తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వీడు హీరోనా అని నవ్వారు' - హీరో ధనుష్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడిగానే తొలిసారి మనకి పరిచయమయ్యాడు ధనుష్‌! ఆ తర్వాత 'వై దిస్‌ కొలవెరి!' పాటతో 'అబ్బో మామూలోడు కాదు' అనిపించుకున్నాడు. 'రఘువరన్‌ బీటెక్‌'తో మనలో ఒకడై పోయాడు. ఈ మధ్యే జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకి రెండోసారి ఎంపికై తన స్థాయేమిటో మళ్లీ నిరూపించాడు. 'ఓ దిగువ మధ్యతరగతి కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో అద్భుతాలు సాధించడం!'- ధనుష్‌ సినిమాలకే కాదు అతని నిజజీవిత కథకీ ఇదే ప్రధాన థీమ్‌ అని చెప్పాలి. దాన్నే సవివరంగా ధనుష్‌ మాటల్లో చెప్పాలంటే.

special story on hero dhanush
'వీడు హీరోనా అని నవ్వారు'

By

Published : Apr 4, 2021, 10:47 AM IST

అనగనగా మల్లికాపురం అనే ఊరు. అందులో రంగమ్మ, రామస్వామి నాయుడు అనే రైతు దంపతులూ.. వాళ్లకి ఎనిమిదిమంది పిల్లలూ ఉండేవారు. 'చదువు బాగా అబ్బితేనే బడికెళ్లండి. లేకుంటే పశువులు కాయండి!' అంటుండేవాడు రామస్వామి నాయుడు తన పిల్లలతో. ఆ పశువుల పనికి వెరసి చదువుకే పరిమితమయ్యాడు వాళ్లలో నాలుగోవాడైన కృష్ణమూర్తి. బీఏ చదువుకున్నాడు. ఉన్న ఊళ్లో ఉపాధి దొరక్క రైల్వే ఉద్యోగం కోసమని మద్రాసు వచ్చాడు. రైల్వే పరీక్ష రాశాక మరో ఆరు నెలలపాటు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. వాళ్లని పోషించడానికని రేస్‌కోర్సులో చిరుద్యోగిగా చేరాడు. ఖాళీ సమయంలో కథలేవో రాస్తుండేవాడు. వాటిని అచ్చేసే అవకాశం కోసం రేస్‌కోర్సుకి వస్తుండే ఓ మాసపత్రిక ఆడిటర్‌కి చూపించాడు. ఆయన ఏకంగా అతణ్ణి ఓ సినిమా స్టూడియోలో చేర్చాడు.

ఈలోపు రైల్వే ఉద్యోగం రాదని తేలిపోవడంతో ఆ స్టూడియోలోనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కుదిరాడు కృష్ణమూర్తి. అక్కడ కథా చర్చల్లో పాల్గొంటే రోజుకి రెండ్రూపాయలు 'బేటా' ఇచ్చేవాళ్లు. అతని ఇంటికీ ఆ స్టూడియోకీ ఏడుకిలోమీటర్ల దూరం. బస్సుకి రూపాయి ఛార్జి. దాన్ని ఆదా చేద్దామని రోజూ అంత దూరమూ నడిచే స్టూడియోకి వెళ్లేవాడు కృష్ణమూర్తి. అతని ఇల్లు కూడా.. ఓ సింగిల్‌ గది, అదీ ఓ మురికివాడలో ఉండేది. అప్పటికే ఉన్న ఇద్దరూ కాకుండా ఆ ఇంట్లో మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. పేదరికం పెట్టే బాధలన్నీ అనుభవిస్తూ వచ్చింది ఆ కుటుంబం. సినిమాల్లోకి వచ్చాక సొంత ఊరినే కాదు.. పేరునీ వదులుకోవాల్సి వచ్చింది కృష్ణమూర్తి. తన పేరుని కాస్తా కస్తూరి రాజా అని మార్చుకున్నాడు. ఆ రాజాగారి కథని ఇక్కడితో కట్‌ చేద్దాం. ఎందుకంటారా.. చెబుతా..

