బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ నిర్మించిన వెబ్‌సిరీస్ 'బేతాళ్'. హరర్ కథతో తెరకెక్కించారు. ఈనెల 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. లాక్డౌన్ వల్ల అందరూ ఇంట్లోనే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్‌ను వినూత్నంగా చేస్తున్నారు షారుక్. ఇందులో భాగంగా షార్ట్‌ఫిల్మ్ పోటీని ప్రకటించారు. హరర్ నేపథ్య కథాంశంతో ఓ షార్ట్‌ఫిల్మ్‌ను చిత్రీకరించి తనకు పంపాలని ట్వీట్ చేశారు. "మనమందరం ఈ క్వారంటైన్ సమయాన్ని ఓ సృజనాత్మక హరర్ కామెడీ షార్ట్‌ఫిల్మ్‌ను తీసేందుకు వినియోగిద్దాం" అని వ్యాఖ్య జోడించారు.
పంపిన వాటిలో మూడు లఘచిత్రాలను ఎంపిక చేసి విజేతలుగా ప్రకటిస్తామని షారుక్ వెల్లడించారు. 'బేతాళ్' బృందంతో సహా తాను ఆ ముగ్గురు విజేతలతో వీడియో కాల్ మాట్లాడుతానని చెప్పారు. లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ, కేవలం ఇంట్లో మాత్రమే దీనిని చిత్రీకరించాలని అన్నారు. అందులో నటించేవారు తప్పకుండా సామాజిక దూరం పాటించాలని తెలిపారు. మే 18 లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తమకు పంపాలని వెల్లడించారు.