"నా కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఎక్కువే. అయినా సరే పరిశ్రమ, ప్రేక్షకులు నాపైన నమ్మకం కోల్పోలేదు. పరాజయాల వెనక నా ప్రయత్నలోపం కనిపిస్తుందే తప్ప.. ప్రేక్షకులు మాత్రం మంచి సినిమా తీసినప్పుడంతా ఆదరించారు. మంచి కలయికల్లో సినిమాలు తీశా. మళ్లీ కచ్చితంగా అందరి ప్రేమ పొందుతానని నా నమ్మకం"
మాస్ సినిమాకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు శ్రీనువైట్ల. హీరోయిజానికి.. యాక్షన్ అంశాలకీ తనదైన శైలి హాస్యాన్ని మేళవిస్తూ ప్రేక్షకుల్ని నవ్వించారు. వరుస విజయాల్ని అందుకున్నారు. ఈమధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయన ఇప్పుడు డబుల్ డోస్ వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారు. మంచు విష్ణుతో ‘డి అండ్ డి’ తెరకెక్కించేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనువైట్లతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ విషయాలివీ..
లాక్‌డౌన్‌లో కథలపైనే దృష్టిపెట్టారా?
రచయితలతో జూమ్‌లో మాట్లాడుకోవడం, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసుకోవడం, వ్యాయామం చేయడం. దాదాపుగా ఇలాగే గడిచింది లాక్‌డౌన్. ఈ విరామంలో జరిగిన మంచి విషయం ఏమిటంటే... మూడు కథలు పక్కాగా సిద్ధం కావడం. ‘డి అండ్ డి’ చిత్రీకరణ త్వరలోనే మొదలు పెడతాం. ఆ తర్వాత వెంట వెంటనే మిగిలిన సినిమాలు చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వాటిని కూడా త్వరలోనే ప్రకటిస్తాం.
‘ఢీ’ సినిమాకి ‘డి అండ్ డి’ కథకూ ఎలాంటి సంబంధం ఉంటుంది?
దానికి పూర్తి భిన్నమైన కథతో తెరకెక్కిస్తున్నాం. ‘ఢీ’కి కొనసాగింపు ఎంతమాత్రం కాదు. కానీ ఎక్కడో ఆ సినిమాతో సహజమైన ఓ చిన్న కనెక్షన్ మాత్రం ఉంటుంది. చూస్తున్నప్పుడు కచ్చితంగా ‘ఢీ’ చూసిన క్షణాలు, ఆ పాత్రలు లీలగా గుర్తుకొస్తాయి. ‘ఢీ’ సినిమా అనేది నాకో మంచి అనుభవం. ఆ సినిమాని గుర్తు చేసుకుంటూ, నవ్వుకుంటూ ‘డి అండ్ డి’ కథ తయారు చేసుకున్నాం.
వెబ్‌సిరీస్‌లు చూస్తున్నా అన్నారు కదా. ఆ తరహాలో ప్రయత్నం చేయాలనే ఆలోచనలు మీకేమైనా వచ్చాయా?
వెబ్‌సిరీస్‌లు చూస్తూ ట్రెండ్‌ని అర్థం చేసుకుంటుంటా. అంతే కానీ.. అలాంటి ప్రయత్నాలు చేయాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ రాలేదు. నా దృష్టిలో సినిమాతో పోలిస్తే వెబ్‌సిరీస్‌లు పూర్తిగా వేరు. వాటి కంటెంట్ వేరు. నా సినిమాల నుంచి ప్రేక్షకులు వంద శాతం కామెడీని ఊహిస్తారు. నా ఆలోచనలు ఎప్పుడూ వెండితెర లక్ష్యంగానే ఉంటాయి. అయితే వేదిక ఏదైనా... కంటెంట్ అత్యుత్తమంగా ఉండాల్సిందే, అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఓటీటీ వేదికలవల్ల ప్రేక్షకులు ప్రపంచ సినిమాకు చేరువ అవుతున్నారు. అది మంచి పరిణామమే.