తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అతిలోక సుందరి.. ఓ మరలిరాని అద్భుతం.. చెదిరిపోని జ్ఞాపకం - శ్రీదేవి సమాచారం

సరిగ్గా రెండేళ్ల క్రితం అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. దుబాయ్​లోని ఓ హోటల్​లో అనుమానస్పదరీతిలో మరణించింది. ఆమె మృతి చెందటం వల్ల అభిమానుల హృదయాలు శోకసంద్రంగా మారాయి. నేడు శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.

sreedevi death anniversary special story
అతిలోక సుందరి.. నీ జ్ఞాపకాలు ఇంకా మమ్మల్ని తరుముతున్నాయి

By

Published : Feb 24, 2020, 11:18 AM IST

Updated : Mar 2, 2020, 9:24 AM IST

శ్రీదేవి.. ఏంటి..? ఎప్పుడూ లేనిది పిలుపు ఇంత చప్పగా, మామూలుగా ఉంది? అనుకుంటున్నావా.. ఇది వరకైతే 'మా అతిలోక సుందరికి' అని పిలిచాం. 'మా సిరిమల్లె పువ్వుకి' అంటూ మొదలుపెట్టాం. నీ అందానికి సరితూగే ఉపమానాలు ఎక్కడున్నా వెదికి.. బతిమాలి, బుజ్జగించి నీ పేరు జోడించాం.

నిజం చెప్పాలంటే.. వాటికీ నీ పక్కన ఒదిగిపోవడం మహా ఇష్టమనుకో! కానీ ఇప్పుడు ఏమని చెప్పాలి.. ఎక్కడి నుంచి మొదలెట్టాలి..?మా గుండెల్ని పిండిచేసి - ఏమి తెలియనట్టు రెక్కలు విప్పుకుని స్వర్గలోకానికి ఎగిరిపోయావ్‌.. అమృతం తాగే వంకతో మమ్మల్ని కన్నీటి సుడుల్లో నెట్టేసి మాయమయ్యావ్‌..అందుకే నీ మీద కోపం వచ్చింది.

అతిలోక సుందరి.. నీ జ్ఞాపకాలు ఇంకా మమ్మల్ని తరుముతున్నాయి

సరేలే..ఎలా ఉన్నావ్‌.. బాధ్యతల బంధనాలు తెంపుకుని, పంజరంలోంచి ఎగిరిపోయిన చిలకలా, ఇంద్రలోకంలోనో.. చంద్రలోకంలోనో.. ఏ మేఘాల కొమ్మల్లోనో, మెరుపుల మాలల మధ్యనో క్షేమంగానే ఉండి ఉంటావ్‌.. హంసలతో ఆడుకుంటున్నప్పుడో, పారిజాత పుష్పాలతో మాల కడుతున్నప్పుడో కాస్త కిందకి చూస్తే శ్రీదేవీ.. నువ్వులేక వెలవెలబోతున్న మేమంతా కనిపిస్తాం. గతేడాది సరిగ్గా ఇదే రోజు నువ్వు లేవని తెలిసి ఓ సారి మా గుండె ఆగి..మళ్లీ కొట్టుకుంది. కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

నువ్వు లేకుండా ఉషోదయాలు అవుతాయా? నువ్వులేవని తెలిసినా పూలు పూస్తాయా? నువ్వు లేకపోయినా..ఈ భూమి గుండ్రంగానే తిరుగుతుందా? ప్రపంచం అంతా ఎప్పటిలానే మామూలుగానే ఉందే! అందుకే నిద్రలో వచ్చిన పీడకల అనుకున్నాం. కలలు అబద్దాలులేమో గానీ, కన్నీళ్లు కావుగా. అవి చెంపల మీద నుంచి వెచ్చగా జారుతూ 'నిజమే' అన్నాయి.

