ఇంటర్నెట్ విస్తృతి పెరిగాక.. మనందరం జాతీయ, అంతర్జాతీయ సినిమాలు చూడటం మొదలుపెట్టాక తెలుగులో ఇలాంటివి రావడం లేదే అనే ప్రశ్న మొదలైందని దర్శకుడు కరుణ కుమార్(Karuna Kumar) చెబుతున్నారు. 'పలాస 1978'తో(Palasa 1978) విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ఈయన. ఇటీవల సుధీర్‌బాబు(Sudheer Babu) హీరోగా 'శ్రీదేవి సోడాసెంటర్'(Sridevi Soda Center) చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కరుణకుమార్ విలేకర్లతో ముచ్చటించారు.
- "పది పద్నాలుగేళ్లుగా మనం కథలు చెప్పడం మరిచిపోయాం. ఒక మూస ధోరణిలో వెళ్లిపోతున్నాం. పరబాషా సినిమాల్ని చూసి మెచ్చుకుంటున్నాం తప్ప.. మనం అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. 'శంకరాభరణం', 'సిరివెన్నెల', 'జ్యోతి', 'విజేత', 'ఛాలెంజ్'.. ఇలాంటి కళాత్మకమైన సినిమాలు ఒకప్పుడు తెలుగులో వచ్చినంతగా ఏ భాషలో రాలేదు. తెలుగువాళ్లు కథలు చెబితే వినడానికి సిద్ధంగా ఉంటారని ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన 'అరుంధతి', 'బాహుబలి' లాంటి చిత్రాలు నిరూపించాయి. కథల్నే చెబుదామని నేను పరిశ్రమలోకి వచ్చా. అలా ఓ బలమైన కథను చెప్పినప్పుడు ఒప్పుకుని 'పలాస' రూపంలో తొలి అవకాశం ఇచ్చారు నిర్మాతలు. అలా మరో బలమైన సమస్యను 'శ్రీదేవి సోదా సెంటర్' చిత్రంలో చర్చించాం. 'పలాస' తరహాలో కాకుండా.. కొంచెం భిన్నంగా గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇప్పటివరకు గోదావరి జిల్లాలంటే అరిటాకులు, అమ్మమ్మల ఆప్యాతలు, పొలంగట్లనే తెరపై చూశాం. అక్కడి సామాజిక, ఆర్ధిక కోణాల్ని, ఆ నేపధ్యంలో భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ సినిమాతో చేశాం. ఈ కథలో ప్రేమకథ కూడా ఉంటుంది.. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించాం.
- "గ్రామాల్లో అల్లరి చిల్లరిగా కనిపించే ఓ తెలివైన సాధారణమైన ఎలక్ట్రిషియన్‌గా కనిపిస్తాడు కథానాయకుడు. ఓ సోడాసెంటర్ యజమాని కూతురు కథానాయిక. వీరి మధ్య చిగురించిన ప్రేమే ఈ చిత్రం. ఆ ప్రేమ తాలూకు పర్యవసనాలు, దాని వెనక సాంఘిక సామాజిక ఆర్ధికపరమైన ఇబ్బందుల మధ్య ఆ జంటకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఆసక్తికరం".
- "నేను తీసే ప్రతి సినిమా భిన్నంగా ఉండాలని కోరుకుంటా. నేను రాసుకునే ప్రతి కథకూ ఆ కథే హీరో. నా కథను నమ్మిన వాళ్లతోనే సినిమాలు చేస్తాను. 'పలాస'లో మొత్తం తెలుగువాళ్లే నటించారు. ఇందులో కూడా 99 శాతం తెలుగు నటులే! ఈ సినిమా విడుదల తర్వాతే తదుపరి సినిమా ఎవరితో అనేది చెబుతా. పది రూపాయలు ఖర్చు అయ్యే పనిని, రూ.8కే చేసి చూపించాలని తపిస్తుంటా."