సంగీతం అనేది విశ్వజనీయం. ప్రకృతిలో సౌందర్య సమన్వితంగా పంచభూతాలలో హృదయాన్ని ఆకర్షించే నాదం ఉంది. ఏకాలమైనా, ఏదేశమైనా ప్రపంచవ్యాప్తంగా మానవ హృదయాలను సంగీతం తన్మయింపజేస్తుంది. సృష్టిలో సంగీతానికి ప్రకృతే పరవశిస్తుంది. నృత్య వాద్యాలతో స్వరసమ్మేళన రాగమాధుర్యంతో హృదయాలను సమ్మోహనపరిచే సంగీతానికి ఎల్లలులేవు. వాటిలో సినిమా సంగీతం జనరంజకమైనది. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీసంగీతానికి పునాది వేసి జాగృతం చేశారు. తదనంతరకాలంలో ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది 'బాలు' అని ముద్దుగా పిలుచుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఎంత ఎత్తుకెదిగినా ఎల్లలు దాటని యోగి పుంగవుడు. ఆబాల గోపాలాన్ని కట్టిపడేసే సమ్మోనశక్తి బాలు గళానికే కాదు ఆయన వ్యక్తిత్వానికీ ఉంది. బాలు సినీ సంగీత ప్రపంచానికి పరిచయమై 50 ఏళ్లు దాటిన ఆ కంఠస్వరంలోని మాధుర్యం అంబరాన్ని తాకుతోంది. 'పాడుతా తీయగా', 'స్వరాభిషేకం' వంటి రాగసాగరికల ద్వారా ఖండాంతరాలను దాటుతున్నాయి. ఇంతితై.. వటుడింతై.. నభోవీధిపైనంతై.. ప్రభారాశిపైనంతై.. బ్రహ్మాండాంత సంవర్ధియైన ఈ బాల సంగీత విద్వాంసుడు సింహపురి (నెల్లూరు) పట్టణంలో జూన్ 4వ తేదీన జన్మించారు. నేడు 74వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
గాయకుడు కావాలని
1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో పాల్గొన్న 'బాలు'కు అందులో ప్రథమ బహుమతి వచ్చింది. ఆ పోటీకి న్యాయ నిర్ణేతలు ప్రఖ్యాత సంగీత దర్శక త్రిమూర్తులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు. అంతేకాదు మరో సంగీత దర్శకుడు కోదండపాణి కూడా ప్రేక్షకులలో కూర్చుని ఆ పాట విన్నారు. 'బాలు' పాడిన విధానం అతనికి నచ్చింది. ఆ కుర్రాణ్ణి అభినందించారు. గొంతు లేతగా వుంది. కొన్నాళ్లు పొతే సినిమాల్లో పాటలు పాడిస్తానని అభయమిచ్చారు. ఈ సంఘటనకు ముందు గూడూరు కళారాధన సమితి నిర్వహించిన లలిత సంగీత పోటీలకు ప్రముఖ నేపథ్య గాయని జానకి ముఖ్యఅతిధిగా వచ్చారు. ఆ పోటీల్లో బాలుకు ద్వితీయ బహుమతి వచ్చింది. ముఖ్య అతిధి జానకి మాట్లాడుతూ బాలుకే ప్రథమ బహుమతి పొందే అర్హత ఉందని, వర్ధమాన కళాకారులకు ఇలాంటి అన్యాయం జరిగితే వాళ్ల భవిష్యత్తు అంధకారమవుతుందని నిర్మొహమాటంగా చెప్పారు. ఆమె చెప్పిన మాటలు బాలు గుండెలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. సినిమాల్లో పాడేందుకు ప్రయత్నించమని ఆమె బాలుకు సలహా ఇచ్చారు. మద్రాసులో ఇంజనీరింగు చదువు కొనసాగిస్తూ, సినిమా అవకాశాలకోసం తరచూ కోదండపాణిని కలుస్తూ ఉండేవారు. సంగీతం ఎవరిదగ్గరా నేర్చుకోకపోయినా, రాగ తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండడం వల్ల ట్యూన్ ఒకసారి వింటే యధాతథంగా పాడగలిగే విద్వత్తు బాలుకు సొంతం కావడం లాభించే అంశం. అంతేకాదు స్టేజి ఫియర్ తెలియకపోవడం.. అన్నింటికి మించి బాలు గళం అతనికి భగవంతుడు ఇచ్చిన వరం!
