తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సిరిమల్లె పువ్వా.. చిరకాలం గుర్తుండిపోవా..!

అతిలోకసుందరిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటి శ్రీదేవి. భారతీయ సినీ ప్రపంచంలో తొలి సూపర్​స్టార్​గా ఎదిగిన అరుదైన నటీమణి. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆమె  అభినయానికి సినీ ప్రియులు దాసోహం అయ్యారు. నేడు శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమెపై ఓ లుక్కేద్దాం!

By

Published : Aug 13, 2019, 10:23 AM IST

Updated : Sep 26, 2019, 8:23 PM IST

శ్రీదేవి

శ్రీదేవి.. ఈ పేరునుప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. కొంటెగా నవ్వినా.. కోపంగా చూసినా, కుర్రకారును కవ్వించినా .. ప్రేక్షకులను కంటతడి పెట్టించినా ఆమే.. కడవరకు ఉండకుండా మధ్యలోనే కనిపించకుండా పోయిందా నటి. అతి సామాన్యురాలిగా జన్మించి అతిలోకసుందరిగా ఎదిగి ఆ పేరును సార్ధకం చేసుకున్న శ్రీదేవి జయంతి నేడు.

బాలనటిగా తెరంగేట్రం..

1963 ఆగస్టు 13న అయ్యప్పన్, రాజేశ్వరి దంపతులకు శివకాశిలో జన్మించింది. తుణైవాన్ అనే తమిళ చిత్రంతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. తెలుగులో కృష్ణ, విజయ నిర్మల నటించిన మా నాన్న నిర్దోషి సినిమా బాలనటిగా ఆమె తొలి చిత్రం. జూలీ(1975) చిత్రంతో హిందీలో పరిచయమైంది.

కమల్​తో 22 చిత్రాల్లో..

గాయత్రి అనే తమిళ సినిమా శ్రీదేవికి కథానాయికగా తొలిచిత్రం. తెలుగులో అనురాగాలుతో హీరోయిన్​గా పరిచయమైంది. అగ్రకథానాయకులందరితోనూ పనిచేసిన అతిలోకసుందరి ఎక్కువగా రజనీ కాంత్(23), కమల్​ హాసన్​(22) సరసన నటించింది. కమల్ - శ్రీదేవిది హిట్ కాంబినేషన్. ఎన్టీఆర్, ఏఎన్​ఆర్, కృష్ణ, శివాజీ గణేషన్, ఎమ్​జీఆర్​ లాంటి దిగ్గజాలతో నటించి మంచి పేరు తెచ్చుకుంది శ్రీదేవి.

తెలుగు సినిమాలే ఎక్కువ...

నటిగా పలు భాషల్లో నటించిన శ్రీదేవి తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్​లో 92 సినిమాల్లో పనిచేయగా.. హిందీలో 72, తమిళంలో 72, మలయాళంలో 25, కన్నడలో 6 చిత్రాల్లో నటించింది. దాదాపు 300 సినిమాల్లో కనిపించింది.

అవార్డులు..

శ్రీదేవి నటనకు పురస్కారాలు వరుసకట్టాయి. ఆమె సినీ ప్రస్థానానికి మెచ్చి 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1991లో వచ్చిన ఖుదా గవా చిత్రానికి అఫ్గానిస్థాన్​ ప్రభుత్వం ఆర్డర్​ ఆఫ్​ అఫ్గానిస్థాన్​తో సత్కరించింది. మామ్(2017) చిత్రంలోని నటనకుగాను జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇవే కాకుండా 14 ఫిల్మ్​ఫేర్​ పురస్కారాలు, పలు రాష్ట్రాల ప్రత్యేక అవార్డులు తన ఖాతాలో వేసుకుంది.

వివాహం..

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్​ను ప్రేమించి పెళ్లాడింది శ్రీదేవి. 1996లో వివాహం జరిగింది. వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ప్రస్తుతం జాన్వీ.. బాలీవుడ్​లో హీరోయిన్​గా నటిస్తోంది.

రెండో ఇన్నింగ్స్​...

వివాహం తర్వాత సినిమాలకు విరామం తీసుకున్న శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్​(2012) చిత్రంతో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించింది. పులి(2015), మామ్(2017) చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మామ్ చిత్రం ఆమె నటించిన ఆఖరు సినిమా.

మరణం..

బంధువుల పెళ్లి కోసమని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్​లో పడి మరణించింది. 2018 ఫిబ్రవరి 24న అతిలోక సుందరి అనంతలోకాలకు వెళ్లిపోయి అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది.

ఇది చదవండి: కొత్త దర్శకుడి కథకు మెగా మేనల్లుడు ఓకే ?

Last Updated : Sep 26, 2019, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details