గతేడాది కొవిడ్-19 లాక్‌డౌన్(corona lockdown) కారణంగా ఇబ్బందులు పడ్డ ఎంతో మంది వలస కార్మికులకు సాయం చేశారు బాలీవుడ్ నటుడు సోనూసూద్(Sonu Sood). అప్పటి నుంచి ఇప్పుడు కరోనా రెండో దశలోనూ దేశంలో ఎవరైనా సాయం కోరితే.. వెంటనే స్పందిస్తూ ఆపద్భాందవుడిలా ఆదుకుంటున్నాడు. దాంతో చాలామంది ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి హూమా ఖురేషి(Huma Qureshi).. సోనూసూద్ ప్రధానమంత్రి కావాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ఆమె వ్యాఖ్యలపై నటుడు సోనూసూద్ స్పందించారు.
"ఆమె నా గురించి ఇలా చెప్పడం ఆమె మంచి మనసుకు నిదర్శనం. నేను ఈ గౌరవానికి అర్హుడిని అనుకుంటే, నేను తప్పక ఏదైనా మంచి పని చేశాననే చెప్పాలి. కానీ ఆమె చెప్పిన మాటలకు నేను ఏకీభవించను. ఇప్పుడు మనకు సమర్ధవంతమైన ప్రధాని ఉన్నారు. ఇంకా నాకు అంత వయసు కూడా రాలేదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అయితే చిన్నవయసులోనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.. అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. ఆయన విశిష్టమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. అయితే నాకు అంత అనుభవం కూడా లేదు. నేను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేని వారు అక్కడ చాలామంది ఉన్నారు. నా గురించి వారు కలత చెందాలని కోరుకోను. నేను నా పని చేయడం చాలా ముఖ్యం. నటుడిగా సంతృప్తిగా రాణిస్తున్నాను. ఇప్పుడు సామాన్యుల కష్టాలలో ఒకడిగా భాగం పంచుకుంటున్నాను. అధికారం, పదవి లేకుండా కూడా మనందరం కలిసి పనిచేయగలమని అనుకుంటున్నా."