తొలి ప్రయత్నమే నిష్ణాతులలో...
ఇచ్చిన మాటకు కట్టుబడి కోదండపాణి బాలుకు 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' సినిమాలో తొలిసారి పాడే అవకాశమిచ్చారు. ఆ సినిమా నిర్మాత హాస్యనటుడు పద్మనాభం, కోదండపాణి ప్రతిపాదనకు మద్దతు పలికారు. వేటూరి రాయాగా మాల్కోస్, యమన్, కల్యాణి, భాగేశ్వరి రాగాల్లో స్వరాలల్లిన 'యేమి ఈ వింత మొహం' అనే రాగమాలికను రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ వారి కార్యాలయంలో కోదండపాణి వారం రోజులపాటు బాలు చేత ప్రాక్టీసు చేయించారు. చివరకు అది సోలో పాట కాదని నలుగురు కలిసి పాడేదని తెలిసింది. అలవాటు ప్రకారం ఓరోజు ప్రాక్టీసుకు వెళ్లిన బాలుకు పద్మనాభం కార్యాలయంలో పి.సుశీల, కల్యాణం రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్ కనిపించారు.
తడబాటులో ఉన్న బాలును కోదండపాణి వారికి పరిచయంచేసి 'యేమి ఈ వింత మొహం' పాట మొత్తాన్ని బాలుచేత పాడించి వినిపించారు. ఆపైన ముగ్గురు గాయనీ గాయకులతో కలిసి బాలు పాడిన ఈ తొలిపాట 15 డిసెంబరు 1966న విజయా గార్డెన్స్‌లో రికార్డిస్ట్ స్వామినాథన్ అధ్వర్యంలో రికార్డైంది. పాట మొదటి టేక్‌లోనే ఓకే కావడం విశేషం. 1967 జూన్ 2న విడుదలైన ఈ సినిమా.. చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు 'బాలు' ప్రభంజనానికి తెరలేపింది. బాలు సగర్వంగా ఎప్పుడూ చెప్పేమాట ఒకటుంది.
'కోదండపాణి గారనే వ్యక్తే ఆనాడు లేకుంటే ఈనాడు బాలు ఉండేవాడు కాదు. ఆయనకు గాయకుడిగా నా భవిష్యత్తు మీద యెంత నమ్మకముందంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా లేదు. నా మొదటి పాట విజయా గార్డెన్స్ ఇంజనీరు స్వామినాథన్ గారితో చెప్పి ఆ టేప్ చెరిపేయకుండా సంవత్సరంపాటు అలాగే ఉంచేట్లు చేసి, ఏ సంగీత దర్శకుడు అక్కడికి వచ్చినా, వారికి వినిపించి, అవకాశాలు ఇమ్మని అడిగేవారట. ఏమిచ్చినా కోదండపాణి ఋణం నేను తీర్చుకోలేను'. ఈ మాటలు చాలావా బాలుకు కోదండపాణి మీద ఎంతటి భక్తి ప్రపత్తులున్నాయో తెలుపడానికి! తరువాత చంద్రశేఖర ఫిలిమ్స్ వారు నిర్మించిన 'మూగజీవులు' సినిమాలో బాలు పాడిన 'దయలేని లోకాన' అనే పద్యాన్ని కోదండపాణి మహదేవన్‌కు వినిపించగా ఆయన డి.బి.నారాయణ నిర్మించిన 'ప్రైవేట్ మాస్టారు' సినిమాలో 'పాడుకో పాడుకో...పాడుతూ చదువుకో' అనే పాటను బాలు చేత పాడించారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావులకు పాడే అవకాశాన్ని ఇచ్చిందీ మహాదేవనే. 'ఏకవీర'లో ఎన్టీఆర్‌కు, 'ఇద్దరు అమ్మాయిలు'లో అక్కినేనికి మహదేవన్ బాలు చేత పాడించారు.
