బాలీవుడ్ నటుడు సోనూసూద్ తన సహృదయాన్ని మరోసారి చాటుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన పరిస్థితుల రిత్యా ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీల కోసం ఆయన ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఇటీవల మహారాష్ట్రలో ఉంటున్న వలస కూలీలను కర్ణాటకకు పంపించేందుకు 10 బస్సులను ఏర్పాటు చేశారు. తాజాగా ఆయన ముంబయిలో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికులను తమ సొంత గ్రామాలకు పంపించేందుకు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారు. దీంతో మే 15న ముంబయి నుంచి లఖ్‌నవూ, హర్దోయ్, ప్రతాప్‌గఢ్, సిద్ధార్థ్‌నగర్‌తోపాటు బిహార్, ఝార్ఖండ్‌లోని పలు నగరాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వలస కార్మికులను పంపించారు. ప్రయాణంలో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలతో పాటు భోజనాన్నీ ఏర్పాటు చేశారు.
'ఆఖరి కూలీ ఇంటికి చేరే వరకు కొనసాగిస్తా'
నటుడు సోనూసూద్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. ఇటీవలే మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వెళ్లాల్సిన వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలను వారి సొంతగ్రామాలకు పంపించడానికి రవాణా సౌకర్యాన్ని కల్పించారు.
ఈ విషయంపై సోనూసూద్ మాట్లాడుతూ.. "జీవనోపాధి కోసం వలసలు వచ్చి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉపాధిలేక కుటుంబ పోషణ భారమై.. స్వస్థలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను చూస్తుంటే నా హృదయం ద్రవిస్తోంది. భార్యాపిల్లలతో కలిసి సొంత గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న ఎంతోమందిని చూసి బాధపడ్డాను. ఆఖరి వలస కూలీ తన స్వస్థలానికి చేరుకుని, కుటుంబసభ్యులను కలిసే వరకూ నేను రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూనే ఉంటాను. ఇది నా హృదయానికి ఎంతో చేరువైన కార్యక్రమం" అని తెలిపారు.
ఇదీ చూడండి..'నా డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడటానికి నువ్వెవరు'