గొప్ప గాయకుడిగానే కాకుండా మంచి మనస్సున్న వ్యక్తిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతి ఒక్కరి మదిలో చెరగని ముద్ర వేశారు. గాయకుడిగా ఎన్నో శిఖరాలను అధిరోహించినప్పటికీ ఓ సాధారణ వ్యక్తిలా అందరితో మమేకం అవుతూ.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కర్నీ ఆయన గౌరవిస్తుంటారు. శుక్రవారం ఆయన మరణంతో సినీ ప్రముఖులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలుకు సంబంధించిన ఒకప్పటి వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
తనని మోసిన వారి పాదాలకి మొక్కిన ఎస్పీబీ
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకానొక సమయంలో అయ్యప్పస్వామి దర్శనార్థం శబరిమల వెళ్లారు. పంబా ప్రాంతం నుంచి అయ్యప్పస్వామి ఆలయం వరకూ ఆయన డోలీలో ప్రయాణం చేశారు. అయితే ప్రయాణానికి ముందు ఆయన.. తనని డోలీలో ఎక్కించుకుని మోయడానికి సిద్ధమైన వ్యక్తుల పాదాలకు మొక్కారు. అంతేకాకుండా తనతోపాటు వచ్చిన ఓ స్నేహితుడికి కూడా డోలీవాలాలకు నమస్కారం చేయమని చెప్పారు. ఎస్పీబీ తమకిచ్చిన గౌరవంతో సదరు డోలీవాలాలు ఎంతో సంతోషించారు.
అభిమానిని ఆశ్చర్యపరిచిన ఆ క్షణం..
ఎస్పీబీకి దేశవిదేశాల్లో అభిమానులున్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్పీబీ అభిమాని ఒకరు శ్రీలంకలో జరిగిన దాడిలో ప్రమాదవశాత్తు చూపు కోల్పోయారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకున్న బాలు ఓరోజు అతన్ని కలిసి ఆశ్యర్యానికి గురి చేశారు. ఎస్పీబీ స్వరం విన్న ఆ వ్యక్తి ఆనందాన్ని వివరించడానికి మాటల్లేవనే చెప్పాలి.