స్టార్ హీరోలే కాదు... దక్షిణాదిలో స్టార్ దర్శకులూ బోలెడుమంది. ఆ జాబితాలో తొలి వరసలో కనిపించే దర్శకుడు కె.ఎస్.రవికుమార్. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ... ఇలా దక్షిణాదిలో ఎంతోమంది అగ్ర హీరోలతో సినిమాలు చేసి విజయాల్ని అందుకున్నారాయన. ఇటీవల బాలకృష్ణతో ‘రూలర్’ తెరకెక్కించారు. సి.కల్యాణ్ నిర్మించిన ఆ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా కె.ఎస్.రవికుమార్ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..
హీరోల ఇమేజ్ బట్టే కథ ఎంపిక..
కథానాయకుల ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకునే కథల్ని ఎంపిక చేసుకుంటా. జై సింహా తర్వాత ఈ విరామంలో 8 తమిళ సినిమాల్లో నటించా. విలన్‌గా, క్యారెక్టర్ నటుడిగా చేశా. అక్కడ నటన, ఇక్కడ దర్శకత్వం చేస్తుంటా.
బాలయ్య 3 గంటలకే లేచేవాడు..
బాలకృష్ణకి తగ్గ కథ 'రూలర్'. పరుచూరి మురళి ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ నేపథ్యంలో ఉంటుంది. బాలకృష్ణ ఎన్ని గెటప్పుల్లో కనిపిస్తారనేది తెరపైనే చూడాలి. ఐటీ అధికారి పాత్ర కోసం ఆయన నెలన్నరలో బరువు తగ్గి సన్నబడ్డారు. 3 గంటలకే లేచి ఎంతో నిబద్ధతతో తన లుక్‌ని మార్చుకున్నారు. అది ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. కథానాయికలతో సహా అందరూ ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తారు.
'స్నేహం కోసం' 45 రోజుల్లో తీశా..
రజనీకాంత్ సహా అగ్రహీరోలందరితోనూ చేశా. శ్రద్ధగా పనిచేయడమే విజయ రహస్యమని నమ్ముతా. బాలకృష్ణ సెట్‌లో చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 10న మొదలుపెట్టి డిసెంబరు 10న సెన్సార్‌కి తీసుకెళ్లా. ప్రణాళిక, అనుభవంతోనే వేగంగా సినిమాలు చేయగలుగుతాం. 'స్నేహం కోసం' సినిమాని అప్పట్లో 45 రోజుల్లో పూర్తి చేశా. ఆ సినిమా చేస్తూనే 'నరసింహ' డైలాగుల్ని రాసుకున్నా.