మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన కన్నడ సినీ తారలు సంజన, రాగిణిలకు బెంగళూరు ప్రత్యేక కోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరు తారలు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. దీంతో వీరిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండనున్నారు.
నిషేధిత మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా కేసులో రాగిణి ద్వివేది, సంజన గల్రానీలపై బెంగళూరు సీసీబీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ఇప్పటికే విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు హై ప్రొఫైల్ పార్టీ ప్లానర్ వీరెన్ ఖన్నాతో పాటు పలువురిని అరెస్టు చేశారు.
మనీలాండరింగ్ ఆరోపణలపై ఈ ఇద్దరు తారలను ఈడీ విచారిస్తోంది. మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గురువారం ఈడీ దర్యాప్తుకు అనుమతిచ్చింది. దీంతో వీరిని విచారిస్తున్న ఈడీ అధికారులు.. ఇప్పటికే అరెస్టయిన వీరెన్ ఖన్నా, సంజనా స్నేహితుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాహుల్ టాన్సే, రాగిణి స్నేహితుడు బీకే రవిశంకర్‌లను కూడా విచారించే అవకాశం ఉంది.
డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేదికి సెప్టెంబర్ 3న సమన్లు పంపిన సీసీబీ అధికారులు.. మరుసటి రోజే ఆమె ఇంట్లో సోదాలు జరిపారు. విచారణకు సహకరించడంలేదని పేర్కొంటూ అదే రోజు అరెస్టు చేశారు. అలాగే, ఈ నెల 8న సంజన ఇంట్లో సోదాలు జరిపి ఆమెను కూడా అరెస్టు చేశారు. పోలీస్ కస్టడీ ముగిసిన అనంతరం వీరిద్దరినీ జ్యుడిషియల్ కస్టడీకి తరలించి విచారిస్తున్నారు.