అరె..నీ వయసెంతని.. నువ్వు చూసిన జీవితం ఎంతని? ఇంకా ఉండాలి కదా... మొన్నే 'మామ్‌'లో ఎంత మురిపెంగా కనిపించావ్‌..ఇంత వయసొచ్చినా ఆ అందం చెక్కుచెదరలేదని ఎంత సంబరపడ్డామో. మా దిష్టిగానీ గట్టిగా తగిలిందా..? అయినా నీ గుండె ఆగిపోవడం ఏమిటి శ్రీదేవి. దానికి తెలీదా..అది శ్రీదేవి గుండె అని. దాని కోసం ఎన్నో కోట్ల హృదయాలు అనుక్షణం కొట్టుకుంటాయని.

అతిలోక సుందరి.. నీ జ్ఞాపకాలు ఇంకా మమ్మల్ని తరుముతున్నాయి

ఇంత అందాన్ని ఇచ్చి, ఇంతమంది అభిమాన బలాన్ని ఇచ్చి, నీ గుండెని అంత బలహీనంగా తీర్చిదిద్దిన దేవుడికే నిజంగా గుండె లేదు. ఆ క్షణంలో నీ సినిమాలూ, అందులో నీ నవ్వులు, నీ అమాయకత్వాలు, అలకలు, చిరు కోపాలు..అన్నీ కట్టుకట్టుకుని గుర్తొచ్చాయి. జ్ఞాపకాలు ఇంత భారంగా ఉంటాయని తొలిసారి అర్థమైంది. ఇంతలోనే ఇంకో షాక్‌. బాత్‌ రూమ్‌ టబ్‌లో మునిగిపోయావని.. అందుకే ప్రాణాలొదిలేశావన్న మాటలు వినిపించాయి.

అవి మమ్మల్ని మరింతగా మెలిపెట్టేశాయి. రెక్కలు విప్పుకుని మేఘాలకు ఎగిరిన దానివి. స్వర్గం నుంచి హిమాలయాలకు, అటు నుంచి స్వర్గానికీ క్షణాల్లో ప్రయాణం చేసిన దానివి. నిన్ను ఆ కొద్ది నీళ్లు ముంచేస్తాయా? స్నానాల గదికీ, అందులోని నీటికీ, నీ చుట్టూ ఉన్న నాలుగ్గోడలకూ నీ విలువ తెలియకుండా పోయిందేంటి అని ఎంత బాధపడ్డామో. ఆ నీటిలో నీ ఊపిరి కలిసిపోతున్నప్పుడు నీవెంత నరకం అనుభవించావో తెలీదు గానీ.. మా ప్రాణాలు మాత్రం క్షణానికోసారి విలవిలలాడిపోయాయి.

అతిలోక సుందరి.. నీ జ్ఞాపకాలు ఇంకా మమ్మల్ని తరుముతున్నాయి

ఈ విషాదంలో ఉండగానే..శ్రీదేవి మద్యం తీసుకుంది అన్నారు! వసంత కోకిలలో అమాయకమైన నీ మోము గుర్తు తెచ్చుకుంటే చాలు.. ఇప్పటికీ నువ్వు పాలు తాగే పసి పాపాయివే అనిపిస్తుంది. 'పదహారేళ్ల వయసు'లో ఉయ్యాల ఊగుతున్న సన్నివేశాలు కదలాడాయి. నువ్వు మాకింకా పసిదానివే కదా! అలాంటిది నీలో ఆల్కహాల్‌ ఉండడం ఏమిటి? నీ చూపు మత్తు.. నీ మాట మత్తు. నీ నవ్వు మత్తు. నీకు మరో మత్తు అవసరమా.. అది అబద్ధమని, నిజమైనా సరే..మేం నమ్మమని నీకు తెలుసు. అక్కడ్నుంచి ఎన్ని డ్రామాలు నడిచాయో నీకు తెలుసా శ్రీదేవీ..? నీ గుండె ఒక్కసారే ఆగిపోయింది. కానీ నీ గురించి మాట్లాడినా ప్రతీసారీ మా గుండె ఆగుతూనే ఉంది. నీ జ్ఞాపకాలతో మేల్కొని మళ్లీ మోగుతూనే ఉంది. అందం కోసం తాపత్రయపడ్డావా..అందమే నీ ఒంటిని తాకాలని తెగ ముచ్చట పడుతుంది కదా? ఆస్తుల కోసం గొడవలు పడ్డావా..మా అభిమాన ధనం ముందు అదెంత..? ఒంటరి తనం అనుభవించావా..? మేమంతా లేమా.

