కరోనా సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించడమేగాక.. ఎంతోమంది నిస్సహాయులకు చేయూతనిచ్చి రియల్ హీరోగా మారారు నటుడు సోనూసూద్. ముఖ్యంగా వలస కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రోగులు.. ఇలా ఎంతోమందికి సాయంగా నిలబడ్డారు. చాలామందిలో స్ఫూర్తి రగిలించారు. అందుకే ప్రజలు ఆయన ఫొటోలను ఇంట్లో పెట్టుకొని దేవుడిలా పూజిస్తున్నారు. వీధుల్లో విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. కేంద్ర ఎన్నికల సంఘం, సోనూ సేవలకు మెచ్చి పంజాబ్‌కు ఐకాన్‌గా ప్రకటించింది. ఇప్పుడు సోనూ మరో ఘనత సాధించారు.
పేదలను ఆదుకోవడంలో సోనూసూద్ అగ్రస్థానం! - సోనూసూద్ లాక్డౌన్
కష్టకాలంలో సోషల్ మీడియా ద్వారా పేదలను ఆదుకున్న వారిలో నటుడు సోనూసూద్ టాప్‌లో నిలిచారు. మొత్తంగా అన్ని విభాగాలు కలిపి ఓ అనలైటికల్ సంస్థ తయారు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.
కష్టకాలంలో ట్విట్టర్ సహాయంతో పేదలను ఆదుకున్న వారిలో సోనూసూద్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్స్టార్లు షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్‌ను వెనక్కినెట్టారు. సోషల్ మీడియా అనలైటికల్ సంస్థ ప్రకటించిన అక్టోబర్‌కు సంబంధించిన నివేదికలో.. అన్ని విభాగాల్లో కలిపి సోనూ నాలుగో స్థానంలో నిలిచారు. అంటే.. రాజకీయాలు, జర్నలిజం, వ్యాపారం, క్రీడలు, సినిమాలు, సాహిత్యం ఇలా అన్ని రంగాల్లో కలిపి టాప్ సెలబ్రిటీస్ ఎవరని శోధించగా.. సోనూ అందులోనూ చోటు దక్కించుకున్నారు. అగ్రస్థానంలో మోదీ, రెండో స్థానంలో రాహుల్ గాంధీ, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉండగా.. 2.4మిలియన్ల ప్రస్తావనలతో నాలుగో స్థానంలో సోనూసూద్ ఉన్నారు. సోనూసూద్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.8 మిలియన్లు, ట్విటర్లో 4.7మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 3.7మిలియన్ల ఫాలోవర్లున్నాయి. ఆయనను షారుక్‌ఖాన్, అక్షయ్‌కుమార్ లాంటి ప్రముఖులు కూడా అనుసరిస్తున్నారు.