తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అవకాశం వీరి వశం.. టాలీవుడ్​లో హవా వీళ్లదే! - సాయి పల్లవి కొత్త చిత్రాలు

టాలీవుడ్​లో పలువురు ముద్దుగుమ్మలు ప్రస్తుతం హవా కొనసాగిస్తున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు తొలి ఎంపికగా కనిపిస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరంటే?

అవకాశం వీరి వశం.. టాలీవుడ్​లో హవా వీళ్లదే!
తెలుగు సినిమా హీరోయిన్లు

By

Published : Sep 14, 2020, 7:15 AM IST

ఒప్పుకోవచ్చు.. ఒప్పుకోకపోవచ్చు అవకాశం మాత్రం తొలిసారి వీళ్ల తలుపే తడుతోంది. ఓ మంచి కాంబినేషన్​లో సినిమా తీయాలనుకున్న దర్శకనిర్మాతలు మొదట వీళ్లలో ఎవరి కాల్షీట్లు ఖాళీగా ఉన్నాయా? అనే ఆరా తీస్తుంటారు. చిత్రసీమలో ఒకొక్క దశలో కొంతమంది కథానాయికల హవా సాగుతోంది. అలా ఇప్పుడు వీళ్ల హవా నడుస్తోంది. ఎవరు ఏ సినిమాలో కనిపిస్తారో తెలియదు కానీ... పలు చిత్రాల విషయంలో వీళ్ల పేర్లు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి.

అనుష్క, కాజల్‌, తమన్నా, సమంత, శ్రుతిహాసన్‌... కొన్నాళ్ల క్రితం వరకు అగ్ర హీరోల సినిమాలనగానే వీళ్లే ఎక్కువగా కనిపించేవాళ్లు. ఇటీవల కాలంలో పూజాహెగ్డే, రష్మిక, కీర్తి సురేశ్ తదితర కుర్ర భామలు జోరు చూపించడం మొదలుపెట్టారు. సీనియర్‌ భామలు తమ అనుభవానికి తగ్గట్టుగా కథల్ని ఎంపిక చేసుకోవడం మొదలు పెట్టారు. దాంతో కుర్రభామలు కమర్షియల్‌ కథానాయికల స్థానాన్ని భర్తీ చేసే బాధ్యతను తీసుకున్నారు. ఇప్పుడు యువతరం హీరోయిన్లు నటించే సినిమాల కోసం ఎక్కువగా వీళ్లనే సంప్రదిస్తున్నారు.

  1. పొడుగు కాళ్ల సుందరి పూజాహెగ్డే ఇప్పటికే ప్రభాస్‌తో కలిసి 'రాధేశ్యామ్‌'లో, అఖిల్‌ అక్కినేనితో కలిసి 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'లో నటిస్తోంది. హిందీలోనూ ఈమెకు మంచి డిమాండ్‌ ఉంది. అయినా సరే... తెలుగులో పలు సినిమాలు ఈమె చుట్టూనే తిరుగుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌ - హరీశ్ శంకర్‌ కలయికలో రూపొందనున్న సినిమాలోనూ పూజానే నటించొచ్చని సమాచారం. రవితేజ- రమేశ్ వర్మ కలయికలో రూపొందనున్న చిత్రానికీ కథా నాయికగా ఈమెనే తొలి ఎంపిక అని సమాచారం. మరి ఈమె ఎప్పుడు ఏ సినిమాకు పచ్చజెండా ఊపుతుందనేది చూడాలి.
  2. ఈ మధ్య కుర్రాళ్ల హృదయాల్ని కొల్లగొట్టిన మరో భామ రష్మిక. అవకాశాల విషయంలో ఈమె తన జోరు చూపుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప'లో నటించేందుకు అంగీకారం తెలిపింది. 'ఆచార్య'లోనూ చరణ్‌తో కలిసి సందడి చేయనున్నట్టు సమాచారం. దీంతోపాటు అఖిల్‌ అక్కినేని - సురేందర్‌రెడ్డి కలయికలో సినిమా అవకాశమూ ఈమె దగ్గరికే వెళ్లినట్టు సమాచారం.
  3. కీర్తి సురేశ్ 'మహానటి' తర్వాత కథానాయిక ప్రాధాన్యమున్న కథలతో బిజీ అయిపోయింది. అనుకోకుండానే ఆమె దగ్గరికి ఆ కథలు వచ్చాయి. 'పెంగ్విన్‌', 'మిస్‌ ఇండియా', 'గుడ్‌లక్‌ సఖి'... ఇలా వరుసగా ఆ చిత్రాలే చేసింది. నితిన్‌తో కలిసి 'రంగ్‌దే'లో నటిస్తోంది. తదుపరి మహేశ్ బాబుతో 'సర్కారు వారి పాట'లో ఆడిపాడనుంది. నితిన్‌తో కలిసి 'పవర్‌పేట'లోనూ కన్పించనున్నట్లు సమాచారం. దీంతోపాటు ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' విషయంలో కూడా కీర్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోపక్క తమిళంలోనూ బిజీగానే ఉంది.
  4. సమంత ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యంతో కూడిన కథలపైనే దృష్టిపెట్టింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతోంది. గాయని బెంగళూరు నాగరత్నమ్మ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రమిది. దీంతోపాటు నాగచైతన్య 'థ్యాంక్యూ', ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కలయికలో సినిమాల విషయంలోనూ సమంత పేరు వినిపిస్తోంది.
  5. సాయిపల్లవి అవకాశాల విషయంలో జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఆమె 'లవ్‌స్టోరి', 'విరాటపర్వం' చిత్రాల్లో నటిస్తోంది. వీటి తర్వాత నానితో కలిసి 'శ్యామ్‌ సింగరాయ్‌' కోసం రంగంలోకి దిగబోతోంది. చిరంజీవి హీరోగా తీయనున్న 'వేదాలం' రీమేక్‌లోనూ కీలక పాత్ర కోసం ఈమెను సంప్రదించినట్టు సమాచారం.
  6. రవితేజతో 'క్రాక్‌' సినిమాలో నటిస్తూ తెలుగులో మళ్లీ సందడి చేయడం మొదలుపెట్టింది శ్రుతిహాసన్‌. పవన్‌కల్యాణ్‌తో కలిసి 'వకీల్‌సాబ్‌'లోనూ నటించనుంది.

కథానాయకులకు ఓ దర్శకుడు చెప్పిన కథ నచ్చితే చాలు... ఆ కలయికలో సినిమా ఖాయమైనట్టే. కథా నాయికల విషయంలో అలా ఒక అంచనాకు రాలేని పరిస్థితి. ఆయా సినిమాలు ప్రారంభమయ్యే సమయం, వాళ్ల కాల్షీట్ల బట్టి చాలా చిత్రాలకు కథానాయిక ఎంపిక ఖరారవుతుంటుంది.

ABOUT THE AUTHOR

...view details