అతిలోక సుందరి.. నీ జ్ఞాపకాలు ఇంకా మమ్మల్ని తరుముతున్నాయి

దేవకన్యలా ముస్తాబైన నీ రూపం చూసిన కళ్లకు.. తెల్లని వస్త్రంలో నిన్ను చుట్టేసిన దృశ్యం కనిపించదు. మెరుస్తున్న ఆ కళ్లు.. నిర్జీవంగా మారిపోవడం చూడలేం. వెండి తెరనే వెలిగించిన ఆ తేజం అచేతనంగా కనిపించడం భరించలేం. నువ్వు లేని రోజంతా..క్షణానికో నరకం చూశాం..నిమిషానికో శిక్ష అనుభవించాం.. ఇక చాలు.. ఈ మాటలు చాలు, మాయలు చాలు, ఉబికి వస్తున్న కన్నీళ్లు చాలు! ఎవరేం అనుకున్నా సరే మాకు మాత్రం..

శ్రీదేవి అంటే అందం..

శ్రీదేవి అంటే అమాయకత్వం..

శ్రీదేవి అంటే ముగ్ధమనోహర రూపం..!

నువ్వెప్పుడూ మృతజీవివి కావు.. మా అతిలోక సుందరివే. మాకు తెలిసింది ఇదే. మాలో నీకు నచ్చేది అదే. ఎప్పుడూ ఇలాంటి అందమైన కలల్లోనే ఉంటాం. అందులోనే బతికేస్తాం! మాకు తెలుసు, నువ్వు స్వర్గలోకం నుంచి భూమ్మీదకు విహారానికొచ్చిన దేవకన్యవని.. యాభై నాలుగేళ్ల పాటు మామూలు మనిషిలా మా చుట్టూ తిరిగావ్‌, మమ్మల్ని నవ్వించావ్, కవ్వించావ్‌..!

నువ్వొచ్చిన పని అయిపోయిందని వెళ్లిపోయావ్‌. కాకపోతే కాస్త తొందరపడ్డావంతే. కానీ ఇవేం మనసులో పెట్టుకోక.. మళ్లీ ఎప్పుడైనా రావాలనిపిస్తే క్షణం మాత్రం ఆలస్యం చేయకుండా, కనీసం ఇంద్రుడికి చెప్పకుండా కిందికి దిగిపో. నీ అడుగులు తన వీపుపై ఎప్పుడు పడతాయో అని భూదేవి వేయికళ్లతో ఎదురుచూస్తుంటుంది.

అతిలోక సుందరి.. నీ జ్ఞాపకాలు ఇంకా మమ్మల్ని తరుముతున్నాయి

నీ బొమ్మ తనపై ముద్రించుకోవడానికి వెండితెర.. థియేటర్‌ గుమ్మం ముందే కాపుకాచుకుని కూర్చుంది. నీపై వాలి వెలిగిపోవాలని 'లైట్లన్నీ' ఆరాటపడుతున్నాయి. నీ గురించి కొత్త కథలు ఒలికించాలని కలాలు ముచ్చటపడుతున్నాయి.

ఎప్పట్లా నిన్ను దాచుకోవాలని కోట్ల గుండెలు.. తపస్సులు చేస్తున్నాయి. వస్తావ్‌లే.. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ మా శ్రీదేవివే!

ఇట్లు

నీ కోసం

అనుక్షణం పరితపిస్తున్న నీ అభిమానులు!

అతిలోక సుందరి.. నీ జ్ఞాపకాలు ఇంకా మమ్మల్ని తరుముతున్నాయి

ఇదీ చూడండి.. శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరించిన దీపిక

Last Updated : Mar 2, 2020, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details