"కథానాయకుడు వెంకటేశ్‌కు వీరాభిమానిని నేను. ఆయన సలహాలు వ్యక్తిగతంగా నాకెంతగానో ఉపకరిస్తుంటాయి. మాస్ ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యే సినిమాలు చేయమని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నా" అన్నారు శ్రీవిష్ణు. కొత్త రకమైన కథలతో ప్రయాణం చేస్తున్న అతి కొద్దిమంది కథానాయకుల్లో ఈయన ఒకరు. 'నీది నాది ఒకే కథ', 'అప్పట్లో ఒకడుండేవాడు', 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా' తదితర చిత్రాలు ఆయన ప్రయాణంలోని వైవిధ్యాన్ని చాటి చెబుతాయి. ఇటీవల హసిత్ గోలి దర్శకత్వంలో 'రాజ రాజ చోర' చేశారు. ఆ చిత్రం గురువారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు బుధవారం విలేకర్లతో చెప్పిన విషయాలివీ..
- "ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ కథానాయకుడిగా నేను ఆత్మ విశ్వాసంతో మాట్లాడితేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అలా మాట్లాడేంత ధైర్యం నాకు ఈ సినిమా కథే ఇచ్చింది. ఇటీవల వేడుకలో ఈ సినిమాను వెంకటేశ్ సర్ చిత్రాలతో పోలుస్తూ మాట్లాడాను. ఆయన సినిమాల తరహాలో ఇందులో భావోద్వేగాలు ఉన్నాయి. వినోదం ఉంది. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటాయి ఆయన సినిమాలు. దానివల్లే నాకు అలా అనిపించి ఉండొచ్చు. 'రాజ రాజ చోర' విషయంలో ప్రతి మాట హృదయం నుంచి వచ్చిందే".
- "ఇందులో నేనొక దొంగగా కనిపిస్తా. నేను చేసే దొంగతనాలు సరదాగా ఉంటాయి. నా కెరీర్‌లో తొలిసారి కథానాయికలతో కలిసి చేసే సందడి కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. మేఘ ఆకాశ్, సునైన.. ఇలా అందరికీ పేరు తీసుకొస్తుందీ చిత్రం".
- "నా ప్రతీ సినిమా గురించి వెంకటేశ్ సర్‌తో చర్చిస్తుంటా. ఒక అభిమానిగా చదువుకునే సమయంలో చాలాసార్లు కలిసినా.. నటుడిగా 'నీది నాదీ ఒకే కథ' తర్వాతే కలిశా. ఆయన ఎన్నో విషయాలు చెప్పారు, ఏం కావాలన్నా అడుగు అన్నారు. ఈ సినిమా చేసే ముందు ఆయనకు కథ చెప్పా. ఈమధ్య కలిసినప్పుడు ట్రైలర్ బాగుందని మెచ్చుకున్నారు. మాస్‌లోనూ విభిన్న సినిమాలు ప్రయత్నించమని చెప్పారు. ప్రస్తుతం 'అర్జున ఫల్గుణ', 'భళా తందనాన' చిత్రాలు చేస్తున్నా. ఇవికాక ఓ పోలీస్ అధికారి సినిమా చేస్తున్నా".