తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విలన్ కాదు అతడు రియల్​ హీరో

సినిమాల్లో ఆయనొక విలన్​.. కానీ, నిజజీవితంలో వలస కూలీల పాలిట నిజమైన హీరో. లాక్​డౌన్​తో ముంబయిలో చిక్కుకుపోయిన కార్మికుల ఆకలిని తీర్చారు. కాలినడకన ఊర్లకు పయనమయిన బాటసారుల కష్టాలు చూసి చలించిపోయి.. వారి కోసం ప్రత్యేక బస్సు ఏర్పాట్లు చేశారు. ఇలా వారి స్వస్థలాలకు వెళ్లే వరకు అన్నీ తానై అండగా ఉన్నాడు. అతనే సోనూ సూద్​.

Special article on Sonu Sood, the real hero who shared the suffering of migrant workers
కూలీల బాధలు పంచుకున్న అసలైన మాస్​ హీరో

By

Published : May 26, 2020, 7:06 AM IST

సినిమాలో కష్టాలు మొదలవ్వగానే హీరో ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తారు ప్రేక్షకులు. ఆపద్బాంధవుడిలా వచ్చి కష్టాలన్నింటినీ కడతేర్చడం చూసి చప్పట్లు కొడతారు. నిజ జీవితంలో అలాంటి చప్పట్లే ఇప్పుడొక విలన్‌ కోసం కొడుతున్నారు దేశప్రజలు. ముంబయిలో ఉన్న వలస కూలీలైతే తమ కష్టాలన్నింటినీ ఆ విలన్‌తో మొర పెట్టుకుంటున్నారు. ఆయన అచ్చం హీరోలా స్పందిస్తున్నారు. మీకు నేనున్నా అంటూ భుజం తడుతున్నారు. అలా వేలాది మంది వలస కూలీల్ని ఇళ్లకు చేర్చి... వాళ్ల కుటుంబాల్లో ఆనందం చూసిన ఆ వెండితెర విలన్‌, నిజ జీవిత హీరో... సోనూ సూద్‌.

సమాజానికి ఎప్పుడు ఏ కష్టం ఎదురైనా చిత్రసీమ స్పందిస్తుంది. కరోనా ప్రభావం మొదలయ్యాక.. దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు స్పందించారు. ఈ మహమ్మారిపై పోరాటం కోసం ఎవరి స్థాయిలో వాళ్లు, ఎవరి శైలిలో వాళ్లు సాయం ప్రకటించారు. సోనూసూద్‌ అయితే ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. కొవిడ్‌-19పై పోరాటంలో ముందున్న వైద్యసిబ్బంది తన హోటల్‌ని వాడుకోవచ్చని ప్రకటించారు. ఆ తర్వాత మురికివాడల్లో నివసిస్తున్న పేదలకి ఆహార పంపిణీ కోసం రంగంలోకి దిగారు. ఆ ప్రయత్నం చేస్తూనే వలస కూలీల్ని ఇళ్లకి చేర్చడం కోసం బస్సులు ఏర్పాటు చేశారు. స్వయంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో మాట్లాడి, అనుమతులు పొంది కార్మికుల్ని జాగ్రత్తగా ఇళ్లకి సాగనంపుతున్నారు. సోనూ సాయంతో ముంబయి నుంచి ఇళ్లకి చేరుకున్న జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటకకి చెందిన వేలాది మంది వలస కూలీలైతే ఇప్పుడు ఆయన్నొక దేవుడిలా చూస్తున్నారు. రెండు నెలలుగా తన స్నేహితులతో కలిసి ఆయన చేస్తున్న సహాయ కార్యక్రమాలు ప్రతి ఒక్కరితోనూ శభాష్‌ అనిపిస్తున్నాయి.

