కలిసి సుశాంత్ నటించిన ‘దిల్ బెచారా’ మేలో విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఆదివారం ఉదయం ముంబయిలోని తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకుని సుశాంత్, ఆత్మహత్య చేసుకోవడం షాక్‌కు గురి చేసింది. పేరు, డబ్బు, ఫేమ్ ఉన్న ఆయన.. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది. ఒక్కగానొక్క కుమారుడి మరణంతో సుశాంత్ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. మరోపక్క ఇది ఆత్మహత్య కాదని ఆయన మామయ్య పోలీసులతో అన్నట్లు తెలిసింది. సూసైడ్ నోట్ కూడా లేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రత్యూష బెనర్జీ
‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య దేశంలో పెను సంచలనం సృష్టించింది. 2016 ఏప్రిల్ 1న ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. 25 ఏళ్ల తమ కుమార్తె మరణానికి కారణం ప్రియుడు రాహుల్ రాజ్ అని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రత్యూషను అతడు మానసికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితులూ రాహుల్‌దే తప్పని విచారణలో చెప్పారు. ఈ క్రమంలో ప్రత్యూష ఆత్మహత్యకు గంట ముందు.. ఆమెకు, రాహుల్‌కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను పోలీసులు సేకరించారు. ఆ సంభాషణ ఆధారంగా రాహులే ప్రత్యూష ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఈ కేసు విచారణ ఇంకా కొలిక్కి రాలేదు.
ఉదయ్ కిరణ్
ఒక్కప్పుడు లవర్‌బాయ్‌గా యువతను ఆకట్టుకున్న కథానాయకుడు ఉదయ్ కిరణ్. ఆయన 2014 జనవరి 5న తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. కెరీర్ పరంగా సక్సెస్ లేకపోవడం.. ఆర్థిక సమస్యలు వెంటాడటం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. 33 ఏళ్ల వయసులోనే ఆయన మరణించడం అందర్నీ బాధించింది. ఇప్పటికీ ఆయన మృతికి గల అసలు కారణం తెలియలేదు.
కునాల్ సింగ్
‘ప్రేమికుల రోజు’ చిత్రంతో కథానాయకుడి అరంగేట్రం చేసి, పాపులారిటీ సంపాదించుకున్నారు కునాల్ సింగ్. ఆయన ఛార్మింగ్ లుక్స్, హెయిర్ స్టైల్ అప్పట్లో యువతను ఆకర్షించాయి. ఆపై పలు సినిమాల్లో నటించిన ఆయన.. 2008 ఫిబ్రవరి 7న ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయిలోని అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు. 33 ఏళ్ల వయసులోనే ప్రాణాలు తీసుకున్నారు. అయితే తన కుమారుడి శరీరంపై గాయాలు ఉన్నాయని, ఇది ఆత్మహత్య కాదని ఆయన తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ సంఘటన జరగడానికి కొన్ని నెలల ముందే కునాల్ చేతికి గాయం చేసుకుని, ఆత్మహత్యకు యత్నించారని విచారణలో తెలిసింది. చివరికి ఆయనది ఆత్మహత్యేనని సీబీఐ విచారణలో తేలింది. ఆ సమయంలో కునాల్ ‘యోగి’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. సినిమా అవకాశాలు ఉన్నప్పుడు.. ఆయన ఎందుకు ఇలా చేశారో తెలియదు.