ఆ జీవితం.. అలుపు లేని గెలుపు పాఠం. మలుపు, మలుపునా ఉత్కంఠ భరితం. ఉత్థాన, పతనాల జీవన క్రమం. 'ఫినిక్స్'ను తలపించే కథనం. ఆయనది.. వెండితెరపై యాంగ్రీ యంగ్‌మేన్ తత్వం. సంఘర్షణ కీలల అగ్నిపథం. వ్యక్తి... శక్తిగా ఎదిగిన జయకేతనం. అతడు ..భారతీయ సినిమా ఉషస్సు. వెండితెరకు ఐదు దశాబ్దాల యశస్సు. హీరోయిజానికి కొత్త నిర్వచనం. నటనకు నవ్యభాష్యం. సాహసాలనే శ్వాసించి.. సవాళ్లనే స్వాగతించి.. శిశిరాలు తరిమి.. శిఖరంగా ఎదిగి.. విధిని జయించి.. విజయాలను లయించిన 'ముఖద్దర్ కా సికిందర్'. భారతీయ సినిమా బాద్‌షా, బాలీవుడ్ షెహన్ షా, బిగ్ బీ, అమితాబ్ బచ్చన్.
పవిత్ర త్రివేణి సంగమ తీరం. బ్రిటిష్ ఇండియా.. యునైటెడ్ ప్రావిన్స్‌లోని అలహాబాద్ నగరం. అక్కడ అక్షర తపస్వి, ఆచార్య హరివంశరాయ్ బచ్చన్, తేజీ బచ్చన్‌ల పెద్ద కుమారుడు ఇంక్విలాబ్ రాయ్ శ్రీవాత్సవ. క్విట్ ఇండియా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న 1942లో జన్మించటం వల్ల ఆ పేరు పెట్టారు. అతడే తర్వాత కాలంలో అమితాబ్ బచ్చన్‌గా జగద్విఖ్యాతిని పొందాడు. అమితాబ్ విద్యాభ్యాసం అలహాబాద్, నైనిటాల్, దిల్లీలలో సాగింది. దిల్లీ యూనివర్శిటీ కాలేజీలో డబుల్ ఎంఏ అయ్యింది. నైనిటాల్లో ఉన్నప్పుడు తరచూ నాటకాలలో వేషాలు వేయటం వల్ల.. అభినయంపై అభిరుచి పెరిగింది. సినిమాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి ఏర్పడింది.
తండ్రి మాట మన్నించి.. అమ్మ ప్రోత్సాహంతో
అమితాబ్.. తండ్రి మాట మన్నించారు. కొంతకాలం కోల్‌కతాలో ఉద్యోగం చేశారు. 1968లో మాతృమూర్తి తేజీ బచ్చన్ ప్రోత్సాహంతో.. ముంబయి హిందీ చిత్రసీమకు వెళ్లారు. అక్కడ దర్శకుల వాలకం చూస్తే సినిమా ఛాన్సులు రావేమో అనే సందేహం కలిగింది. ఆశనిరాశల మధ్య అమితాబ్ ఊగిసలాట. ఎట్టకేలకు ప్రఖ్యాత దర్శక, నిర్మాత కేఏ అబ్బాస్ ఓ ఛాన్సిచ్చారు. గోవా విముక్తి పోరాట కథాంశంతో తీస్తున్న 'సాథ్ హిందుస్థానీ' సినిమాలో ఓ యోధుడి వేషమిచ్చారు. నవ్యచిత్రాల దర్శకుడు మృణాల్ సేన్ అమితాబ్ కంఠస్వరం బాగుందని ప్రశంసించి తన సినిమా 'భువన్ షోమ్'లో వ్యాఖ్యాతగా అవకాశమిచ్చారు.
