అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కావడానికి రంగం సిద్ధమైందా? ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులు వేచి చూస్తున్న తరుణం రానుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తీయనున్నారు. ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లాలి కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఇంకాస్త ఆలస్యం కానుంది.
అయితే, ఇటీవల చిత్ర నిర్మాత నాగ వంశీ ట్వీట్ చేస్తూ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి తమకు సందేశాలు వస్తున్నాయని, షూటింగ్ మొదలు పెట్టగానే అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న ప్రశ్న అందరిలోనూ నెలకొంది. సరిగ్గా ఈ సమయంలోనే జాన్వీకపూర్ పేరు వినిపిస్తోంది. తారక్‌కు జోడీగా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ప్రస్తుతం కథానాయిక వేట కొనసాగుతోందని సమాచారం. వారిలో జాన్వీకపూర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ తుది దశకు చేరుకుందని.. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.