శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'గాలి సంపత్'. ఈ చిత్రం నేడు(గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో ఈటీవీ భారత్ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
యువ దర్శకుడు అనిల్ రావిపూడి పేరుతో ప్రచారమైన చిత్రం 'గాలిసంపత్'. పలువురు అగ్ర కథానాయకులతో చిత్రాలు తీసిన ఆయన స్క్రీన్‌ప్లే సమకూర్చడం.. నిర్మాణంలో భాగం కావడం.. దర్శకత్వ పర్యవేక్షణ చేయడం వల్ల ఈ సినిమా పరిశ్రమతోపాటు.. ప్రేక్షకుల దృష్టినీ ఆకర్షించింది. శ్రీవిష్ణు, రాజేందప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మరి చిత్రం ఎలా ఉంది? గాలి సంపత్ కథ ఏంటి?
కథేంటంటే:గాలిసంపత్ (రాజేంద్రప్రసాద్)కి నోట మాట రాదు. గాలితో ఫిఫి భాష మాట్లాడుతుంటాడు. అతని భాష అర్థమయ్యేలా చెప్పేందుకు పక్కన ఓ ట్రాన్స్‌లేటర్ (సత్య) కూడా ఉంటాడు. గాలిసంపత్ తన కొడుకు సూరి (శ్రీవిష్ణు)తో కలిసి జీవిస్తుంటాడు. నోట మాట రాకపోయినా సరే.. ఎప్పటికైనా నాటకాల్లో బహుమతి గెలిచి తన కొడుక్కి ట్రక్ కొని ఇవ్వాలనేది ఆయన కల. అందుకోసం ఊళ్లో తన గ్యాంగ్‌తో కలిసి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో తండ్రీ కొడుకుల మధ్య చిన్నపాటి తగాదాలు కూడా జరుగుతుంటాయి. ఓ రోజు పెద్ద గొడవే జరుగుతుంది. తన కొడుకు అన్న మాటలు సంపత్‌ని బాధపెడతాయి. ఆ బాధలో ఉండగానే అనుకోకుండా ఇంటి పక్కనున్న నూతిలో పడిపోతాడు. నోటి నుంచి మాట రాని సంపత్ 30 అడుగుల నూతిలో నుంచి ఎలా బయటికొచ్చాడు? తన తండ్రి జాడ తెలుసుకునేందుకు కొడుకు ఎలాంటి పాట్లు పడ్డాడు? ఇంతకీ గాలిసంపత్ గతమేమిటి? ఆయనకి మాట పడిపోవడానికి కారణమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: మంచి కాన్సెప్ట్‌తో కూడిన చిత్రమిది. హాస్యం, భావోద్వేగాలు, మానవీయ విలువలతో పాటు థ్రిల్లింగ్ అంశాలకి చోటున్న కథ. ఇలాంటి కథల్ని ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా చెప్పడంలోనే అసలు సిసలు పనితనం దాగి ఉంటుంది. ఆ విషయంలో చిత్రబృందం గట్టి ప్రయత్నమే చేసింది. ప్రథమార్ధం సినిమా అక్కడక్కడా నవ్వులు పంచుతూ సాగుతుంది. ద్వితీయార్ధంలో భావోద్వేగాలకి పెద్దపీట వేశారు. థ్రిల్లింగ్ అంశాలకి కూడా చోటున్నప్పటికీ.. ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని మరింత సహజంగా, బలంగా చూపించడంలో చిత్రబృందం కాస్త తడబడింది. ఓటీటీ ప్రభావం మెండుగా ఉన్న ఈ రోజుల్లో ప్రేక్షకులు ప్రతి సన్నివేశం నుంచి గాఢమైన ప్రభావాన్ని ఆశిస్తారు. కానీ, ఈ సినిమా ఏ భావోద్వేగాన్నీ బలంగా పంచకుండా ముగుస్తుంది. చిత్రబృందంపై తాము ఎంచుకున్న కథ కంటే కూడా.. మార్కెటింగ్‌కి సంబంధించిన విషయాలు ఎక్కువగా ప్రభావం చూపించినట్టు అనిపిస్తుంది. ఆ ప్రభావం సినిమాపై అడుగడుగునా కనిపిస్తుంది. గాలిసంపత్ పాత్ర పరిచయం, అతని ఫిఫి భాష, ట్రాన్స్‌లేషన్‌తో పండే వినోదం ప్రథమార్ధానికి హైలైట్‌గా నిలిచింది.
