ఎవరయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావ్?
మాతో నీకు ఇన్ని బంధాలేంటి?
రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ రాగాలై పుడుతూనే ఉంటావ్?
నువ్వు పుట్టి డెబ్బై ఐదేళ్లేనేమో.. నిమిషానికి డెబ్బై సార్లు మా గుండెల్లో స్వరాలై మోగుతూనే ఉంటావ్.
ఎవరయ్యా నువ్వు?
'అహో.. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు..
తన పల్లవి పాడే చల్లని రోజూ..'
అంటూ.. పుడుతూనే మొదలెడతావు నీ
రాగాలాపన.
నిద్రరాక ఏడుస్తుంటే.. 'లాలిజో లాలీజో.. ఊరుకో పాపాయి' అని
అమ్మవైపోతావు.
కాలేజీకి వెళుతుంటే.. 'బోటనీ పాఠముంది.. మ్యాటనీ పిక్చరుంది దేనికో ఓటు చెప్పరా..'
అని టీజింగ్ చేస్తావ్.
'స్నేహమేర జీవితం.. స్నేహమేర శాశ్వతం..'
ఇంతలో స్నేహితుడై పలుకరిస్తావ్.
అమ్మ లాలిలో ఉంటావు..
కుర్రకారు జాలీలో ఉంటావ్.
ఎవరయ్యా నువ్వు?ఎక్కడి నుంచి వచ్చావ్?
మాతో నీకు ఇన్ని బంధాలేంటి?
అమ్మాయి మనసు అర్థం కాక నలిగిపోతుంటే.. 'మాటేరాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు..' అంటూ యవ్వనాన్ని గిల్లేస్తావ్.
'ఏ దివిలో విరిసిన పారిజాతమో..
ఏ కలలో మెరిసిన ప్రేమ గీతమో..'
కవిత్వాలు రాయిస్తావ్.
'ప్రియా.. ప్రియతమా రాగాలు.. సఖి కుశలమా అందాలు'.. వలపు గీతాలు పాడిస్తావ్.
పెళ్లికి సిద్ధమైతే.. 'తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల' అని ఎత్తుకుంటావ్...
ప్రేమ విఫలమైతే.. 'ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం' అంటావ్..
ప్రణయంలోనూ ఉంటావ్..
ప్రళయంలోనూ ఉంటావ్.