"ఎమోషనే నా బలం. నేను ఏ తరహా కథాంశాన్ని చెప్పినా.. అందులో బలమైన ఎమోషన్స్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటా" అన్నారు తేజ మార్ని. 'జోహార్'తో తొలి అడుగులోనే మెప్పించిన దర్శకుడాయన. రెండో ప్రయత్నంగా 'అర్జున ఫల్గుణ' సినిమా తెరకెక్కించారు. శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటించారు. ఈ చిత్రం ఈనెల 31న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర విశేషాలు పంచుకున్నారు తేజ మార్ని.
"జోహార్' సినిమా కంటే ముందే ఈ కథ రాసుకున్నా. దీంతోనే తొలి చిత్రం చేయాలనుకున్నా. కుదర్లేదు. 'జోహార్' తర్వాత మంచి ఆఫర్లు రావడం.. పరిచయాలు దొరకడం వల్ల ఈ కథ బయటకు తీశా. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. ఈ చిత్రం కోసం ముందుగా ఈస్ట్ గోదావరిలో దొరికే కూల్‌డ్రింక్ ఆర్టోస్‌ను టైటిల్‌గా పెట్టాలనుకున్నాం. ఆ కంపెనీ వాళ్లు అందుకు అనుమతివ్వలేదు. తర్వాత 'అర్జున ఫల్గుణ' గురించి మాట్లాడుకున్నాం. పిడుగులు పడుతున్నప్పుడు ధైర్యం కోసం తలచుకునే పేరిది. కథకు సరిగ్గా సరిపోతుందనిపించి.. ఆ పేరు టైటిల్‌గా ఖరారు చేద్దామన్నారు శ్రీవిష్ణు. ఇక ఆ పేరు పెట్టాక సినిమా స్థాయే మారిపోయింది".
"ఈ చిత్రంలో హీరో పాత్ర పేరు అర్జున్. ఊర్లో ఉన్నంత సేపు అర్జునుడిలా ఉంటాడు. ఊరు దాటాక ఫల్గుణుడిగా మారిపోతాడు. అదెలా మారాడన్నదే చిత్ర కథ. 'అర్జున ఫల్గుణ' టైటిల్ పెట్టాక కథలో కాస్త మార్పులు చేశా. యాక్షన్ డోస్ పెంచాను. సిటీలో ఎంత సంపాదించినా మిగిలేది కొంతే. అందుకే అదేదో ఊర్లో ఉండి సంపాదించుకుంటే మంచిది కదా? అని ఎంతో మంది ఆలోచిస్తుంటారు. అలాంటి ఐదుగురు ఊరి కుర్రాళ్ల కథే ఈ చిత్రం. ప్రథమార్ధం వినోదాత్మకంగా సాగితే.. ద్వితీయార్ధమంతా థ్రిల్లింగ్‌గా నడుస్తుంది. ఇక క్లైమాక్స్ చూశాక అందరూ ఎమోషనల్ అవుతారు".