హీరో-హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ అది పెద్దగా ప్రభావం చూపించదు. రాజేంద్రప్రసాద్ రంగస్థలంపై నాటక ప్రదర్శన, విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు గుండెలని బరువెక్కిస్తాయి. రాజేంద్రప్రసాద్ నూతిలో పడినప్పటి నుంచి కథలో థ్రిల్ మోతాదు మరింతగా పెరిగినట్టవుతుంది. ద్వితీయార్ధంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌తో పాటు.. రాజేంద్రప్రసాద్ నూతిలో నుంచి బయట పడేందుకు చేసే ప్రయత్నాలే సినిమాకి కీలకం. నిజానికి ఈ సినిమా కథంతా ముందే చెప్పేసింది చిత్రబృందం. నూతిలో నుంచి ఎలా బయట పడ్డాడనే విషయమే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాలి కాబట్టి.. ఆ సన్నివేశాల్ని మరింత పకడ్బందీగా, సహజంగా తీర్చిదిద్దుంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది. పరిమితులకి లోబడి తీసిన సినిమా కావడం వల్ల ఆ సన్నివేశాలు ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపించవు. ప్రకృతికి సంబంధించిన అంశాన్ని ఈ కథకి ముడిపెట్టిన తీరు ఆకట్టుకుంటుంది. శ్రీనివాస్‌రెడ్డి పాత్ర నేపథ్యంలో మూఢభక్తి సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. ద్వితీయార్ధంలో బ్యాంక్ మేనేజర్, ఆడిటర్ మధ్య ఎపిసోడ్స్, పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే: రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు పోషించిన పాత్రలే ఈ సినిమాకి కీలకం. వారిద్దరూ తండ్రీ కొడుకులుగా ఒదిగిపోయారు. చక్కటి భావోద్వేగాల్ని పండించారు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ అనుభవం ఈ సినిమాకి బాగా పనికొచ్చింది. రంగస్థలంపై ఏకపాత్రాభినయం, నూతిలో ఉంటూ తన కొడుకు మాటలు విన్నాక ఆయన పలికించే హావభావాలు, అక్కడ పండించిన భావోద్వేగాలు మనసులకి హత్తుకునేలా ఉంటాయి. శ్రీవిష్ణు తనకి అలవాటైన పాత్రలోనే కనిపిస్తూ భావోద్వేగాలు పండించారు. కథానాయిక లవ్‌లీ సింగ్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ, కొన్ని సన్నివేశాల్లోనైనా అందంగా కనిపించింది. సత్య ట్రాన్స్‌లేటర్‌గా ప్రథమార్ధంలో బాగా నవ్వించాడు. శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీష్ కురువిల్లా, రఘుబాబు, రజిత తదితరులు పాత్రల పరిధి మేరకు నవ్వించారు.
సాంకేతిక విభాగాలు చక్కటి పనితీరుని కనబరిచాయి. సాయి శ్రీరామ్ కెమెరా అరకు అందాల్ని చాలా బాగా చూపించింది. అచ్చు రాజమణి పాటలు, నేపథ్య సంగీతం సినిమాపై బలమైన ప్రభావమే చూపించింది. అనిల్ రావిపూడి స్క్రీన్‌ప్లే మెరుపులు అక్కడక్కడా కనిపిస్తాయి. కానీ చాలా సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే సాగుతుంటాయి. ఎస్.కృష్ణ రాసిన కథలోనైతే కొత్తదనం కనిపిస్తుంది.
బలాలు
బలహీనతలు
+ రాజేంద్రప్రసాద్ నటన
- ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
+ప్రథమార్ధంలో హాస్యం
+పతాక సన్నివేశాలు
చివరిగా: గాలి సంపత్.. కాలక్షేపం చేయిస్తాడు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!