అతి చిన్నవయస్సులో చదువు కొనసాగించలేక నాటకాడాల్సి వచ్చింది. ఆడవేషాలే ఎక్కువ. అప్పటికి తెలుగు సినిమా పురుడు పోసుకొని పదేళ్లు కావస్తోంది. చిత్తూరు నాగయ్య, సి.హెచ్.నారాయణరావులు కథానాయకులుగా సినిమా రంగాన్ని ఏలుతున్న రోజులలో అక్కినేని చిత్రరంగ ప్రవేశం జరిగింది. బక్కపలుచని శరీరం, పీలగొంతుక, కేవలం నాలుగవ తరగతి వరకూ చదివిన వానాకాలం చదువు అక్కినేని తన స్థాయి ఏమిటో తను తెలుసుకొనేటట్లు చేశాయి. ఎవరి పాటలు వారే పాడుకొనే పరిస్థితి. 'నేపథ్యగానం' ఇంకా నెలకొనలేదు. గాత్రశుద్ధి కోసం 'చన్నీటికుండ'తో సాధన చేశారు. ఆ నాటి దిగ్గజాల మధ్య మసలుతూ ఎన్నో నేర్చుకొన్నారు. నటుడిగా, వ్యక్తిగా తను 'ఆటగాడి'ని మాత్రమేనని పాటగాడిని కాదని గ్రహించారు. చిత్ర రంగానికి రాకముందే పరిచయమున్న ఘంటసాలను తనకు నేపథ్యగాయకుడిగా ఎన్నుకొన్నారు అక్కినేని. కీలుగుర్రమెక్కి 'బాలరాజు'లా పల్నాటి బాలచంద్రుడిలా విజృంభించారు. 'ఓ లైలా కోసం మజ్ను' అయ్యారు. జానపద హీరోగానే కాకుండా విషాదాంతక పాత్రలకూ పనికొస్తాడనిపించుకొన్నారు. ఆ తరుణంలో ఎన్టీఆర్ ప్రవేశం జరిగింది. అందాల రాజకుమారుడిగా, చిలిపి కృష్ణుడిగా ఏ పాత్రకైనా సరిపడే 'ఆహార్యం' గల నందమూరి, అక్కినేనిని మరలా ఆలోచనలో పడేశారు. ఆ పాత్రలకు తాను తగనని గ్రహించారు అక్కినేని. ఫలితం సుమారు పది సంవత్సరాలు జానపద కథానాయకుడిగా వెలిగాక తొలిసారిగా సాంఘికం 'సంసారం'లో నటించారు. అలా ఎప్పటికప్పుడు ఆత్మశోధన చేసుకొంటూ విజయాల నుంచి, పరాజయాల నుంచి ఎంతో నేర్చుకున్నారు. ప్రలోభాలకు వ్యసనాలకులోనై బంగారు భవిష్యత్తును బుగ్గి చేసుకొన్న ఎందరో నటీనటుల జీవితాలను పరికిస్తూ, తననితాను తీర్చిదిద్దుకొన్నారు. ఎన్నో వైవిధ్యభరిత పాత్రలను పోషించి చలనచిత్ర రంగపు అత్యుత్తమ అవార్డు 'పద్మభూషణ్'ను పొందారు. సుదీర్ఘ సినీ నటజీవితాన్ని తాను కోరుకున్నట్లుగా నటిస్తూనే ముగించటం కోసం ఆఖరి చిత్రం 'మనం'కు డబ్బింగ్ డెత్‌బెడ్ మీద నుంచే చెప్పి పైలోకాలకు భౌతికంగా, అభిమానుల గుండెల్లోకి శాశ్వతంగా తరిలిపోయిన అక్కినేని ఓ పరిపూర్ణ నటుడు, వ్యక్తి, ఎ లెజెండ్. ఆయనలోని, ఆయనకే సాధ్యమైన కొన్ని ప్రత్యేకతలను చూద్దాం. ఈరోజు ఏయన్నార్ (జనవరి 22న,) వర్ధంతి. ఈ సందర్భంగా అక్కినేని గురించి...
సమతౌల్యం (బ్యాలెన్స్):
తొలి నుంచి తుది వరకు సహజ నటుడు. నటనలో డ్రామా ఉండదు. ఓవర్ యాక్టింగ్ చాలా తక్కువ. పాత్రను బాగా అర్థం చేసుకొని ‘‘అండర్‌ప్లే’’ చేస్తారు. దానితో సహజత్వం వచ్చేస్తుంది.
వాచకం:
సుస్పష్టమైన వాచకం. ఎటువవంటి సన్నివేశంలోనైనా ఎంతటి ఉద్వేగాన్ని చూపించాల్సి వచ్చినా, త్రాగుబోతుగా తడబడినా ‘సృష్టత’ పోదు.
లిప్ మూవ్‌మెంట్:
గాత్ర శుద్ధి కోసం సాధన చేసిన వాడవటం, తొలినాళ్లలో తానే పాడుకోవలసి రావడంతో పాటమీద పట్టుబాగా వుంది. నేపథ్యంలోని ఘంటసాలకు ధీటుగా సరిగ్గా లిప్‌మూవ్‌మెంట్ ఇస్తారు. ఏ వెరీ పర్‌ఫెక్ట్ సింక్రనైజేషన్. 'జయభేరి' చిత్రంలోని 'మది శారదాదేవి మందిరమే', 'రసికరాజ తగువారము కామా' పాటలలో ఆయన పెదాల కదలికలను గమనించండి. ప్రక్కనున్న వాయిద్యకారులకు అనుగుణంగా తల ఊపుతూ పాడిన తీరు అద్బుతం. అందుకే ఘంటసాల అక్కినేని కాంబినేషన్ ఓ అపూర్వమైనదిగా నిలిచిపోయింది.
ఎన్నిక:
కుటుంబ కథాచిత్రాలకు పెట్టింది పేరు. కథాబలం ఉంటేనే చిత్రాన్ని ఒప్పుకునేవారు. ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలే చేసేవారు. తొలి నవలాకథానాయకుడు ఆయనే. తెలుగులోనే కాకుండా బెంగాళీ సాహిత్యం ఆధారంగా ఆయనే నాయకుడిగా ఎన్నో సినిమాలు వచ్చాయి. పాత్రల, కథా చర్చలలో పాల్గొనేవారు.
విజయ శాతం:
ఆచితూచి చిత్రాలను ఎన్నుకోవడంతో పరాజయాలు చాలా తక్కువ. తెలుగు తమిళ, హిందీ సనిమాలు ఆయనవి సుమారుగా 256 ఉంటాయి. వాటిలో పరాజయం పొందినవి చాలా తక్కువ. మొత్తం సంఖ్య, విజయం సాధించిన వాటి సంఖ్య నిష్పత్తి తీస్తే ఆయన చిత్రాల విజయశాతం మిగిలిన నటుల చిత్రాల కన్నా చాలా ఎక్కువ.