టాలీవుడ్లో అగ్రహీరోలతో పోటీపడి నటించింది హీరోయిన్ విజయశాంతి. అభిమానుల చేత 'లేడీ సూపర్‌స్టార్' అని పిలిపించుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటు చిత్రపరిశ్రమకు దూరమైంది. ఇప్పుడు వెండితెరపై రీఎంట్రీకి సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి- మహేశ్‌బాబు కాంబినేషన్లో వస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.
1998లోనే రాజకీయాల్లోకి ప్రవేశించినా 2006 వరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది విజయశాంతి. అదే ఏడాది చివరిగా 'నాయుడమ్మ' చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు అంకితమైంది. 2009లో ఎంపీగా గెలిచింది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వర్తించింది.
తన సినీ ప్రయాణంలో వివిధ భాషల్లో దాదాపు 180 చిత్రాల్లో నటించిందీ హీరోయిన్. 1991లో 'కర్తవ్యం' సినిమాలో నటనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ఈ చిత్రానికి అప్పట్లోనే కోటి రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకుంది. 'రాములమ్మ' చిత్రంలో అద్భుత నటనకుగాను విజయశాంతి ఉత్తమ నటిగా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకుంది.