కరోనాతో పోరాడుతూ ఆస్పత్రితో చికిత్స పొందుతున్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. శుక్రవారం ఆయన ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉండటం వల్ల ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ తన తండ్రి అభిమానులు, శ్రేయోభిలాషులకు ఆడియో సందేశాన్ని పంపారు.
ఎస్పీబీ ఆరోగ్యంపై స్పందించిన ఎస్పీ చరణ్
కరోనాతో పోరాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అతడి ఆరోగ్య పరిస్థితిపై చాలా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటన్నింటిపై స్పందించారు ఆయన తనయుడు చరణ్.
"అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్యం విషయంలో తాజా పరిస్థితి గురించి తెలుసుకునేందుకు అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే అప్‌డేట్ ఇవ్వాలని అనుకున్నా. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. నిన్న వెంటిలేటర్‌పై ఉంచడం ఆయనకు ఎంతో ఉపయోగపడింది. నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంపై వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ లేదా రేపటిలోగా ఆయన సాధారణ స్థితికి వచ్చేస్తారు. త్వరగా కోలుకుంటారు. నాన్నగారి ఆరోగ్యంపై నేను అప్‌డేట్ ఇస్తాను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు" అని ఆడియో సందేశంలో పేర్కొన్నారు.
"ఆగస్టు 5న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైంది. అయితే గురువారం రాత్రి ఆయన తిరిగి అస్వస్థతకు గురి కావడం వల్ల వైద్య నిపుణుల సూచన మేరకు వెంటనే ఆయన్ని ఐసీయూకి తరలించాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది" అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు నిన్న వెల్లడించాయి. దీంతో అన్ని భాషల సినీ ప్రముఖులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థించారు.