ఇదీ చదవండి:'నేను నిర్మాతగా మారడానికి మణిరత్నమే ప్రేరణ'

కన్నీళ్లాగలేదు..

2002 సంవత్సరం అది. విశాఖలో ఓ షూటింగ్‌లో ఉన్నాను. అది నా రెండో సినిమా. షాట్‌ గ్యాప్‌లో టచ్‌-అప్‌ చేసుకుంటూ ఉంటే ఓ వ్యక్తి వచ్చి 'ఈ సినిమా హీరో ఎవరండీ!' అని అడిగాడు. 'నేనే' అని చెబితే జరిగే అవమానమేంటో నాకు బాగా తెలుసు కాబట్టి.. అక్కడ హ్యాండ్సమ్‌గా కనిపించిన సుదీప్‌ అనే నటుణ్ణి చూపించాను. ఆ వ్యక్తి వెళ్లి సుదీప్‌ను ఏం అడిగాడో.. అతను నా వైపు వేలు చూపించాడు. అంతే.. ఆ వ్యక్తి పక్కనే ఉన్న జనాల మధ్యకెళ్లి 'చూడండ్రా.. వాడు హీరోనట! మన ఊరి రిక్షావాళ్లు ఇంతకన్నా బావుంటారు!' అనే సరికి అక్కడున్నవాళ్లందరూ గొల్లుమన్నారు. నాకు కన్నీళ్లాగలేదు. కారులోపలికెళ్లి భోరున ఏడ్చేశాను. ఏడుస్తూనే మా నాన్నకి ఫోన్‌ చేశాను 'ఇదంతా నీ వల్లే నాన్నా! నేను వద్దువద్దంటున్నా సినిమాల్లోకి తెచ్చావ్‌. ఇప్పుడు చూడు.. ఎలా అవమానిస్తున్నారో!' అన్నాను. అప్పుడు ఆయన 'ఇవన్నీ అసలు కష్టాలారా.. ఇలాంటివి ఎన్ని ఎదుర్కొని నేను ఇక్కడికొచ్చానో..!' అంటూ తాను పొట్టకూటి కోసం పట్నం వచ్చి పడ్డ పాట్లన్నీ చెప్పాడు.

హీరో ధనుష్

ఆ కథే ఇందాక నేను మీతో పంచుకుంది. ఆ కథలో కస్తూరి రాజాగా మారిన కృష్ణమూర్తి మా నాన్నే. ఆయన నలుగురు పిల్లల్లో నేను చివరివాణ్ణి. 7జీ బృందావన కాలనీ సినిమా దర్శకుడు శ్రీరాఘవ పెద్దవాడు. మా మధ్యలో ఇద్దరు అక్కలు.. దేవిక, కార్తిక అని. నాకు ఊహ వచ్చేదాకా మేం చెన్నై టి.నగర్‌లో ఉండే కన్నమ్మా పేట మురికివాడలోనే ఉండేవాళ్లం. ఇంట్లో జనాభా ఎక్కువ కాబట్టి అప్పట్లో ఒక్కపూటే తిండి మాకు. నాకు ఏడెనిమిదేళ్లు వచ్చాక కానీ నాన్న సినిమా రంగంలో కుదురు కోలేకపోయాడు. 'సంసారం చదరంగం' దర్శకుడు విశు దగ్గర శాశ్వత అసిస్టెంట్‌గా మారాడు. అక్కడి నుంచి బయటకొచ్చి 1991లో 'ఎన్‌ రాసావిన్‌ మనసిలే' (తెలుగులో రాజశేఖర్‌ హీరోగా 'మొరటోడు నా మొగుడు') తీస్తే అది పెద్ద హిట్‌ అయ్యింది. దాంతో సొంతిల్లూ, కార్లూ అన్నీ వచ్చాయి. ఆ తర్వాత ఆయనవన్నీ వరస హిట్లే. ఆ తర్వాత ఫ్లాప్‌లు మొదలయ్యాయి.

