సినిమా బాగుంది అన్న టాక్ వస్తే చాలు.. బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిపోతుంది. ఓ సినిమా 100 రోజులు ఆడింది అంటే అది ప్రేక్షకుల దృష్టిలో పెద్ద హిట్! మరి అదే సినిమా థియేటర్లలో 100 రోజులకు మించి ఆడితే ఇంక ఆ సినిమాకు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో, ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే అలాంటి సినిమాలను రీరిలీజ్ చేస్తుంటారు. సాధారణంగా రీరిలీజ్ కూడా ఒకటి లేదా రెండు సార్లు చేస్తారు. కానీ ఓ సినిమాకు 550పైగా రీరిలీజ్‌లు ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ నిజం. ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర దర్శకత్వంలో శాండిల్‌వుడ్ స్టార్ నటుడు శివరాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన 'ఓం' చిత్రం సృష్టించిన రికార్డులే ఇవన్నీ. 1995లో విడుదలైన ఈ చిత్రానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో చూసేద్దాం..
ఒక లెటర్‌తో స్టోరీ..
ఎవరో రాసిన ఓ లేఖ నుంచి ఈ సినిమా కథ పుట్టింది అంటే నమ్మగలరా? కానీ 'ఓం' సినిమా విషయంలో అదే జరిగింది. 80వ దశకం చివరిలో ఈ కథ రూపుదిద్దుకుంది. కాలేజీ రోజుల్లో ఉపేంద్ర స్నేహితుడు పురుషోత్తం.. అతని దృష్టిని ఆకర్షించిన ఓ లేఖను ఉపేంద్రకు చూపించాడు. ఆ లేఖ నుంచి పొందిన స్ఫూర్తితో.. దర్శకుడు తన కథలోని మొదటి భాగాన్ని సిద్ధం చేశారు.
నిజ జీవిత కథ..
ఈ సినిమా నేపథ్యాన్ని ఉపేంద్ర సోదరుడి స్నేహితుడైన సత్య అనే వ్యక్తి జీవితం ఆధారంగా తీర్చిదిద్దారు. ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఈ కథ నేపథ్యం.
సినిమా కోసం బెయిల్
ఈ చిత్రంలో నిజ జీవితంలో అండర్‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తులు నటించారు. ఇందుకోసం కొందరు నేరస్థులకు బెయిల్ ఇప్పించాల్సి వచ్చింది. జేదరహల్లి కృష్ణప్ప, బెక్కిన కన్ను రాజేంద్ర, కోరంగు, తన్వీర్ వంటి పేరు మోసిన రౌడీలు ఇందులో నటించారు.
దేశమంతటా చర్చే..!
ఈ సినిమా విడుదలకాక ముందు నుంచే దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో పెద్ద చర్చ నడిచింది. ఇటువంటి సినిమాను దిగ్గజ నటుడు రాజ్‌కుమార్ బ్యానర్లో నిర్మించి ఉండాల్సింది కాదంటూ ఓ మ్యాగజైన్ ఏకంగా కవర్ స్టోరీనే ప్రచురించింది.