కరోనా మహమ్మారితో నెలకొన్న ప్రస్తుత కష్టకాలంలో అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తూ హీరో అయ్యారు నటుడు సోనూసూద్. తాజాగా ఆయన నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ట్వీట్లు చేశారు.
"దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. కొవిడ్-19 విపత్కర కాలంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టకూడదు. జేఈఈ, నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు చాలా దూరం నుంచి వస్తుంటారు. బిహార్‌లో కొన్ని జిల్లాలు వరదలతో ప్రభావితమయ్యాయి. మరికొన్ని చోట్ల లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. పరీక్షలు ముఖ్యమైనవే. కానీ విద్యార్థులను రక్షించుకోవడం అంతే ముఖ్యం. ప్రపంచం మొత్తం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పరీక్షలు కూడా వాయిదా వేయాలి" అని ప్రస్తుత పరిస్థితులను వివరించారు సోనూ.
దేశవ్యాప్తంగా నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ డిమాండ్‌లు వినిపిస్తున్నా.. పరీక్షలు యథావిధిగా జరుగుతాయంటూ మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సర్క్యులర్ జారీ చేసింది.