'దబాంగ్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి హిట్ కొట్టిన సోనాక్షి సిన్హా.. అప్పటినుంచి ప్రతి ఏడాది కనీసం రెండు సినిమాలు చేస్తూ వచ్చింది. ఆమె కెరీర్ మొదలై దశాబ్దం గడిచిపోయింది. నిత్యం సినిమా షూటింగులు, ప్రచార కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపేసిన సోనాక్షికి ఆ జీవితం బోర్ కొట్టేసిందట.
ఈ జీవితం బోర్ కొట్టేసింది: సోనాక్షి సిన్హా - Sonakshi Sinha bollywood
వరుసగా సినిమాలు చేయడం వల్ల తనకు తీరిక లేకుండా పోయిందని హీరోయిన్ సోనాక్షి సిన్హా అభిప్రాయపడింది. ఇకపై కాస్త నెమ్మదిగా చిత్రాలు చేయాలనుకుంటున్నానని తెలిపింది.
"ఇకపై కాస్త నెమ్మదిగా సినిమాలు చేయాలని నాకు నేనుగా తీసుకున్న నిర్ణయమే. ఇన్నేళ్లుగా సినిమాలు చేసి అలసటగా అనిపిస్తోంది. నా కోసం నేను సమయం కేటాయించుకోవడం లేదు అని అర్ధమైంది. వర్కవుట్లు చేసే తీరిక సరిగ్గా దొరక్క బరువు పెరుగుతున్నానేమో అనే భావన కలుగుతోంది. అన్నింటికంటే ముందు నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకోగలగాలి. అలా జరగాలంటే నీ కోసం నువ్వు సమయం ఇవ్వగలగాలి. నాకు పనిచేయడం చాలా ఇష్టం. అందుకే ఇన్నేళ్లు విరామం లేకుండా చేస్తున్నాను. ఇప్పుడు కాస్త ఆగాల్సిందే నాకిష్టమైన పెయింటింగ్, జిమ్ కూడా సమయం ఇవ్వాలనుకుంటున్నాను. పనిని ప్రేమించడమే కాదు వ్యక్తిగత జీవితమూ ముఖ్యమే" అని సోనాక్షి చెప్పింది.
అజయ్ దేవగణ్‌తో కలిసి ఆమె నటించిన 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' గతేడాది సిద్ధమైనా కరోనా కారణంగా ఆగిపోయింది. త్వరలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది సోనాక్షి.