"కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్" అని చెప్పిన ఓ ఆరడుగుల అందగాడు.. డార్లింగ్‌గా ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. భళిరా భళీ అంటూ 'బాహుబలి' సిరీస్‌తో బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డుల్ని లిఖించాడు. దక్షిణాది చిత్రరంగం గ్రాఫ్ పెంచడంలో తనదైన పాత్ర పోషించాడు. ప్రస్తుతం బహుభాషా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. తన నటనతో విదేశాల్లోనూ గుర్తింపు తెచుకున్నాడు. అతడే ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు.
డార్లింగ్ పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ రెబల్‌స్టార్. ముచ్చటగా మూడక్షరాలతో ప్రభాస్ అని పిలిస్తే పలికే ఆయన... నేడు 41వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు.
1979 అక్టోబరు 23న సూర్య నారాయణరాజు, శివకుమారి దంపతులకు జన్మించాడు ప్రభాస్. సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. ప్రముఖ కథానాయకుడు కృష్ణంరాజు ప్రభాస్‌కు పెదనాన్న. ఇంట్లో సినిమా వాతావరణం ఉన్నప్పటికీ సినిమాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదట ప్రభాస్. స్వతహాగా సిగ్గరి అయిన ఆయన... వెండితెరపై అడుగుపెట్టి 19 సినిమాల్లో నటించాడు.
ఈశ్వర్‌తో తొలిపరిచయం
2002లో జయంత్ సీ పరాంజీ దర్శకత్వంలో వచ్చిన 'ఈశ్వర్' సినిమాతో తెరంగేట్రం చేశాడు ప్రభాస్. జోడీగా అందాల తార మంజుల కూతురు శ్రీదేవి నటించింది. 2003లో 'రాఘవేంద్ర', 2004లో 'వర్షం', 'అడవిరాముడు' చిత్రాల్లో ప్రేమికుడిగా మంచిముద్ర వేశాడు. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చక్రం' సినిమా ప్రభాస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
ఛత్రపతితో స్టార్ ఇమేజ్
2005లో వచ్చిన 'ఛత్రపతి' ప్రభాస్‌కు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2006లో ప్రభుదేవా దర్శకత్వంలో 'పౌర్ణమి' చిత్రంలో వైవిద్యభరితమైన పాత్ర పోషించాడు. ఇది ఆశించిన స్థాయిలో రాణించక పోయినా ప్రభాస్‌కు మాత్రం హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2007లో 'యోగి', 'మున్నా', 2008లో 'బుజ్జిగాడు', 2009లో 'బిల్లా', 'ఏక్ నిరంజన్' చిత్రాలు ప్రభాస్ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాయి. 'బిల్లా' చిత్రంలో తన పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజుతో వెండితెర పంచుకున్నాడు.
'డార్లింగ్'తో అందరి మన్ననలు..