ఓ దశలో తాడో పేడో తేల్చుకుందామని టీనేజీ ప్రేమ ఇతివృత్తంతో ఓ సినిమాని మొదలుపెట్టాడు. ఆ సినిమా కోసం ఐదుగురు కుర్రాళ్లు కావాలి. నలుగురు దొరికారు. ఓ క్యారెక్టర్‌ కోసం కాస్త పేరున్న వాళ్లని అడిగితే కుదర్దన్నారు. మరోవైపు ఆయన పట్టుదలకి పోయి చేసిన అప్పులన్నీ చక్రవడ్డీలుగా మారి వేధించ సాగాయి. అప్పుడు నాకు ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు పూర్తయి.. సెకండియర్‌ అడ్వాన్స్‌ క్లాసులు జరుగుతున్నాయి. ఓ రోజు స్కూల్‌ కోసం గేటు దాటుతున్న నన్ను ఆపి 'ఒరే.. ఇవాళ నేను డ్రాప్‌ చేస్తాను రా!' అని కారెక్కించాడు. స్కూల్‌కి కాకుండా నేరుగా షూటింగ్‌ స్పాట్‌కి తీసుకెళ్లి 'ఈ సినిమాలో నువ్వే హీరోవి!' అన్నాడు.. నేను లబోదిబోమన్నాను!

ఇదీ చదవండి:'మాస్టర్'‌ దర్శకుడితో ప్రభాస్‌ చిత్రం!

నన్ను ఏకిపారేశారు..!

నాకు సినిమాల్లోకి రావడం రవ్వంత కూడా ఇష్టం లేదు. ఇంటర్‌ కాగానే హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదివి స్టార్‌ హోటల్లో చెఫ్‌ కావాలన్నది నా కల. అప్పటికే చక్కగా వంటలు చేసేవాణ్ణి కూడా. ఆ కల సినిమాలతో నాశనమవుతుందన్న విషయం బాగా తెలుసు నాకు. అందుకే ఆ రోజు 'నా లైఫ్‌ స్పాయిల్‌ చేయొద్దు నాన్నా.. ప్లీజ్‌!' అని గింజుకున్నాను. అప్పటికప్పుడు అమ్మకీ, అక్కయ్యలకీ ఫోన్‌ చేసి రప్పించి నా గోడు వెళ్ల బోసుకున్నాను. వాళ్లూ నాకే మద్దతిచ్చారు. నాన్న విన్లేదు. 'అర్థం చేసుకోండి. ఈ సెలవురోజుల్లో మాత్రమే షూటింగ్‌.. తర్వాత వాడు చదువుకోవచ్చు!' అని నచ్చచెప్పాడు. చివరికి అమ్మ కూడా చెప్పింది. దీంతో ఏడుపు మొహంతోనే నటించాను. కానీ నేను భయపడినంతా అయ్యింది. డబ్బుల్లేక ఆ సినిమా షూటింగ్‌ నట్టుతూ నట్టుతూ పూర్తవడానికి రెండేళ్లు పట్టింది. దాంతో ఇంటర్‌ సెకండియర్‌కి హాజరుకాలేక పోయాను. పైగా సినిమా కూడా నాన్న ఆశించినట్టు రాలేదు. దాంతో ఎలాగూ హిట్టు కాదన్న అపనమ్మకంతోనే రిలీజు చేశాం.