నేనూ వలస వచ్చినవాణ్నే

సోనూ అతని బృందం ముంబయిలోని ఆంధేరి, జుహు, జోగేశ్వరి, బాంద్రా తదితర ప్రాంతాల్లో రోజూ 45 వేల మందికి ఆహారం పంపిణీ చేస్తోంది. కరోనా ప్రభావం మొదలైనప్పట్నుంచీ దినసరి కార్మికుల ఆకలిని తీర్చే ప్రయత్నానికి పూనుకున్నాడు సోనూ. అలా ఆయన బృందం ఆహారం పంపిణీలో ఉన్నప్పుడే కర్ణాటకకి చెందిన వలస కార్మికులు సొంతూళ్లకి పయనమయ్యారు. 550కిలోమీటర్లు కాలినడకనే వెళతామని చెప్పడం వల్ల ఆయన చలించిపోయారు. రెండు రోజులు సమయం ఇవ్వండి, మిమ్మల్ని ఇళ్లకి పంపే బాధ్యత నాది అంటూ వాళ్లకి భరోసానిచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు పొంది మే 11న తొలి విడతగా 350 మంది వలస కార్మికుల్ని బస్సుల్లో పంపించారు సోనూ సూద్‌. అప్పట్నుంచి పలువురు వలస కార్మికులు సోనూసూద్‌ని సామాజిక మాధ్యమాల ద్వారా, ఫోన్ల ద్వారా సంప్రదిస్తూనే ఉన్నారు. ఆయన అంతే వేగంగా స్పందిస్తూ, వాళ్లకి భరోసానిస్తూ.. సొంతూళ్లకు చేర్చేందుకు శ్రమిస్తున్నారు. సోనూసూద్‌ చొరవతో ఇప్పటికే వందలాది బస్సుల్లో పలు రాష్ట్రాలకి పయనమై వెళ్లిన వలస కార్మికుల సంఖ్య పన్నెండు వేలకు పైనే. వాళ్లు వెళుతున్నప్పుడు ఆ కళ్లల్లో ఆనందం, కన్నీళ్లు రెండూ కనిపిస్తుంటాయని చెబుతారు సోనూ. చివరి కార్మికుడిని ఇంటికి పంపించేవరకు బాధ్యత తీసుకుంటానని అంటున్నారు.

"ముంబయికి నేనూ వలసదారుడిగానే వచ్చా. కుటుంబానికి అండగా నిలిచేందుకు ఎన్నో కలలు, ఆశలతో వస్తుంటారు. ఆ సమస్యలు నాకు బాగా అర్థమవుతాయి. మన ఇళ్ల కోసం శ్రమించిన కూలీలు.. రోడ్లపై కష్టాలు పడుతుంటే ఇంట్లో ఉండి నిద్రపోవడం సరికాదనిపించింది. ఇక ఇంటికి వెళ్లలేమేమో.. ఇక్కడే ప్రాణాలు వదులుతామేమో అని భయపడ్డామని వలస కూలీలు అంటుంటే ఎంతో బాధేసింది. అందుకే రోడ్లెక్కి వారిని ఇంటికి పంపే బాధ్యతను తీసుకున్నా" అంటారు సోనూ.

దీని వెనక చాలా శ్రమ ఉంటుంది కదా అంటే... ఒక్కో రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తుంది, అయినా సరే కార్మికుల్ని క్షేమంగా ఇళ్లకి పంపడం ముఖ్యం అంటారు. ఆయన చిన్ననాటి స్నేహితుడైన నీతిగోయెల్‌తో కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు సోనూ. ఆయన సేవా కార్యక్రమాల్ని కేంద్రమంత్రి స్మృతిఇరానీ ట్విటర్‌ ద్వారా మెచ్చుకున్నారు. "రెండు దశాబ్దాలపాటు వృత్తిపరంగా ఓ సహచరుడిగా మీరు నాకు తెలియడం నా భాగ్యం. నటుడిగా మీ ఎదుగుదల ఎంతో సంతోషాన్నిచ్చింది. అయితే ఈ క్లిష్ట సమయంలో మీరు చూపిన దయ నన్ను మరింతగా కదిలించింది. గర్వపడేలా చేస్తోంది. అవసరమైనవాళ్లకి సాయం చేసినందుకు ధన్యవాదాలు" అని ట్వీట్‌ చేశారు స్మృతిఇరానీ.

ఇదీ చూడండి... మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా: స్మృతి ఇరానీ

ABOUT THE AUTHOR

...view details