అలా అవకాశం
నాటి సూపర్ స్టార్లు రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర హిందీ చిత్రసీమను ఏలుతున్నారు. మరోవైపు షమ్మీకపూర్ జోరు మీదున్నారు. శశికపూర్, శతృఘ్న సిన్హాలు అవకాశాలు దక్కించుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి. నటనలో ఎన్నో ప్రత్యేకతలుంటే తప్ప అవకాశాలు రావనిపించింది. సరిగ్గా అలాంటి సమయంలో ..1971లో రాజేశ్ ఖన్నా నటిస్తున్న 'ఆనంద్' లో డాక్టరుగా ఓ వేషమిచ్చారు. వరుసగా డజను సినిమాలలో ఎలాంటి గుర్తింపు లేని అలాంటి పాత్రలే అమితాబ్‌ను పరీక్షించాయి. 1973 వ సంవత్సరం అమితాబ్ జీవన రేఖ మారింది. సినిమా గ్రాఫ్ కూడా పెరిగింది. అభిమాన్ అనే సినిమాలో అమితాబ్, జయబాధురి కలసి నటించారు. మనసులూ కలిశాయి. జయబాధురి కొద్దికాలానికే అమితాబ్ బచ్చన్ జీవన మాధురి అయ్యారు.
మలుపు ఇక్కడే
1973 ఆయన సినీజీవితంలో ఓ మేలుమలుపుగా నిలిచింది. సినీ కథారచయితల ద్వయం సలీమ్-జావెద్ 'జంజీర్' పేరుతో ఒక అద్భుత కథ తయారు చేశారు. మంచి అవకాశమొస్తే నిరూపించుకోవాలని కసితో ఉన్న అమితాబ్ జంజీర్ లో చెలరేగారు. ఇందులో అమితాబ్ నటనకు ప్రేక్షక లోకం ఫిదా అయ్యింది. హిందీ చిత్రసీమ జీ హుజూర్ అంది. అమితాబ్ పలికిన 'జబ్ తక్ బైఠ్ నే కో న కహా జాయే షరఫత్ సే ఖాదే రహో'..'యే పొలీస్ స్టేషన్ హై.. 'తుమ్హారే బాప్ కా ఘర్ నహీ' బాగా ప్రాచుర్యం పొందింది. అమితాబ్ బచ్చన్‌కు రైజింగ్ స్టార్‌గా ఒక స్టార్‌డమ్ వచ్చింది. ఆ రోజుల్లో నిర్మాత మన్మోహన్ దేశాయి.. మసాలా చిత్రాలకు ఓ బ్రాండ్ అంబాసిడర్. పాతాళ ప్రపంచంలో ఉండి పాతకాలు, ఘాతుకాలకు తెగించే గ్యాంగ్ స్టర్లు, మాఫియా కథాంశాలతో సినిమాలు తీశారు. 1975 జనవరిలో ఆయన అలా నిర్మించిన సినిమా 'దీవార్'. అమితాబ్ విజయాలకు గ్రేట్ వాల్ లాంటిది 'దీవార్' చిత్రం. స్మగ్లర్ హాజీమస్తాన్ జీవిత కథాంశం ఆధారంగా తెరకెక్కంచిన సినిమా.
షోలే ఓ సంచలనం
1975లో సంచలన సినిమా 'షోలే'. భారతీయ సినీ చరిత్రలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. జయదేవ్ పాత్రలో అమితాబ్ జీవించారు. స్నేహితుడు వీరుగా ధర్మేంద్ర నటించారు. షోలే అంటే నివురు గప్పిన నిప్పు అని అర్ధం. దేశ చరిత్రలో బ్లాక్ బస్టర్ అనే పదానికి నిజమైన అర్ధం ఆవిష్కరించిన సినిమా షోలే. ముంబయి మినర్వాలో ఐదున్నర ఏళ్లు ఆడిన సినిమా. అంతులేని రికార్డులు షోలే సొంతం అయ్యాయి.
మరణం అంచులవరకు వెళ్లి
అమితాబ్ తన చలన చిత్ర విజయాలతో అమితోత్సాహంతో దూసుకెళుతున్న సమయంలో ఓ అనూహ్య సంఘటన దేశాన్ని నిర్ఘాంతపర్చింది. దేశమే తన గురించి కలవరపడే స్థాయికి అప్పటికే అమితాబ్ చేరుకున్నారు. 1982జూలై 26వ తేదీ. బెంగళూరులో 'కూలీ' సినిమా షూటింగ్ సందర్భంగా..బల్లమీద పడిపోవటం వల్ల అమితాబ్‌కు పొత్తికడుపులో తీవ్రగాయాలయ్యాయి. దేశం అంతా కోట్లాదిమంది అమితాబ్ కోలుకోవాలని మొక్కులు మొక్కారు. ముంబయి జస్లోక్ వైద్యుల కృషి, కోట్లాది అభిమానుల కోర్కెను భగవంతుడు మన్నించాడు. మృత్యుంజయుడయ్యారు. కోలుకొన్న అమితాబ్ 'కూలీ' సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ సమయంలో ఆయన వెండితెరకు కొన్నేళ్లు దూరమయ్యారు.
