కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో వలస కూలీలు అనుభవించిన కష్టాలు కొత్తగా చెప్పనక్కర్లేదు. అటువంటి సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎందరో కార్మికులకు అండగా నిలబడి.. వారి పాలిట దైవంగా మారాడు. తాజాగా, లాక్‌డౌన్‌తో కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న దాదాపు 3 వేల మంది విద్యార్థులను తమ స్వస్థలాలకు చేర్చేందుకు సిద్ధమయ్యాడు సోనూ. వీరిలో 20 మంది బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.
జులై 14న ఆసియా మెడికల్ ఇన్స్టిట్యూట్(ఏఎమ్ఐ)లో వైద్య శాస్త్రం చదువుతున్న ఒక విద్యార్థి తాము ఇంటికి వెళ్లేందుకు సాయం కావాలని కోరాడు. ఈ క్రమంలోనే ట్వీట్ చేస్తూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ట్యాగ్ చేశాడు. విషయాన్ని తెలుసుకున్న సోనూ.. సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.
"కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న విద్యార్థులందరూ ఇంటికి తిరిగి వచ్చే సమయం వచ్చేసింది. జులై 22న ఛార్టర్ విమానాన్ని బిష్కెక్- వారణాసి మధ్య నడపనున్నాం. వివరాలను విద్యార్థుల ఈ-మెయిల్, మొబైల్ ఫోన్లకు పంపిస్తాం. ఇతర రాష్ట్రాలకూ ఈ వారంలోనే విమానాలు పంపిస్తాం".