బాలు తొలి తరం గీతాలు.
'ప్రైవేట్ మాస్టారు' సినిమాలో బాలు పాడిన పాట తరువాత దర్శకుడు విశ్వనాధ్ సహకారంతో 'సుఖ దుఃఖాలు' సినిమాలో 'మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు', 'అందాలు చిందే ఆకళ్లలోనే బంగారు కలలే దాగున్నవి' అనే పాటలు బాలుచేత కోదండపాణి పాడించారు. 'ప్రైవేట్ మాస్టారు'లో బాలు పాడిన పాట విని బాపు-రమణలు 'బంగారు పిచిక' సినిమాలో బాలు చేత 'ఒహోహో.. బంగారు పిచ్చికా', 'మనసే గని తరగని, గని తగ్గని గని' పాటలు పాడించారు. అదే మహదేవన్ 'ఉండమ్మా బొట్టుపెడతా' సినిమాలో 'రావమ్మా మహాలక్ష్మి రావమ్మా', 'చుక్కలతో చెప్పాలని', 'చాలులే నిదురపో జాబిలీకూనా' పాటలు కూడా పాడించారు. ఆ తరువాత పద్మనాభం నిర్మించిన 'శ్రీరామకథ'లో కోదండపాణి 'రామకథ శ్రీరామ కథ', 'రాగమయం.. అనురాగమయం' పాటలు, మరికొన్ని పద్యాలు, శ్లోకాలు బాలు చేత పాడించారు. అలాగే 'మంచి మిత్రులు' సినిమాలో ఘంటసాలతో కలిసి 'ఎన్నాళ్లో వేచిన ఉదయం' పాటను బాలు పాడారు.
ఈ పాటలన్నీ సూపర్ హిట్లుగా నిలవడం వల్ల బాలుకు మరికొన్ని సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. 'మహాబలుడు' సినిమాలో 'విశాల గగనంలో చందమామ'; 'ఆస్తులు-అంతస్తులు'లో 'ఒకటై పోదామా వూహల వాహినిలో' పాట; సత్యం సంగీత దర్శకత్వంలో వచ్చిన 'టక్కరిదొంగ-చక్కనిచుక్క' సినిమాలో 'నడకలు చూస్తే మనసౌతుంది', 'కలలుగనే కమ్మని చిన్నారీ' పాటలు, 'ముహూర్తబలం' సినిమాలో మహదేవన్ సంగీత సారధ్యంలో ‘బుగ్గ గిల్లగానే సరిపోయిందా’ పాటలు ఆలపించారు. ఆ పరంపరలో సారథి స్టూడియోవారి 'ఆత్మీయులు' సినిమాలో 'చిలిపి నవ్వుల నిను చూడగానే' పాటను సాలూరు రాజేశ్వరరావు బాలుచేత పాడించారు. ఆపై 'జగత్ కిలాడీలు' సినిమాలో 'వేళ చూస్తే సందెవేళ..గాలి వీస్తే పైరగాలి' పాట, 'నుషులు మారాలి' సినిమాలో 'తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో', 'పాపాయి నవ్వాలి పండగే రావాలి' పాటలు, 'బందిపోటు భీమన్న' చిత్రంలో 'నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో' పాట, 'ఏకవీర'లో ఘంటసాలతో కలిసి 'ప్రతిరాత్రి వసంత రాత్రి' పాట, మరికొన్ని పద్యాలు బాలు గళంలో మారుమోగాయి. దాంతో గాయకుడిగా బాలు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అలా 1969 నుంచే బాలు బాగా బిజీ అయ్యారు. బాలు స్వరంలో వచ్చిన ఈ పాటలు ఇప్పుడు వింటుంటే ఎంత వీనుల విందుగా, హాయిగా వుంటుందో చెప్పనలవికాదు.