రాజకీయాల్లోనూ
1984లో రాజీవ్ గాంధీ పిలుపుతో రాజకీయాల్లోకి వెళ్లారు. అలహాబాద్ ఎంపీగా గెలిచారు. వెన్నంటిన బోఫోర్స్ ఆరోపణలు కలచివేశాయి. కోర్టులు నిర్దోషిగా ప్రకటించినా..రాజకీయాలు తనకు సరిపడవని భావించి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. తిరిగి సినీ రంగానికే వచ్చారు. తిరిగి 1990 అగ్నిపథ్ సినిమాతో అమితాబ్ తనలోని నటుణ్ణి మరోసారి ప్రేక్షకులకు చూపారు.
అనుకోని సంక్షోభం
1993లో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, గోవిందలతో కలసి ఓ మల్టీ స్టారర్ సినిమా 'హమ్' తీశారు. సూపర్ హిట్ అయ్యింది. 1996లో తన యావదాస్తినీ ధారపోసి అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపించారు. 1997లో నిర్మాతగా ఏబీసీఎల్ పతాకం కింద తొలియత్నంగా హిందీలో తేరే మేరే సప్నే నిర్మించారు. అంతగా ఆదరణ పొందలేదు. ప్రాంతీయ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మించినా కలసి రాలేదు. మిస్ వరల్డ్ ఈవెంట్ నిర్వహణ తలకెత్తుకుంటే పెనుభారమైంది. ఏబీసీఎల్ సంక్షోభంలో పడింది. కెరీర్ పతనమైంది. జీవితమంతా కష్టపడి సంపాదించినదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. వ్యాపారం పోయింది. కోట్లాది ప్రేక్షకులు అభిమానం, ఆరాధనలే పెట్టుబడిగా ఇటుక ఇటుకా పేర్చి తన సామ్రాజ్యాన్ని పునర్మించుకున్నారు. 1998లో గోవిందతో కలసి బడేమియా-ఛోటేమియా సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
సెకండ్ ఇన్నింగ్స్
అమితాబ్ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 2000లో మొహబ్బతే చిత్ర ఘన విజయం నూతన శతాబ్ది బచ్చన్‌కు శుభారంభం పలికింది. 2001లో 'కభీ కుషీ కభీ గమ్' సూపర్‌హిట్‌తో ఇంక అమితాబ్ పూర్వ వైభవం వచ్చేసింది. 'కభి కుషి కభీ గమ్' చిత్రాన్ని అభిమాన ప్రపంచం బహుత్ సుందర్ ఔర్ శాందార్ సినిమా’ అంటూ కీర్తించింది. ఇందులో 'షవ షవ షవ’అనే పాటలో అమితాబ్ బచ్చన్ డ్యాన్స్ అద్భుతంగా చేశారు.
అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్‌తో కలసి 'బంటీ ఔర్ బాబ్లి', 2006లో 'కభి అల్విద నా కెహనా' చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు ఘనవిజయం సాధించాయి. 2006లో ఏకలవ్య, 2007లో నిశ్శబ్ద చిత్రాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. మహిళా సమస్యలే కథాంశంగా రూపొందిన 'పింక్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2015 లో విడుదలైన పీకు.. కుటుంబాల్లో వృద్ధుల ప్రవర్తనకు దర్పణం పట్టింది. కోపధారిగా అమితాబ్ నటన పండించారు.. ఇక పీకు చిత్రంలో అమితాబ్ ఒక ప్రమోషన్ సాంగ్ పాడారు.
