దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు పలువురు సినీప్రముఖులు, అభిమానులు. ఇందులో సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, అనిరుధ్ రవిచందర్, నటుడు భారతీరాజా, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ తదితరులు ఉన్నారు.
బులెటిన్ విడుదల...
ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆస్పత్రి యాజమాన్యం శుక్రవారం(ఆగస్టు 14న) బులెటిన్ విడుదల చేసింది.
"ఆగస్టు 5న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైంది. అయితే గురువారం రాత్రి ఆయన తిరిగి అస్వస్థతకు గురి కావడం వల్ల వైద్య నిపుణుల సూచన మేరకు వెంటనే ఆయన్ని ఐసీయూకి తరలించాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది" అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.