మొదటి రోజు నుంచే చక్కటి కలెక్షన్స్‌ నమోదుచేయడం మొదలుపెట్టింది. అలా వంద రోజులు ఆడింది. సినిమాలో అన్నీ బావున్నాయన్న పత్రికలు నన్నూ, నా మొహాన్నీ, నటననీ మాత్రం ఏకిపారేశాయి. 'ఎంత ధైర్యం ఉంటే వీడు హీరో అవుతాడు..' అని రాశాయి. అప్పుడు నాకు 17 ఏళ్లు. మన అందచందాల్ని తోటివారు హేళన చేసినా తట్టుకోలేని వయసు. అలాంటిది ఊరు ఊరంతా ఏకమై ఎగతాళి చేస్తుంటే ఎలా ఉంటుంది! ఆ బాధ నుంచి తేరుకోలేకపోయాను. అప్పట్లో మా అన్నయ్య శ్రీరాఘవ ఓ సినిమాకి కథ సిద్ధం చేసుకున్నాడు. అది గ్లామర్‌లేని నెగెటివ్‌ రోల్‌. దీంతో ఏ హీరో కూడా ముందుకు రాలేదు. ఆయనకి అది డ్రీమ్‌ ప్రాజెక్టు. చివరికి నన్ను బతిమిలాడాడు. దీంతో కాదనలేక సరే అన్నాను. కాదల్‌ కొండేన్‌(తెలుగులో అల్లరి నరేష్‌ 'నేను') అన్న ఆ సినిమా షూటింగప్పుడే విశాఖలో నాకు ఆ అవమానం ఎదురైంది. కానీ అదే నటుడిగా తొలిసారి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం నేను వరసగా సినిమాలు చేయక తప్పలేదు. ఎన్ని చేస్తున్నా నానాటికీ నటుడిగా నాలో ఆత్మన్యూనత పెరుగుతూనే ఉండేది. నా ముక్కూ మొహం బావుండవనీ, రంగు తక్కువనీ, సన్నగా రివటలా ఉంటాననీ ఇలా! కానీ అదంతా నటుడిగానే. వ్యక్తిగా నన్ను గాల్లో తేలినట్టు చేసిన సంఘటన ఒకటి అప్పుడే జరిగింది.

ఇదీ చదవండి:నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా!

'కీప్‌ ఇన్‌ టచ్‌'

నా రెండోసినిమా చూసిన సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌గారి పెద్దమ్మాయి ఐశ్వర్య నాకో బొకే పంపింది. అందులో 'గొప్పగా నటించారు.. కంగ్రాట్స్‌. కీప్‌ ఇన్‌ టచ్‌!' అని ఉంది. ఆ తర్వాత ఎప్పుడో కాఫీ షాపులో కలిసి మాట్లాడాం. అదెలా బయటకి పొక్కిందో తెలియదుకానీ పత్రికలన్నీ మేం ప్రేమలో పడ్డట్టే రాసేశాయి. 'నా వల్ల సూపర్‌స్టార్ ‌గారి కూతురు కెంత చెడ్డపేరు' అని బాగా బాధపడిపోయాను. ఈలోపు పెద్దవాళ్లు 'వాళ్లిద్దరికీ పెళ్లి చేసేస్తే తప్పేంటీ!' అనుకున్నారు. పెళ్లి మాటలు జరిగాక కూడా నేనూ ఐశ్వర్యా మాట్లాడుకుంది రెండుమూడు సార్లే. కానీ తను దగ్గరగా ఉన్నప్పుడు నాలోని లోటేదో భర్తీ అవుతున్నట్టూ.. నేను పరిపూర్ణంగా మారినట్టూ అనిపించేది. తను పెళ్లికి ఒప్పుకుందన్న విషయం విని నిజంగా నమ్మలేకపోయాను! అలా తొలిసారి చూసిన ఆరు నెలల్లోనే మేం దంపతులమయ్యాం.

ఆ పెళ్లి తర్వాతే ప్రఖ్యాత దర్శకుడు బాలుమహేంద్ర నాతో ఓ సినిమా మొదలుపెట్టారు. నటుడిగా నాలోని న్యూనతని పటాపంచలు చేసింది ఆయనే. ఓ రోజు నా ముఖానికి దగ్గరగా కెమెరాపెట్టి ఏకంగా పది నిమిషాల పాటు లాంగ్‌ క్లోజప్‌ షాట్‌ తీస్తూ నటించమన్నాడు. అలాగే చేశాను. అది పూర్తయ్యాక 'పది నిమిషాల పాటు క్లోజప్‌ షాట్‌లో నటించడమంటే పెద్ద నటులకీ సాధ్యం కాదు. అది నువ్వు చేయగలిగావంటే నీ సత్తా ఏపాటిదో అర్థం చేసుకో!' అన్నాడు. ఆ సంఘటన నన్ను పూర్తిగా మార్చేసింది. అప్పటి నుంచి నటనే నా జీవితం అని నిర్ణయించుకున్నాను. చిన్న పాత్రయినా సరే దానికోసం రాత్రింబవళ్లు హోమ్ ‌వర్క్‌ చేయడం మొదలుపెట్టాను. ఆ పాత్రగానే మారడం నేర్చుకున్నాను. ఆ శ్రమే నాకు కొత్త ద్వారాలని తెరిచింది!