ట్రెండ్ సెట్టర్
అమితాబ్‌బచ్చన్ నిత్యనూతనుడు. ఆధునికులలో ఆధునికుడు. సంప్రదాయంలో సంప్రదాయవాది. కుర్తా.. పైజమా..షాలుతో శాందార్. మస్త్ కలందర్. కొత్త ఫ్యాషన్లు ఏమున్నాయో తెలుసుకోవాలంటే ఇవాళ ఈ డెబ్భయి తొమ్మిదేళ్ల కుర్రాడి వైపు చూడాలి. డెనిమ్ వేసి, ఫ్రెంచి గడ్డం. డార్క్ కూలింగ్ గ్లాసెస్‌లో స్సార్క్ లుక్. పైకి దువ్విన క్రాఫే.. రకరకాలుగా మారి ఫ్యాషన్ గ్రాఫ్ పెరిగింది.
బుల్లితెరపైనా..
2000 సంవత్సరం నుంచి అనేక సీజన్లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న..'కౌన్ బనేగా కరోడ్ పతి'తో అమితాబ్ వీక్షక ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. 'నమస్కార్ శాస్త్రీజీ! మై అమితాబ్ బచ్చన్ బోల్ రహా హూ..ఆప్ కే బేటా హమారా సాత్ హై..' అంటూ లైఫ్ లైన్ తీసుకునే సందర్భంలో మాట్లాడుతుంటే.. వీక్షకులకు కలయో..నిజమో అర్ధంకాక భావోద్వేగాలు పెల్లుబికాయి. ఒక చరిత్ర నడిమింటికి వచ్చి.. తమతో సంభాషిస్తుంటే ప్రేక్షకలోకం పరవశించింది. భావోద్వేగాలకు గురిచేసింది.
అమితాబ్ బచ్చన్ 200 సినిమాలలో నటించారు. ..24 సినిమాలలో పాటలు పాడారు. ఎనిమిది చిత్రాలు నిర్మించారు. వెండితెరకు వచ్చి ఐదున్నర దశాబ్దాలు కావస్తోంది. అయినా ఇప్పటికీ చేతినిండా సినిమాలు, బుల్లితెర వినోదాలు, రాష్ట్రాలకు సాంస్కృతిక రాయబారిగా, వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనలు. వాణిజ్య ప్రకటనలు. వాయిస్ ఇవ్వటం. బ్రాండ్ అంబాసిడర్ గా అనేక అవకాశాలు. డెబ్భయితొమ్మిది వసంతాలలోనూ తగ్గని స్టామినాతో అందరికీ ఆకట్టుకుంటున్నారు. నవతరానికి, యువతరానికి ఆదర్శంగా నిలిచారు.
బిగ్‌బీ బ్లాక్‌బస్టర్ సాంగ్స్
- 1976లో వచ్చిన 'కభీ కభీ' చిత్రంలో ముఖేష్ ఆలపించిన 'కభీకభీ' గీతం ఓ అద్భుతం. యవ్వన రుతురాగంలో ప్రతి హృదయాన్ని శృతి చేసేది రెండక్షరాల ప్రేమ. అలసిన ఆలోచనా సమయాన ముఖాన్ని చల్లగా తాకే మధుర తుషారం.. పాటల తోటలోకి నడిపించే హుషారు గీతం. అమితాబచ్చన్ రాఖీలమీద చిత్రించిన గీతం రమణీయం.
- 1978లో 'ముకద్దర్ కా సికిందర్' మ్యూజికల్ హిట్. ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అనాథగా పెరిగిన కథానాయకుని పాత్రలో అమితాబ్ కదలించేలా నటించారు. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా రేతే హుయే పాట ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
- హిందీ చిత్రసీమలో మిస్టర్ నట్వర్ లాల్ సినిమాలో నాటి గ్లామర్ క్వీన్ రేఖతో అభినయించిన యుగళం పరదేశియా.. ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది.
- 1979లో విడుదలైన 'మంజిల్' సినిమా వాస్తవానికి బెంగాలీ సినిమా ఆకాశ్ కుసుమ్ చిత్రానికి ప్రేరణ. మంజిల్ చిత్రం ఆ రోజుల్లో పెద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంలోని 'రిమ్ జిమ్ గిరే సావన్' పాట ఇప్పటికీ బాలీవుడ్ ఆల్ టైం హిట్ పాటల్లో ఒకటి అని చెప్పుకుంటారు.
- 1980లో రమేశ్ సిప్పీ దర్శకత్వంలో వచ్చిన 'షాన్'లో యమ్మా యమ్మా పాట ఓ హుషారుగీతం.