రేపటి నుంచి బాలూ పాటను వినని రోజు మనకుంటుందా.. గుండె గుండెనూ తడిమిన ఆ గొంతును మర్చిపోగలమా.. ఆ పాటలన్నీ ఓ సారి తిరిగి చూసుకుంటే.. 50 ఏళ్లకు పైగా.. ప్రతి ఇంటినీ.. ఏదో రూపంలో రంజింప జేస్తున్న ఆ గొంతు. తొలిసారిగా పరిమళించింది.. 1964లో ఒక సంగీత సాంస్కృతిక సంస్థ నిర్వహించిన పోటీలో బాలూకు ప్రథమ బహుమతి వరించింది. ఆనాడు ఓ పాటల పోటీకి న్యాయనిర్ణేతలుగా వచ్చిన సంగీత దిగ్గజాలు సుసర్ల దక్షిణామూర్తి, ఎస్పీ కోదండపాణి, గంధర్వగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. వీరు ముగ్గురూ అతడి గాత్రమాధుర్యాన్ని, సొగసైన స్వరాల విరుపులను, మెరుపులను గుర్తించారు.
1966 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' తో కోసం 'ఏమి ఈ వింత మోహం' అనే పాటతో కోదండపాణి బాలును సినీలోకానికి పరిచయం చేశారు. 1969లో మహదేవన్ స్వరకల్పనలో ఏకవీర సినిమాలో మాస్టారు.. ఘంటసాలతో కలసి వసంతరాత్రిని కురిపించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో చెల్లెలికాపురం సినిమాలో 'ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ' అనే పాటతో బాలూ చెలరేగిపోయారు. 1972లో పలకరించిన గూడుపుఠాణిలో 'తనివి తీరలేదే..' అంటూ కథానాయకుడు కృష్ణకు ఆలపించిన ఆ గీతాన్ని ఇప్పటికీ తనివతీరకుండా వింటున్నారు.. ఇక 'కన్నెవయసు' చిత్రంలో 'దివిలో విరిసిన పారిజాతాన్ని' నేలపైకి దించారు.
ఇదంతా ఆయన పాటల్లో తొలిదశ.. 1974 తర్వాత ఆయన గేర్ మార్చారు. బాలు సంగీతం శాస్త్రీయంగా నేర్చుకోలేదు. అయినా బాలుకు రాగ, తాళ జ్ఞానపం, సంగీత పరిజ్ఞానం పుష్కలం. ఒక్కసారి వింటే అదేవిధంగా పాడగలిగే ఏకసంధాగ్రాహి. గళానికీ అభినయం ఉంటుందని, ఉందని, నిరూపించిన సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సంగీత దర్శకులు స్వర జ్ఞానులైతే బాలసుబ్రహ్మణ్యం గళ విన్యాస జ్ఞాని. పెద్ద హీరోల పాటలకు అది ధన్యనుసరణ చేశారు.. అక్కడి నుంచి బాలుకు తిరుగులేదు. హీరోలు అందరినీ ఆవాహన చేసి ఆలపించడం మొదలుపెట్టారు. 1977లో ఎన్టీరామారావు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం అడవిరాముడు. ఆ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు తగినట్లుగా బాలు తన గొంతు మార్చుకున్నారు. 'కృషి ఉంటే మనుషులు రుషులవుతారు' పాట అఖండ విజయం సాధించింది. వేటూరి కలం, బాలూ గళం, మహదేవన్ స్వరం ప్రేక్షకులపై 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాట సూపర్ హిట్.
1977లోనే ప్రేక్షకులను అలరించిన దానవీర శూరకర్ణలో దుర్యోధనుడికి ఎన్టీఆర్ యుగళగీతం పెట్టారు. సినారె రాసిన ఆ పాట చిత్రంగా, భళారేవిచిత్రంగా, గమ్మత్తుగా అన్పించింది. 'ఆకుచాటు పిందె తడిచె' అంటున్నా.. 'జననీ జన్మభూమిశ్చ' అని దేశభక్తిని ప్రబోధించినా.. మళ్లీ చాన్నాళ్లకు 'పుణ్యభూమి నాదేశం నమో:నమామీ' అంటూ.. అదే రీతిలో ఆలపించినా.. ఎక్కడా బాలు కనిపించలేదు. ఎన్టీఆరే పాడుతున్నట్లు కనిపించింది. ఓ పక్క ఎన్టీఆర్ లాగా అదరగొడుతూ.. మరోవైపు ఏఎన్నార్‌ను దించేశారు. వాళ్ల కాంబినేషన్‌లో ప్రేమాభిషేకం ఎవర్ గ్రీన్ ఆల్బమ్ 'ఆగదూ..ఆగదూ', 'వందనం అభివందనం', 'కోటప్ప కొండకు వస్తానని' ఇలా అన్నీ ఆల్‌టైమ్ హిట్సే!
సూపర్‌స్టార్‌కు ఇచ్చిన పాటలు మరో వైవిధ్యం. 'నేనొక ప్రేమ పిపాసినీ..' అంటూ ఇంధ్ర ధనస్సులో 'నవ్వుతూ బతకాలిరా' అంటూ.. మాయదారి మల్లిగాడులో బాలు చూపించిన వేరియేషన్స్.... ఎవ్వరి వల్లా కానివి! కృష్ణ గొంతులోని చిన్న పాటి సౌండ్‌ను.. మాడ్యులేషన్‌ను కూడా యథాతథంగా పలికించారు.
వారి తర్వాత వచ్చిన తర్వాత తరంలో పాటంటే బాలు... బాలు అంటే పాట.. అంతే.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.. హీరోలు, డైరక్టర్లు.. నిర్మాతలు.. మారతారు.. సింగర్ పేరు మాత్రం సింగిల్ కార్డే! అదీ ఎస్పీ బాలసుబ్రమణ్యం.. అని.! ఈ హీరోలతో.. వీళ్ల గొంతులతో ఆయన ఓ ఆట ఆడేశారు.. జనాలను తన పాటల మత్తులో ముంచేశారు. ఈ నలుగురు స్టార్ హీరోలకు కొద్దిపాటి వేరియేషన్ ఇచ్చి.. బాలు చూపించిన మ్యాజిక్ మామూలుది కాదు. అసలు సినిమా పేరు తెలియకపోయినా సరే.. బాలూ పాట విని అదే హీరోదో చెప్పగలిగేంత పరిస్థితి ఉండేది. 'బంతీ చేమంతి' అంటూ అభిలాషలో, 'ఇందువదన కుందరదన' అంటూ ఛాలెంజ్‌లో హుషారు నింపారు. 'తరలిరాద తనే వసంతం', 'శుభలేఖ రాసుకున్నా' , 'మల్లి మల్లి ఇది రానీ రోజు' (రాక్షసుడు ) 'చిలుకా క్షేమమా' (రౌడీ అల్లుడు ) ఈ పాటలన్నీ అదరహో అనిపించాయి. చిరంజీవి ఆల్ టైమ్ హిట్స్ తీస్తే.. 90శాతం బాలూ పాటలే ఉంటాయి.
'దంచవే మేనత్త కూతురా' ( మంగమ్మగారి మనవడు), 'రాళ్లల్లో ఇసుకల్లో..' ( సీతారామకల్యాణం) 'జాణవులే వరవీణవులే' ( ఆదిత్య 369) 'జగదానంద కారకా'( శ్రీరామరాజ్యం) అంటూ బాలయ్యకు.. అద్భుతమైన హిట్స్ ఇచ్చారు.