సినిమాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేనెప్పుడూ చదవను. ముందు చదవడాన్ని ఆనందిస్తాను, ఆస్వాదిస్తాను. అయితే మనం చదివింది, విన్నది, మాట్లాడింది ఎక్కడో ఒక చోట ఉపయోగ పడుతుంది అని అంటున్నారు దర్శకుడు త్రివిక్రమ్. రచయితగా ప్రయాణం ప్రారంభించిన ఆయన తెలుగు సినిమా మాటల్ని కొత్త పుంతలు తొక్కించారు. మాటకి ఇంత శక్తి ఉందని మరోమారు మాట్లాడుకునేలా చేశారు. దర్శకుడిగా మారాక మాటలతోనే కాకుండా, కథలతోనూ ఆయన కలం మెరుపులు మెరిపిస్తోంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల.. వైకుంఠపురములో చిత్రం ఈ నెల 12న వస్తోంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. త్రివిక్రమ్ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ.
ఈమధ్య మీ సినిమాల పేర్లన్నీ 'అ' అక్షరంతోనే మొదలవుతున్నాయి...
నాకూ కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. కానీ ఈ సెంటిమెంట్ అయితే లేదు. ఇదివరకు వేరే అక్షరాలతో మొదలైన సినిమాలూ తీశాను కదా. ఈమధ్య 'అ' అక్షరంతో కుదురుతున్నాయంతే. పోతన రాసిన పద్యం స్ఫూర్తితో ‘అల.. వైకుంఠపురములో’ అని ఈ సినిమాకు పేరు పెట్టాం.
అత్తారింటికి దారేది నుంచి మీ సినిమా కథలు ఎక్కువగా ఇంటిచుట్టూ, కుటుంబం చుట్టూనే నడుస్తున్నాయి. కారణమేంటి?
మనం ప్రపంచమంతా తిరగొచ్చు కానీ, ఇంటికి వచ్చేసరికి సుఖంగా ఉంటుంది. అది రెండు గదుల ఇల్లే కావొచ్చు. కానీ దాంట్లో ఉండే ఆనందం వేరు. ఒక కథకుడిగా ఆ ఆనందాన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నానేమో. ఈ సినిమా చూశాక ఆ ఇంటికి, ఆ స్థానానికి ఉన్న విలువ తెలుస్తుంది. ఇందులో కథానాయకుడు డ్రామా కోసం ఇంటికి వెళ్లడు. అసలు అది తనకెందుకు ముఖ్యమైందనేది సినిమా చూశాకే తెలుస్తుంది. అందుకే ఆ ఇంటికి వైకుంఠపురం అని పేరు పెట్టి, ఆ పేరే సినిమాకి పెట్టాం.
ప్రేక్షకులకు ఈ సినిమా ఎలాంటి అనుభూతినిస్తుంది. దర్శకుడిగా మీరెలాంటి అనుభూతికి గురయ్యారు?
పరిపూర్ణమైన అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికొస్తారు. ఇక నా అనుభూతి అంటారా? చీర నేసిన వ్యక్తికి ఆ ప్రయాణంలో దాని అందం తెలియదు. దాన్ని ప్రతిసారీ దూరం నుంచి చూసుకుంటూ నేయడు. ఒక అనుభూతితో టకటకా నేసుకుంటూ వెళుతుంటాడు. ప్రస్తుతం నేనలాంటి అనుభూతిలోనే ఉన్నా.
అరవింద సమేతతో ఒక కొత్త రకమైన జోనర్‌లోకి వెళ్లారు. ఈ సినిమాతో మళ్లీ ఆ దారిని మార్చినట్టు కనిపిస్తోంది. కారణం?
ఎవరైనా ప్రయాణం మొదలు పెట్టేటప్పుడు వాళ్ల ఆలోచనల్ని అందరికీ చెప్పాలి, అది విని వాళ్లంతా మెచ్చుకోవాలి, ఆ ఆలోచనలతో అందరూ ఏకీభవించాలనుకుంటారు. కొన్నాళ్ల తర్వాత జనం కానీ, మీడియా కానీ వీళ్లెలాగూ బాగా చెబుతారు కదా అని మెచ్చుకోవడం తగ్గించేస్తారు. మెచ్చుకోవడం తగ్గడం మూలంగా అవతలివ్యక్తికి మన పనిలో ఏమైనా లోపం ఉందా అని అనుకుంటూ వేరే దారుల్లోకి వెళ్లి ఎందుకూ పనికిరాకుండా పోయే అవకాశాలుంటాయి. రెండో విషయం.. వాళ్లపై అంచనాలు పెరిగిపోయి చెప్పాలనుకున్నది చెప్పలేక మళ్లీ మామూలుగా, సేఫ్ రూట్‌లో వెళ్లే ప్రమాదం ఉంది. ఏ రంగంలో ఉన్నవాళ్లయినా ఈ రెండింటినీ ప్రతిసారీ గెలవడానికి ప్రయత్నిస్తుంటారు. నేనూ ఆ భయాల్ని గెలవాలనే ప్రయత్నిస్తుంటా. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత అందరూ ‘మీకు అలవాటైన వినోదం వైపు వెళితే ఉత్తమం కదా’ అన్నారు. నేనది చేయలేదు. పరాజయం చూశాక ఇక కొత్తగా భయపడాలా? ఈ భయాన్ని గెలవాలంటే ఇదే సమయం అని అరవింద సమేత చేశా. ఇప్పుడు మళ్లీ అదే కథ చెప్పకూడదు కదా.