కొంతమంది వ్యక్తులు తనని కావాలనే 'ఆంటీ' అంటూ కామెంట్లు చేస్తుంటారని బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మతోండ్కర్ అన్నారు. గురువారంతో ఆమె 47 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన బర్త్‌డే ప్లాన్స్‌తోపాటు కొన్ని ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.
'ఆంటీ అంటూ ట్రోల్ చేసినా పట్టించుకోలేదు' - ఊర్మిళా మతోండ్కర్ పుట్టినరోజు
కొంతమంది కావాలనే తనని 'ఆంటీ' అంటూ ట్రోల్ చేస్తుంటారని అన్నారు నటి ఊర్మిళా మతోండ్కర్. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
"జన్మదిన వేడుకలను భారీగా జరుపుకోవడంపై నాకు అంతగా ఆసక్తి ఉండదు. కానీ, కుటుంబసభ్యుల పుట్టినరోజు వేడుకలకు మాత్రం ఎన్నో ప్లాన్స్ వేస్తాను. పుట్టినరోజు నాడు అవసరమైన వారికి ఎంతోకొంత ఆర్థిక సాయం చేయడం గురించి చిన్నప్పుడే నా తల్లిదండ్రులు నేర్పించారు. అలా అవసరమైన వారికి ఏదో ఒకరకంగా తప్పకుండా సాయం చేస్తుంటాను" అని ఆమె తెలిపారు.
అనంతరం తనపై వస్తోన్న ట్రోల్స్‌పై స్పందిస్తూ.. "సమాజంలో కొంతమంది వ్యక్తులు కావాలనే సామాజిక మాధ్యమాల వేదికగా వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటారు. నన్ను కూడా 'ఆంటీ' అని పేర్కొంటూ ఎంతో మంది ట్రోల్ చేశారు. కానీ, ఆ విమర్శలు చూసినప్పుడు నేను ఏం బాధపడలేదు. ఎందుకంటే అలాంటి కామెంట్లను పట్టించుకోను. నా పనిని నేను చేసుకుంటూ.. ముందుకు సాగిపోతుంటాను" అని ఊర్మిళ వివరించారు.