ఇదీ చదవండి:'వకీల్​సాబ్'​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు లైన్​ క్లియర్​

బాలీవుడ్డూ.. హాలీవుడ్డూ!

2011లో వచ్చిన 'పందెం కోళ్లు' సినిమాకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని.. అతిచిన్న వయసులో(29 ఏళ్లు) దాన్ని సాధించినవాడిగా రికార్డు సృష్టించాను. నా ప్రొడక్షన్‌లో మా ఆవిడ '3' సినిమా తీస్తే దాని కోసం సరదాగా పాడి, రాసిన 'వై దిస్‌ కొలవెరి డీ' దేశం మొత్తం పాపులరైపోయింది. దాంతో హిందీ సినిమా 'రాంఝణ' అవకాశం వచ్చింది. ఆ సినిమా దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చింది. తెలుగులో అదివరకు నా సినిమాలెన్నో డబ్‌ అయి వచ్చినా పెద్ద హిట్‌ అంటే మాత్రం 'రఘు వరన్‌ బీటెక్‌' అనే చెప్పాలి. అప్పటి నుంచి ప్రతి సినిమా ఇక్కడ ద్విభాషా చిత్రంగానే చేస్తున్నాను.

ఆ వరసలో మరో వారం పదిరోజుల్లో 'జగమే తంత్రం' వస్తుంది. హాలీవుడ్‌లోనూ 'గ్రే మ్యాన్‌' అనే సినిమాలో నటిస్తున్నాను. ఈ నేపథ్యంలోనే నాకు మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు తెచ్చిన దర్శకుడు వెట్రిమారన్‌ 'అసురన్‌' సినిమాతో వచ్చాడు. స్టార్‌డమ్‌ పక్కనపెట్టి ఓ ముసలి దళిత వ్యక్తిగా నటించాల్సిన పాత్ర అది! ఆరు నెలల పాటు ఆ సినిమా చేశాక ఆ తీవ్ర ఉద్వేగాల నుంచి బయటపడటానికి మరో ఆరునెలలు పట్టింది నాకు. ఆ తాదాత్మ్యతకి ఫలితమే ఈ తాజా అవార్డు అనుకుంటున్నాను.

ఇదీ చదవండి:'వకీల్​సాబ్'​ భామకు కరోనా పాజిటివ్​

సూపర్‌ స్టార్‌కో నీరాజనం!

మామ రజనీతో ధనుష్

మా ఇంట్లో నేనే కాదు.. మా నాన్న కూడా సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌కి వీరాభిమానే. మా కుటుంబాలన్నీ విషయం ఏదైనా సరే సూపర్‌స్టార్‌ నిర్ణయాన్ని శిరసా వహిస్తాయి. చిన్నవాళ్లతోనూ వినమ్రంగా మాట్లాడే ఆయన నిరాడంబరత అందరికీ సాధ్యమయ్యేది కాదు! ఆ చంద్రుడికో నూలుపోగులా ఉండాలనే నా నిర్మాణ సారథ్యంలో 'కాలా' సినిమా తీశాను. ఓ రకంగా రజినీగారు నా ఆధ్యాత్మిక గురువు కూడా. ఆయన మార్గంలోనే నేనూ అటువైపు అడుగులు వేస్తున్నాను. ఆ ప్రభావంతోనే పెద్దవాడికి లింగా, చిన్నవాడికి యాత్రా అని పేర్లు పెట్టాము!

ఇదీ చదవండి:బాలీవుడ్​ నటుడు అక్షయ్ కుమార్​​కు కరోనా

ABOUT THE AUTHOR

...view details