సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్లు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. కరోనా సోకి స్వల్ప లక్షణాలతో ఆగస్టు 5న ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఎస్పీ బాలు.. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయనకు కరోనా నెగిటివ్ అని వచ్చింది. వ్యాధి పూర్తిగా నయం కావడం వల్ల వీలైనంత త్వరలోనే తన తండ్రి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అవుతారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ కూడా చెప్పారు. ఆసుపత్రిలో రోజూ దాదాపు 20 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నారని, నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
కరోనా నుంచి కోలుకున్నా.. ఎస్పీ బాలుకు ఊపిరితిత్తుల సంబంధిత సమస్య ఇంకా ఉండటం వల్ల ఆయనకు వైద్యులు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే గురువారం సాయంత్రం ఉన్నట్టుండి మళ్లీ బాలు ఆరోగ్యం క్షీణించిందన్న వార్తలు రావడం వల్ల అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
గురువారం సాయంత్రం ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. "ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా లక్షణాలతో ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నాం. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయనను నిశితంగా పర్యవేక్షిస్తోంది" అని తెలిపారు.